Apr 17, 2018


భారీ స్థాయిలో పెరిగిన
వ్యవసాయం, అనుబంధ రంగాల ఉత్పత్తులు
వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి

           సచివాలయం, ఏప్రిల్ 17: రాష్ట్రంలో గత మూడున్నరేళ్లలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉత్పత్తులు భారీస్థాయిలో పెరిగినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 62 శాతం మంది అంటే దాదాపు మూడు కోట్ల మంది ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నరని తెలిపారు. అందువల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగానికి, రైతుల సమస్యలకు అత్యంత ప్రాధాన్య ఇస్తున్నారని చెప్పారు.  ప్రభుత్వం అన్ని విధాల, ప్రకృతి సహకరించని సందర్భాలలో కూడా రైతులకు అండగా నిలిచిందన్నారు.
        వ్యవసాయంలో రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం తగ్గించడానికి, ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహించడానికి, రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిచడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దాంతో రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం బాగా తగ్గిందని,  వ్యవసాయ, ఉద్యానవన పంటల ఉత్పాదకత, ఉత్పత్తి బాగా పెరిగినట్లు వివరించారు. ధాన్యంతోపాటు కందులు, మినుములు, పెసర పంటలు బాగా పండాయని, దిగుబడులు బాగా వచ్చాయని తెలిపారు. పట్టు ఉత్పత్తి కూడా పెరిగినట్లు తెలిపారు. అక్వాకల్చర్ లో 34.84 శాతం వృద్ధి సాధించినట్లు చెప్పారు.  
రూ. 13,846 కోట్లు ఉన్న వ్యవసాయ రంగం బడ్జెట్ రూ.19,070 కోట్లకు పెంచామని, మార్కెటింగ్ కు మరో రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 2017-18లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో 17.76 శాతం వృద్ధి రేటు సాధించినట్లు చెప్పారు. జాతీయ వృద్ధి రేటు 3 శాతం మాత్రమే పెరిగినట్లు తెలిపారు.
           ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, లక్షా 65వేల ఎకరాలకు చేరిందని, 2020-21 నాటికి 5 లక్షల ఎకరాలకు చేరాన్నది లక్ష్యంగా పేర్కొన్నారు. బిందు తుంపర్ల సేద్యం, సాయిల్ హెల్త్ కార్డులు, ఈ-క్రాప్ లలో దేశంలో ఏపీ ముందున్నట్లు వివరించారు. సెరికల్చర్ లో రెండవ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఈ రంగంలో 35,069 మంది రైతులకు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇస్తున్నట్లు చెప్పారు. బిందు తుంపర్ల సేద్యానికి రూ.1100 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ప్రేమ్ జీ, గేట్స్ ఫౌండేషన్ వంటి సంస్థలు ముందుకు వచ్చి సహకరిస్తున్నట్లు చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి రూ.2,378 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. జొన్న, మొక్క జొన్న పంటలకు ఒక్కో రైతుకు వంద క్వింటాళ్ల వరకు క్వింటాల్ కు రూ.200 ల చొప్పున, రూ.20వేలు ఇస్తున్నట్లు వివరించారు. దాదాపు 25 వేల ఎకరాలకు పంట నష్టం జరిగిందని, ఆ రైతులకు నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
               వ్యవసాయ పంటలు నిల్వ చేయడానికి స్టోరేజీ సౌకర్యం పెంచడంలో భాగంగా 4 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యం కలిగిన గూడౌన్లు రూ.220 కోట్ల వ్యయంతో నిర్మించాలని నిర్ణయించనట్లు చెప్పారు. ఇందుకోసం ఒక కార్పోరేషన్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నర్సరీలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పారు. ఆక్వా కల్చర్  రంగానికి విద్యుత్ ఛార్జీలను రూ.6ల నుంచి రూ.3.60లకు తగ్గించామన్నారు. మిరప రైతులు రోడ్డున పడకుండా ఆదుకున్నట్లు చెప్పారు. తెలంగాణ, మహారాష్ట్రంలో రైతులు రోడ్డెక్కిన విషయం గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలో యాత్రీకరణకు 450 కోట్లు ఖర్చు చేస్తున్నామని, మైక్రో ఇరిగేషన్ బడ్జెట్ రూ.1170 కోట్లకు పెంచామన్నారు. వ్యవసాయ రంగంలో దేశంలో అన్ని అనుకూల పరిస్థితులు ఉన్న రాష్ట్రాలతో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మన రాష్ట్రం పోటీపడుతుందని చెప్పారు. ప్రతి సోమవారం ముఖ్యమంత్రి వీడియో కాన్షరెన్స్ లో ముందుగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల దినం రోజున అయిదు జిల్లాల్లో తాను హాజరై, రైతుల సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. గుంటూరు మిర్చి రైతుల ఫిర్యాదులు తానే స్వీకరించి వారిని ఆదుకున్నట్లు చెప్పారు. 2014-15లో రసాయనిక ఎరువులు 36 లక్షల మెట్రిక్ టన్నులు వాడగా, ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల 2017-18లో 28 లక్షల మెట్రిక్ టన్నులకు, పురుగుల మందులు 2131 మెట్రిక్ టన్నుల నుంచి 998 మెట్రిక్ టన్నులకు తగ్గినట్లు వివరించారు. ఇక్రిశాట్ మద్దతుతో తెగుళ్లకు వెంటనే పరిష్కారం సూచిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయ సిబ్బంది కూడా బాగా పని చేస్తున్నట్లు మంత్రి సోమిరెడ్డి  తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...