Apr 9, 2018

పోలవరం ప్రాజెక్ట్ పై 56వ వారం సీఎం వర్చువల్ సమీక్ష


జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ

v ప్రాజెక్ట్ పనులు 52శాతం పూర్తి    
v మొత్తం రూ.13,364.98 కోట్ల వ్యయం
v కేంద్రం నుంచి రావలసినవి రూ.2,886.85 కోట్లు
v రెండవ వారంలో నీరు-చెట్టు, నీరు-ప్రగతి పనులు
v 3వ వారంలో సీఎం పోలవరం పనుల పరిశీలన
v ఉద్యమస్ఫూర్తితో జల సంవరక్షణ పనులు
v ఇక ప్రతి నెల వెలుగొండ ప్రాజక్టు పనుల పరిశీలన
v కాలపరిమితి విధించి ప్రాజెక్టులు పూర్తి
v ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి త్వరలో సీఎం శంకుస్థాపన


           సచివాలయం, ఏప్రిల్ 9: రాష్ట్రానికి అత్యంత ప్రధానమైన బహుళార్ధ సాధక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, ఇప్పటి వరకు 52 శాతం పనులు పూర్తయ్యాయని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉదయం పోలవరం ప్రాజెక్ట్ పై 56వ వారం వర్చువల్ సమీక్ష నిర్వహించారని తెలిపారు. ఇతర 53 ప్రాజెక్టులు, నీరు-చెట్టు, నీరు-ప్రగతి పనులను కూడా సీఎం సమీక్షించినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులపై 56వ  వారం వర్చువల్ సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ పనులు 89 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 58 శాతం, హెడ్ వర్క్ పనులు 34 శాతం పూర్తి అయినట్లు వివరించారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించకముందు పోలవరం నిర్మాణానికి రూ.5,135.87 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తరవాత రూ.8,229.11 కోట్లు, 2018 ఫిబ్రవరి వరకు మొత్తం రూ.13,364.98 కోట్లు వ్యయం చేసినట్లు మంత్రి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.5,342 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు తెలిపారు. ఇంకా రూ.2,886.85 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందన్నారు. వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయనున్నట్లు పది రోజుల కిందట చెప్పారని, నేటి వరకూ అందజేయలేదని మంత్రి తెలిపారు. వర్షాలు వచ్చేలోగా గోదావరి నదిలో పనులు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

3వ వారంలో సీఎం పోలవరం పనుల పరిశీలన

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు చూపుతో ఏపీలో ఏడు ముంపు మండలాలను కలిపితేనే సీఎంగా ప్రమాణాస్వీకారం చేస్తానని చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈనాడు అక్కడి రైతులు 60 బస్తాల వరకు పంట పండిస్తున్నారని చెప్పారు. పది లక్షల ఎకరాలకు నీరందించినట్లు తెలిపారు. చివరి భూములకు కూడా నీరందించామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రాజెక్టుల వారీగా పనులు వేగవంతం చేసినట్లు తెలిపారు. ఈ నెల మూడవ వారంలో ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టుని సందర్శిస్తారని చెప్పారు.
ఉద్యమస్ఫూర్తితో జల సంవరక్షణ పనులు
ఉద్యమస్ఫూర్తితో చేపట్టిన జలసంరక్షణ పనులలో 13 జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, నీటి సంఘాల వారు పాల్గొనాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి దేవినేని  తెలిపారు. రెండో వారంలో నీరు-చెట్టు, నీరు-ప్రగతి కార్యక్రమాల్లో గ్రామీణ ప్రాంతాల్లో  రైతులు పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో 1400 ప్రొక్లయినర్లను ఉపయోగిస్తున్నామన్నారు. మైనర్ ఇరిగేషన్, చెరువులు, కాలవలు వంటి వాటి మరమ్మతులు చేసుకోవాలన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చే నెల నుంచి క్షేత్రస్థాయిలో పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

ప్రతి నెల వెలుగొండ ప్రాజక్టు పనుల పరిశీలన
రాయలసీమను సస్యశ్యామనం చేయడానికి పలు ప్రాజెక్టులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, అటవీశాఖ, నీటిపారుదల తదితర శాఖల భాగస్వామ్యంతో ఆయా ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 13 జిల్లాల్లో చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు రూ.922 కోట్లకు సంబంధించి బిల్లులు విడుదల చేసినట్లు, రూ.1360 కోట్లకు బిల్లులు పెండింగ్ లో ఉన్నట్లు ఆయన వివరించారు. ప్రాధాన్యత గల 53 ప్రాజెక్టులను కాలపరిమితి విధించి పూర్తి చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ప్రతినెలా వెలుగొండ ప్రాజెక్టు పనులను స్వయంగా పరిశీలించాలని తనను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. 8 ప్రాజెక్టులు పూర్తి చేశామని, 5 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. హంద్రీ - నీవా ద్వారా కృష్ణా జలాలు లేపాక్షి చెరువుకు చేరినట్లు చెప్పారు. మూడు దశాబ్ధాల క్రితం ఎన్టీఆర్ కల నిజమైందన్నారు. రాయలసీమలో చేపట్టిన ప్రాజెక్టు ద్వారా తిరుపతి, కుప్పం, మదనపల్లి, పలమనేరు, మడకశిర, నగరి, పెనుగొండ, పుట్టపర్తి  ప్రాంతాలు సస్యశ్యామలం కానున్నాయని చెప్పారు. 40 కిలోమీటర్ల పంట కాలువ వెడల్పు పనులు జరుగుతున్నట్లు తెలిపారు. కర్నూలు వేదవతి ప్రాజెక్ట్ దశాబ్దాల కల అని, అది కూడా త్వరలో పూర్తి అవుతుందని చెప్పారు. గుండ్లకమ్మ పనులు కూడా జరుగుతున్నట్లు తెలిపారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి త్వరలో శంకుస్థాపన

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని, కొత్త సంవత్సరం నాటికి నీరందించాలన్నది తమ లక్ష్యమని అన్నారు. జూన్ 18కి వంశధార-నాగావళి నదులను అనుసంధానం చేస్తామని మంత్రి చెప్పారు. వంశధార ఫేజ్-2 పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు.  అక్కడ రెండు పంటలకు అవకాశం ఉంటుందన్నారు. జూన్ లో దానిని ప్రారంభిస్తామని చెప్పారు. తారకరామ తీర్థ ప్రాజెక్ట్ కు పదేళ్ల క్రితం సీఎం శంకుస్థాపన చేశారని, త్వరలో ఆయనే ప్రారంభిస్తారన్నారు. కెఎల్ రావు ప్రాజెక్ట్ పనులు కూడా జరుగుతన్నట్లు తెలిపారు.

కొండవీటి వాగు సమస్యని తాను 19 ఏళ్ల నుంచి లేవనెత్తుతున్నానని, ఆ పనులు కూడా త్వరలో పూర్తి అవుతాయని చెప్పారు. తాగునీరు అందించడానికి గ్రామీణ నీటి సరఫరా విభాగం చురుకుగా పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదాకు సంబంధించి 18 అంశాలు సాధించేవరకు పోరాట స్పూర్తితో ఉద్యమాన్ని కొనసాగిస్తామని మంత్రి దేవినేని చెప్పారు.

రైతులను రెచ్చగొట్టిన జగన్

ప్రతిపక్ష వైసీపీ నేత వైఎస్ జగన్మోహన రెడ్డి రైతులను రెచ్చగొట్టినా, అనేక విధాల అడ్డుపడినా పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగంగా కొనసాగిస్తున్నట్లు మంత్రి దేవినేని చెప్పారు. వైఎస్ హయాంలో జగన్ పవర్ ప్రాజెక్ట్ పనులకు కక్కూర్తిపడి ఆపారన్నారు. సుప్రీం కోర్టుకు వెళ్లి హంద్రి-నీవా పనులకు అడ్డుపడ్డారని, అధికారులు పూర్తి వివరాలు సుప్రీం కోర్టుకు వివరించారని మంత్రి తెలిపారు. జగన్ మోర్నింగ్ వాక్, ఈవెనింగ్ వాక్ చేసుకుంటూ గురువారం అయితే శుక్రవారం కోర్టుకు హాజరుకావడానికి బయలుదేరతారని ఎద్దేశా చేశారు. 

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...