Apr 18, 2018


విగ్రహాలు కాదు ఆలోచనలు అమలు కావాలి
అంబేద్కర్ జయంతి సభలో మంత్రి నక్కా ఆనందబాబు
             సచివాలయం, ఏప్రిల్ 18: దేశమంతటా బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయడం కాదని, ఆయన  ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చి  అమలు చేయాలని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తు సమావేశ మందిరంలో బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతిని ప్రపంచ విజ్ఙాన దినోత్సవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ దేశంలో భారత రత్న ఇవ్వదగిన మొదటి వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడానికి 1990 వరకు ఆగవలసి వచ్చిందని చెప్పారు. నిబద్దతతో రాజ్యాంగ రచన చేసిన మహావ్యక్తి అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ తన చివరి రోజులలో నిమ్నజాతుల కోసం తానుపడిన కష్టాన్ని గుర్తుకు తెచ్చుకొని, తాను ఇక్కడకు వరకు లాక్కొచ్చిన  రధాన్ని ముందుకు తీసుకువెళ్లండని, వెనక్కు మాత్రం తీసుకువెళ్లవద్దని చెప్పారన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే వెనక్కు వెళుతున్నట్లుగా ఉందన్నారు. ఏసీబీ దాడులు ఎక్కువగా ఎస్సీ, ఎస్టీలపైనే ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. వారికి ప్రమోషన్ లో కూడా అన్యాయం జరుగుతున్నట్లు గమనించినట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ యాట్రాసిటీ చట్టంపై  కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారని గుర్తు చేశారు. ఎస్టీ,ఎస్టీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఆనందబాబు అన్నారు.
                 ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ రిజర్వేషన్ విషయంలో అంబేద్కర్ తన వాదనా పటిమతో అందరినీ ఒప్పించారన్నారు. ఆ తరువాత కూడా బీసీ రిజర్వేషన్ కు దేశంలో వ్యతిరేకత వ్యక్తమయినప్పుడు న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ ఆనాడు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని ఒప్పించి రాజ్యాంగ సవరణ చేయించాలని చెప్పారు. దేశంలో రిజర్వేషన్ వ్యతిరేక వర్గం ఒకటి ఎప్పుడూ ఉంటుందని దానిని ఒప్పించగల వాదనా సామర్ధ్యం మనం పెంపొందించుకోవాలని ఆయన చెప్పారు. అంబేద్కర్ ఒక్క ఎస్టీ,ఎస్టీ వర్గాల కోసమే కాకుండా బలహీన వర్గాలు, మహిళలు, బాధితుల పక్షాన నిలిచిన గొప్పవ్యక్తని తెలిపారు. ఎస్టీ,ఎస్టీ యాట్రాసిటీ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్సందించడం హర్షణీయం అన్నారు.
                       సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ మాట్లాడుతూ ఎస్టీ,ఎస్టీలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వారికి వ్యతిరేకత వ్యక్తమయిన సందర్భాలలో ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేకర్ మాట్లాడుతూ దేశంలో కుల వ్యవస్థ పాతుకుపోయిందని, వ్యక్తిత్వం, వ్యక్తి సామర్ధ్యం, గొప్పతనం ఏవీ కనిపిచవని, అతని కులం మాత్రమే కనిపిస్తుందని చెప్పారు.  అన్నీ కులం ముందు బలాదూర్ అన్నారు. ఎస్టీ,ఎస్టీలకు ప్రమోషన్ లో అన్యాయం జరుగుతున్న విషయాన్ని తాను గమనించినట్లు చెప్పారు. మన సమస్యల పరిష్కారానికి ఐక్యత అవసరం అన్నారు. నాయకత్వం లోపం కనిపిస్తుందని చెప్పారు. ప్రభుత్వ కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడకు వెళ్లాలన్నారు. అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడి ఉంటామని స్లోగన్స్ ఇవ్వడం కాకుండా, ఆయన ఆలోచనలను అవగాహన చేసుకొని నడుచుకోవాలని చెప్పారు. అందుకు ఆయనకు సంబంధించిన ప్రామాణిక  పుస్తకాలను ఉచితంగా ఇస్తానన్నారు.
వెనుకబడిన వర్గాలపైనే అత్యాచారాలు ఎక్కువ:కె.సునీత
                 దేశంలో జరిగే అత్యాచారాలలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాలపైనే ఎక్కువగా జరుగుతున్నాయని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి కె.సునీత తెలిపారు. ఎందుకంటే వారి తరపున ఎవరూ రారన్న ధైర్యమేనన్నారు. పేదవర్గాల మహిళలు పనులకు వెళ్ళినప్పుడు వారి పిల్లలను ఇంట్లో వదిలి వెళుతుంటారని ఆ సమయంలోనే వారిపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతుంటాయని చెప్పారు. దీనికి ఒకటే పరిష్కారమని, అందరూ కలసికట్టు ఉండి, వారిని ముట్టుకుంటే ప్రమాదం అన్న మెసేజ్ ఇవ్వాలన్నారు. అంబేద్కర్ సామాజికంగా వెనుకబడిన మహిళల గురించి కూడా ఆలోచించారని చెప్పారు.
ఇల్లు అద్దెకు కావాలంటే కులం అడుగుతున్నారు: విజయ్ కుమార్
                    అంబేద్కర్ 1917లో లండన్ లో చదువు ముగించుకొని వచ్చి బరోడా మహారాజు సంస్థానంలో అంటరానితనం ఎదుర్కొన్నారని, వందేళ్ల తరువాత కూడా విజయవాడలో ఇల్లు అద్దెకు కావాలంటే కులం అడుతున్నారని ఎస్సీ కార్పోరేషన్ వైస్ చైర్మన్ జిఎస్ఆర్ కెఆర్ విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నేటి ఆధునిక తరంలో అంటరానితనం రూపం మారిందన్నారు. కుల వ్యవస్థ మానవత్వాన్ని, మానవ సంబంధాలను నాశనం చేసిందన్నారు. కులం ముందు నైతికత, వ్యక్తిత్వం, సామర్ద్యం, చదువు, విశిష్టత వంటివి ఏవీ అగవని చెప్పారు. ఏ పదవి కావాలన్నా కులంపైనే ఆధారపడి ఉందన్నారు. అరవటం కాదు అంబేద్కర్ విధానం అర్ధం చేసుకోవడం ముఖ్యం అన్నారు. ఆయన గురించి తెలుసుకోవడం ఒక ఎత్తైతే, ఆయన ఆలోచనలు కొనగాగించడం ఒక ఎత్తన్నారు. అంబేద్కర్ అందరివాడని, ఆయన యావత్ మానవ జాతికి చెందిన వ్యక్తన్నారు. చరిత్ర తెలిసినవాడే తిరగరాయగలడన్నారు. అందువల్ల విద్య, విజ్ఙానం ఎంతో ముఖ్యమని చెప్పారు. స్వాభిమానం, గౌరవంతో బతకాలన్నారు. మనం ఎక్కడ నుంచి వచ్చామో మరువకూడదని చెప్పారు. అంబేద్కర్ అందించిన ఫలాలు అందుకొని కొందరు స్వార్ధపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  మనం పైకి వచ్చిన తరువాత మన జాతికి సహాయపడాలని, స్వగ్రామంలో అభివృద్ధికి సహకరించాలన్నారు. మనం నీతి, నిజాయాతీ, సత్పవ్రర్తనతోపాటు  చేసే పనిలో,  శాఖపై సంపూర్ణ అవగాహన, విషయ పరిజ్ఞానంతో ఉండాలన్నారు. ఏ పనైనా చేయగల సమర్థతతో ఉండాని చెప్పారు. ఆనాడు తప్పనిసరిగా తగిన గౌరవం లభిస్తుందన్నారు.
తెలంగాణ ఐఏఎస్ అధికారి మురళి మాట్లాడుతూ మన దేశంలో వనరులు ఎక్కువ ఉన్నా తగిన స్థాయిలో అభివృద్ధి చెందకపోవడానికి ప్రధాన కారణం కుల తత్వమేనన్నారు. ఎస్సీ,ఎస్టీ కులాలకు ఇచ్చే పథకాలన్నిటినీ మూటకట్టి పక్కన పడేసి ఒక్క చదువుకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అందరికీ ఉన్నతమైన, ఉత్తమమైన చదువులు చెప్పిస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. నేడు ప్రభుత్వ పాఠశాలలో చదివేవారిలో 70 శాతం మంది ఎస్సీఎస్టీలేనని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్థాయికి తీసుకువెళ్లాలన్నారు. ప్రభుత్వ పథకాలు దిగువ స్థాయికి వెళ్లడానికి కృషి చేయాలని చెప్పారు. స్వగ్రామంలో పేదవర్గాల విద్యాభివృద్ధికి అందరూ కృషి చేయాలన్నారు.  దేశంలో ఓటు బ్యాంకు రాజకీయాలు ఎక్కువన్నారు. ఆర్థిక శాఖ  ప్రత్యేక కార్యదర్శి కెవివి సత్యనారాయణ మాట్లాడుతూ ఆ రోజుల్లో ఆయన విద్య ప్రాముఖ్యతను గుర్తించి నాలుగు డాక్టరేట్లు సాధించారన్నారు. సమానత్వం కోసం పాటుపడ్డారని చెప్పారు. ఆయన ద్వారా లబ్దిపొందిన మన ప్రవర్తన ఆయన గౌరవాన్ని పెంచేవిధంగా ఉండాలన్నారు.

            ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ కరికాలవలవేన్, మైనార్టీ విభాగం ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్ కుమార్,  కార్యదర్శి బి.రామాంజనేయులు, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గందం చంద్రుడు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళి, సచివాలయ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.బొంజు బాబు, ఉపాధ్యాక్షులు శ్యామ్ సుందర్ రావు, కత్తి రమేష్, సంపత్(హోం) తదితరులు ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం కార్యక్రమాల నిర్వహణకు రూ.5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కోరగా మంత్రి ఆనందబాబు అంగీకరించారు. అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని జిఎస్ఆర్ కెఆర్ విజయ్ కుమార్ అందరికి అందజేశారు. గాయకుడు రత్నం జాషువా పధ్యాన్ని,  అంబేద్కర్ పై ఓ పాటను చక్కగా పాడారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...