Apr 26, 2018



శ్రీవారి అత్తింటివారికి అవకాశం!
              తిరుమల తిరుపతి దేవస్థానాల(టీటీడీ) పాలకవర్గం నియామకంలో  పొరపాటు జరిగిపోయింది. మన దేశంలో వేల ఏళ్లుగా  ఆధ్యాత్మికంగా, సామాజికంగా పాతుకుపోయిన వ్యవస్థలో ఇటువంటి పాలకవర్గాల నియామకంలో ప్రభుత్వాలు ఎన్నో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. అందులోనూ ప్రపంచంలోని ప్రతి హిందువు కులాలతో సంబంధంలేకుండా  ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునేంతటి ప్రాచుర్యం పొందిన దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరుడు. అంతర్జాతీయ స్థాయిలో అంతటి విశిష్టిత కలిగిన దేవాలయ కమిటీ పాలకవర్గ సభ్యులు మతపరంగా, ఆధ్యాత్మికంగా, నడవడిక పరంగా అంతటి ప్రాధాన్యత కలిగిన వ్యక్తులై ఉండాలని హిందువులు ఆశిస్తారు.  అటువంటి కమిటీ నియామకంలో తప్పుగానీ, పొరపాటు గాని జరిగితే  అది సమాజపరంగానే కాకుండా ప్రభుత్వ పరంగా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నియామకాలు కులాలు, రాజకీయ ప్రాతిపదికన జరిగినప్పటికి హిందువుల మనోభావాలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు పాటించవలసి ఉంది.
         ఆ కమిటీ చైర్మన్ పదవి ఓ యాదవుడికి ఇవ్వడం పట్ల ఎవరూ అభ్యంతరం చెప్పరు. శ్రీకృష్ణుడు యాదవ వంశానికి చెందినవాడు. అందువల్ల యాదవులకు ఆ రకమైన గుర్తింపు ఉంది. అయితే ఇక్కడ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ను ఆ పదవికి ఎంపిక చేయడం పట్లే అభ్యంతరం వ్యక్తమవుతోంది. ఆ పదవికి ఆయన పేరు ఎంపిక చేస్తున్నట్లు ప్రచారం జరిగిన సమయంలోనే, ఆయన క్రిస్టియన్ మత ప్రచార సభలలో పాల్గొంటారని విమర్శలు వ్యక్తమయ్యాయి. వాస్తవానికి ఆయన ఆ సభలలో పాల్గొనడం తప్పేమీకాదు. అది మత సామరస్యానికి ప్రతీక కూడా. సామాజిక పరంగా అది మంచిపనే. కానీ ఇక్కడ విశ్వాసాలు వేరు. ఏ మతమైనా  మతపరమైన వ్యక్తుల మనోభావాలు వేరుగా ఉంటాయి. ప్రస్తుత వ్యవస్థలో వాటిని ప్రభుత్వాలు గుర్తించి, గౌరవించక తప్పదు. ఇది సున్నితమైన అంశమైనప్పటికీ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కు ప్రాధాన్యత ఇవ్వదలచుకుంటే ప్రభుత్వంలో మరో ఉన్నతమైన పదవి ఇచ్చి, టీటీడీ చైర్మన్ గా ఇటువంటి వివాదాలకు అవకాశంలేని వారిని నియమిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో భూమన కరుణాకర రెడ్డిని కమిటీ చైర్మన్ గా నియమించినప్పుడు కూడా అయన నాస్తికుడని, ఆయనను దైవ సంబంధమైన  కమిటీలో ఎలా నియమిస్తారని విమర్శలు వచ్చాయి.  కమిటీ సభ్యులుగా ఓ దళిత వ్యక్తిని నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయం స్వాగతించదగినది. వారిని ఆధ్యాత్మికంగా, సామాజికంగా అందరితో సమానంగా గుర్తించి తగిన స్థానం ఇవ్వవలసిన బాధ్యత అందరిపై ఉంది. వారిని ఆ విధంగా గౌరవించిన నాడు తమను తక్కువగా చూస్తున్నారన్న భావన వారిలో తొలగిపోయే అవకాశం ఉంది.  ఇటువంటి నియామకాల విషయంలో మత పరంగా వారు ఆచరించే విధానాలు, ఆలోచనలు, సమాజంలో వారికి ఉన్న గుర్తింపు వంటివాటిని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం ఉంది.  కమిటీ సభ్యురాలిగా పాయకరావు పేట శాసనసభ్యురాలు వంగలపూడి అనిత నియామకం కూడా విమర్శలకు దారితీసింది. గతంలో  స్వయంగా ఆమే తన కారులో, తన బ్యాగ్ లో  తప్పనిసరిగా బైబిల్ ఉంటుందని చెప్పారు. ఆమె అటు క్రీస్తుని, ఇటు వెంకటేశ్వరుడిని నమ్మవచ్చు, పూజించవచ్చు, ప్రార్ధించవచ్చు. ఒక రకంగా అది మంచిదే. కానీ మత విశ్వాసాలు ఇటువంటి వాటిని అనుమతించవు. ఏ మత పెద్దలైనా ఇటువంటివాటిని అంగీకరించరు. తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతోందని, దానిని అరికట్టాలని,  ఉద్యోగులలో కొందరు క్రైస్తవులు ఉన్నారని, వారిని బదిలీ చేయాలని హిందువులు గగ్గోలు పెడుతున్నారు.   ఈ నేపధ్యంలో అనిత నియామకం వివాదాలకు దారి తీసింది. పరిస్థితిని అర్ధం చేసుకొని తన నియామకాన్ని రద్దు చేయమని ఆమె కోరడం అభినందనీయం. ఇటువంటి చర్యలు వేల సంవత్సరాలుగా హిందువులోల జీర్ణించుకుపోయిన మనోభావాలను దెబ్బతీస్తాయి. మనది లౌకక రాజ్యమైనా ఇటువంటి నియామకాల్లో మతపరమైన ఆనవాయితీలను గౌరవించకతప్పదు. ఇలాంటి నియామకాలు ప్రభుత్వాలకు కత్తిమీద సాములాంటివి.  మతపరమైన అంశాలతోపాటు అనేక సమాజిక వర్గాలను సంతృప్తిపరచవలసి ఉంటుంది. అంతేకాకుండా ఈ పదవిని అత్యంత గౌరవంగా భావించే అన్ని రంగాలలో ఉన్నతవర్గాల వారు  పోటీపడుతుంటారు. ఇటువంటి సందర్భాలలో ఏదైనా పొరపాటు జరిగితే ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి ప్రతిపక్షాలు లబ్ధిపొందాలని చూస్తుంటాయి. ప్రభుత్వం అంటే గిట్టనివారు కూడా ఇటువంటి సందర్భాలను తమకు అనుకూలంగా వాడుకుంటుంటారు. అందువల్ల మత, సామాజిక పరంగానే కాకుండా రాజకీయంగా నష్టం జరుగకుండా కూడా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.
                ఇదిలా ఉంటే శ్రీవారికి అత్తింటివారమైన తమ కులస్తులకు కమిటీలో స్థానం కల్పించలేదని పద్మశాలీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి జీవిత భాగస్వామి పద్మావతిదేవి పద్మశాలీయుల ఆడపడుచు. తిరుమల బ్రహ్మాత్సవాలలో వారికి ఆ గౌరవం దక్కుతోంది. అయితే కమిటీలో సభ్యత్వం లేదని వారు బాధపడుతున్నారు. పద్మావతీ దేవి తమ ఆడపడుచు అయినందున ప్రతిసారి కమిటీలో తమ వారికి స్థానం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపధ్యంలో కమిటీలో మార్పులు చేయవలసి రావడంతో పద్మశాలి కులస్తులకు ప్రధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా చేస్తే రాష్ట్రంలో వ్యవసాయరంగం తరువాత అత్యధిక మంది ఆధారపడే  చేనేత రంగానికి సంబంధించిన కులాలను సంతృప్తిపరచినట్లు అవుతుందన్న భావన కూడా ఉంది. అనిత తప్పుకోవడంతో హరికి అత్తింటివారికి కమిటీలో స్థానం దక్కే అవకాశం ఉంది.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...