Apr 11, 2018

ప్రభుత్వ గృహాల నిర్మాణం వేగం పెంచాలి

అధికారులకు సీఎస్ దినేష్ కుమార్ ఆదేశాలు
              సచివాలయం, ఏప్రిల్ 11: వివిధ పథకాల కింద ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన  గృహ నిర్మాణాల  వేగం పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ సిఎస్ సమావేశ మందిరంలో బుధవారం సాయంత్రం  గ్రామీణ గృహ నిర్మాణ పనితీరుని ఆయన సమీక్షించారు. ఇప్పటి వరకు పూర్తి చేసిన లక్ష్యాలను తెలుసుకొని ఆ శాఖ సిబ్బందిని సీఎస్ అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ - గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల భాగస్వామ్యంతో నిర్మించే ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణం, ఎన్టీఆర్ అర్బన్ గృహ నిర్మాణం వంటి అన్ని పథకాల పనితీరుని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గృహ నిర్మాణం వేగం పెంచి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. నిర్మాణంలో వెనుకబడిన జిల్లాలలో కూడా నిర్ణయించిన సమయానికి అనుకున్న లక్ష్యాలను పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
ఈ ఆర్థిక సంవత్సరంతో కలుపుకొని నాలుగేళ్లలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద 13,28,965 ఇళ్లకు రూ. 20,197.13 కోట్లు కేటాయించినట్లు గృహ నిర్మాణ సంస్థ ఎండి కాంతిలాల్ దండే సీఎస్ కు వివరించారు. 2017 మార్చి వరకు 1,67,883 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. 2017-18 సంవత్సరానికి 5 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం కాగా, రూ.3277.29 కోట్ల వ్యయంతో 3,15,985 ఇళ్లు నిర్మించినట్లు చెప్పారు. 2018-19 సంవత్సరానికి 5 లక్షల 71 వేల ఇళ్లు నిర్మించాలన్నది లక్ష్యంగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద 2016-17లో రెండు లక్షల ఇళ్లు కేటాయించగా, 1,97,927 ఇళ్లు గ్రౌండ్ అయినట్లు తెలిపారు. రూ.1,386.51 కోట్ల వ్యయంతో 1,54,194 ఇళ్లు నిర్మానం పూర్తి అయినట్లు వివరించారు. 43,733 ఇళ్ల నిర్మాణం కొనసాగుతున్నట్లు చెప్పారు. 2017-18లో రెండు లక్షల ఇళ్లు కేటాయించగా, వాటిలో 1,38,922 గ్రౌండ్ అయినట్లు, రూ.612.01 కోట్ల వ్యయంతో 58,576 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు వివరించారు. 80,346 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు చెప్పారు. 2018-19లో రెండు లక్షల ఇళ్లు కేటాయించగా, 1,80,141 ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు రూ.229.90 కోట్ల వ్యయంతో 14,558 ఇళ్ల నిర్మాణం పూర్తి అయినట్లు చెప్పారు. జూన్ 8 నాటికి 4 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని దండే చెప్పారు. లక్ష్యాలను పూర్తి చేయడంలో నెల్లూరు జిల్లా ముందున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో గృహ నిర్మాణ సంస్థ అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...