Apr 27, 2018


ఆంత్రాక్స్ నివారణకు
మాతృభాషలో అవగాహనా కార్యక్రమాలు
ఐటీడీఏ అధికారులకు మంత్రి నక్కా ఆనందబాబు ఆదేశం


             సచివాలయం, ఏప్రిల్ 27:  విశాఖ మన్యంలో ప్రభలిన ఆంత్రాక్స్ వ్యాధి ఎక్కువ మందికి సోకకుండా గిరిజనులకు వారి మాతృభాషలైన కువి, కోదు భాషలలో అవగాహక కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. సచివాలయం 3వ బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్ లో శుక్రవారం మధ్యాహ్నం ఐటీడీఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు ఆంత్రాక్స్ సోకిన 17 మందిని విశాఖ కేజీహెచ్ కు తరలించినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. ఈ వ్యాధి ప్రభలకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి గిరిజనులకు వివరిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాధి ప్రధానంగా జంతువుల నుంచి సోకుతుందని, అందువల్ల చనిపోయిన జంతుమాంసం తినవద్దని, దానిని పూర్తిగా కాల్చాలని 11 వందల నివాస ప్రాంతాల్లో  విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం వ్యాధి ప్రభలిన రెండు మండలాల్లోనే కాకుండా గతంలో చింతపల్లి, జీకేవీధి, ముంచింగ్ పుట్ట్, అరకు, పెదబయలు మండలాలలో కూడా ఈ వ్యాధి సోకిన అనుభవాలు ఉన్నాయని, అందువల్ల పాడేరు ఐటిడీఏ పరిధిలోని గ్రామాలన్నింటిలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని చెప్పారు. గిరిజనులు జంతు మాంసం ఇళ్లలో ఎండపెడుతూ ఉంటారని దానిని నివారించాలన్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వ్యక్తి రెండు నెలల వరకు యాంటిబయాటిక్స్ వాడవలసి ఉంటుందని, కోర్సు మొత్తాన్ని వారు వాడేవిధంగా జాగ్రత్త వహించాలని చెప్పారు.
వర్షాకాలం మొదలైతే మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రభలే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రభుత్వంలోని సంబంధిత శాఖలు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి చెప్పారు. గిరిజన, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, విద్య శాఖల సిబ్బంది, సాధికార మిత్రలు, ఆషా వర్కర్లు అందరూ కలసి వారికి అవగాహన కల్పించాన్నారు. సాధికార మిత్రలను ఇంటింటికి పంపి గిరిజనులకు అర్ధమైయ్యే రీతిలో వారి మాతృభాషలో చెప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం, ప్రజాప్రతినిధులు కూడా కలసి వారికి అవగాహన కల్పించాలన్నారు.

            పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ డబ్బు లేక వ్యాధి సోకిన  గిరిజనులను ఆస్పత్రికి తరలిస్తామంటే రావడంలేదని, అటువంటి వారిని తాను దగ్గర ఉండి ముగ్గురిని విశాఖ కేజీహెచ్ కి తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం వ్యాధి సోకిన ప్రాంతంలో 80 కుటుంబాలు ఉంటున్నాయని, వారందనికి 35 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని ఆమె కోరారు. అలాగే వ్యాధి సోకినవారికి రూ.10వేల చొప్పున ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్ల పక్కన పశువులను ఉంచుతారని, అలా కాకుండా ఊరిబయట పశువుల పాకలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటే పరిశీలించమని కోరారు.  మరుగుదొడ్లు నిర్మించినా వాటిని వినియోగించుకోవడంలేదని, స్టోర్ రూమ్ లుగా వాడుకుంటున్నారని, ప్రభుత్వం పంపిణీ చేసిన దోమతెరలను కూడా సద్వినియోగం చేసుకోవడంలేదని, వాటిని వినియోగించుకునేవిధంగా వారికి అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఈశ్వరి చెప్పారు. ఆమె కోరిన విధంగా బియ్యం అందజేయమని మంత్రి ఆనందబాబు అధికారులను ఆదేశించారు.
                గిరిజన శాఖ డైరెక్టర్ గందం చంద్రుడు మాట్లాడుతూ ఆంత్రాక్స్ తోపాటు వర్షా కాలంలో ప్రభలే వ్యాధుల గురించి కరపత్రాలు ప్రచురించి పంపామని, వాటిని సంతలు జరిగే ప్రాంతాల్లో పశుసంవర్ధక శాఖ, సెర్ఫ్, సాధికార మిత్రలు కలసి పంచిపెట్టాలని చెప్పారు. అలాగే మైకుల ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. చనిపోయిన జంతువులను పూర్తిగా కాల్చివేయడం మంచిదన్నారు. పీహెచ్ సీల వారీగా మందులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. వర్షాలు పడేటప్పుడు రక్తపరీక్షలు సేకరించడంతోపాటు వైద్యశిబిరాలు నిర్వహించాలని చెప్పారు. వర్షాలు పడేలోపల గ్రామాలలో రోడ్లు, గ్రామీణ నీటి సరఫరా పనులు పూర్తి చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐటిడీఏ పీడీ రవి పఠాన్ శెట్టి, పాడేరు సబ్ కలెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...