Nov 17, 2016

ఏపీలో పోర్టుల అభివృద్ధికి విస్తృత అవకాశాలు

Ø ఏడాదికి 550 మెట్రిక్ టన్నుల రవాణా లక్ష్యం
Ø నౌకల రాకపోకల సమయం 1.2 రోజులకు తగ్గించడం
Ø ఏకీకృత సరుకు రవాణా నిల్వ కేంద్రాల ఏర్పాటు
Ø జలమార్గాలతో  రైలు, రోడ్డు మార్గాల అనుసంధానం
Ø జపాన్ తరహాలో పోర్టుల అభివృద్ధి
Ø ఏపీ విజన్ 2029 

             ఏపీలో పోర్టుల అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. రాష్ట్రంలో 974 కిలో మీటర్ల  సుదీర్ఘ సముద్రతీరం ఉంది. ఇప్పటికే ఉన్న పోర్టులతోపాటు ప్రతిపాదిత పోర్టులను జపాన్ తరహాలో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నడుంబిగించింది. కాకినాడ, కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టులను  మెగా పోర్టులుగా అభివృద్ధి పరుస్తారు.  విశాఖపట్నం, భావనపాడు, నరసాపురం, రామాయపట్నం పోర్టులను  పెద్ద పోర్టులుగా తీర్చిదిద్దుతారు.  మేఘవరం, కళింగపట్నం, భీమునిపట్నం, కాకినాడ, వాకట్‌పల్లి, రవ్వ, నిజాంపట్నం ఓడరేవు, దుగ్గరాజపట్నంలను చిన్న పోర్టులుగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించారు. పోర్టుల ఆధారిత వృద్ధిని  ఆర్థిక వృద్ధి కారకాలలో  ఒకటిగా, అత్యధిక వృద్ధి సాధించగల రంగంగా కూడా ప్రభుత్వం గుర్తించింది. ఆంధ్రప్రదేశ్  2029 నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదిగేలా విజన్-2029ని ప్రభుత్వం రూపొందించింది. అందులో భాగంగా పోర్టుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. లక్ష్యసాధనకు ప్రభుత్వం, ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం అందరినీ కలుపుకొని అనుసంధానం చేసే ఒక పరిపాలనా వ్యవస్థ(విజన్)ను ఏర్పాటు చేసింది.
            రాష్ట్రంలోని నౌకాశ్రయాలు 2029 నాటికి ఏడాదికి 550 మెట్రిక్ టన్నుల సరుకుల రవాణా నిర్వహణ సామర్థ్యం కలిగి ఉండేవిధంగా అభివృద్ధిపరచాలని లక్ష్యంగా నిర్థేశించింది. 2015లో 117 మెట్రిక్ టన్నులుగా ఉన్న సామర్థ్యాన్ని 2019 నాటికి 250 మెట్రిక్ టన్నులకు, 2029 నాటికి 500 టన్నులకు, 2029 నాటికి వెయ్యి టన్నులకు పెంచాలని ప్రభుత్వం భవిష్యత్ పోర్టుల లక్ష్యాలను నిర్ణయించింది. ప్రస్తుతం నౌకల రాకపోకలకు ఒక ట్రిప్పుకు పట్టే సమయం 2.48 రోజులుగా ఉంది. దానిని 2019 నాటికి రెండు రోజులకు, 2022 నాటికి 1.5 రోజులకు, 2029 నాటికి 1.2 రోజులకు తగ్గించాలని నిర్ణయించింది. ఈ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు మార్గాలను జలమార్గాలతో అనుసంధానం చేస్తున్నారు. ఓడ రేవుల నుంచి రాష్ట్రంలోని ప్రధాన  రహదారులను కలుపుతూ రోడ్లు వేయడానికి రోడ్డు గ్రిడ్ ను ఏర్పాటు చేశారు. మరోపక్క రాష్ట్రంలోని అన్ని ఓడరేవులను జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ కొత్త మార్గాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. లాజిస్టిక్ పార్కులు, జాతీయ, అంతర్జాతీయ ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ ఏకీకృత సరుకు రవాణా నిల్వ కేంద్రాల(ఫ్రైట్ విలేజ్ లు)ను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు నేషనల్‌ వాటర్‌వే -4 గా ప్రకటించారు. 10 వేల మెట్రిక్‌ టన్నుల బరువున్న ఓడలు ఈ వాటర్‌వే ద్వారా ప్రయాణించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 
పోర్టుల అభివృద్ధి

             రాష్ట్రంలోని పోర్టులన్నిటినీ అన్ని రకాలుగా అభివృద్ధిపరచడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కృష్ణపట్నం, విశాఖ పోర్ట్ లు అంతర్జాతీయ ఎగుమతులకు అనుకూలంగా ఉంటాయి. దుగరాజపట్నం పోర్టును త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నారు. ఉత్తర భారతదేశానికి కార్గో కంటెయినర్లను పంపించేదుకు అనువుగా  రాష్ట్రంలోని చిన్న, మధ్య తరహా పోర్టులను మలుచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోటీ తత్వాన్ని పెంచేందుకు ప్రైవేటు రంగం ద్వారా పోర్టుల అభివృద్ధి చేస్తున్నారు. మచిలీపట్నం పోర్టు 2018 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మచిలీపట్నం, భావనపాడు నౌకాశ్రయాలను అభివృద్ధిపరుస్తారు. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో నౌకా నిర్మాణ కేంద్రం ప్రతిపాదనలో ఉంది. అంతే కాకుండా విశాఖపట్నం జిల్లా రాంబిల్లిలో 5 వేల కోట్ల రూపాయలతో నౌకా నిర్మాణ కేంద్రం నిర్మిస్తానని రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు.

పోర్టుల ఆధారిత అభివృద్ధిపై  దృష్టి
            కోస్తా తీరాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ గా తీర్చిదిద్దటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇచ్చాపురం నుంచి తడ వరకు 9 జిల్లాలలో విస్తరించి ఉన్న సముద్రతీర ప్రాంతాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి  ప్రణాళికులు సిద్ధం చేసింది.  తీర ప్రాంతాన్ని వినియోగించుకొని పోర్టుల ఆధారిత అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నౌకాశ్రయాలను అభివృద్ధి చేయడం ద్వారా తీర ప్రాంత ఆర్థికాభివృద్ధి వ్యూహాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని  నౌకాశ్రయాలు తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా దేశాలను అనుసంధానంగా నిలుస్తూ, ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాలకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. కాకినాడ-పుదుచ్చేరి, కాకినాడ- భద్రాచలం అంతర్గత జల రవాణా మార్గాలను దగ్గరలో ఉన్న పోర్టులతో అనుసంధానం చేయనున్నారు. రాష్ట్రంలో మొదటి సారిగా మెరైన్ బోర్డును కూడా నెలకొల్పాలన్న ఆలోచనలో  ప్రభుత్వం  ఉంది.  ఈ బోర్డు ఏర్పాటైతే సముద్రతీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనఓడరేవుల నిర్వహణ, వాటి అభివృద్ధి, హార్బర్సలో ట్రాఫిక్ నియంత్రణ, సముద్ర జలాలకు సంబంధించిన వ్యవహారాలను ఈ బోర్డు చూసుకుంటుంటుంది. ఇండియన్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయంతో ఆంధ్రప్రదేశ్ నాలుగు జాతీయ జలమార్గాలకు చెందిన ప్రాజెక్టులు చేపడుతోంది. సాగరమాల పథకంలో రాష్ట్రం ప్రధాన భాగస్వామి కానుంది. ఆసియా దేశాలలోనే తొలిసారిగా తూర్పుగోదావరి జిల్లా అంర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ ఏర్పాటు కానుంది. కేంద్ర జాతీయ జలరవాణా మార్గాల అభివృద్ధిలో భాగంగా 888 కిలోమీటర్ల కాకినాడ-పుదుచ్ఛేరి జలరవాణా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇండియన్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐడబ్ల్యూఏఐ)తో ఈ రకమైన ఒప్పందం చేసుకున్న తొలి రాష్ట్రంగా ఏపి నిలిచింది.

అంతర్జాతీయ సంస్థల సహకారం
         ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీపర్యటనలలో పలు అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధికి తమ సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చాయి. ఈ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో విశేష అనుభవం ఉన్న సంస్థల సహకారం పొందడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏపీలో పోర్టుల అభివృద్ధికి సహకరిస్తామని జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి యోసుకే తకాగి సీఎంకు హామీ ఇచ్చారు.   మెరైన్ రంగంలో ఏపికి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేసేందుకు  రష్యాకు చెందిన యునైటెడ్‌ షిప్‌బిల్లింగ్‌ కార్పొరేషన్‌  అధ్యక్షుడు అలెక్సీ ఎల్‌ రఖ్మనోవ్‌ తన సంసిద్ధత వ్యక్తం చేశారు.  ఏపీలో పోర్టుల అభివృద్ధికి సహకరిస్తామని, పోర్టుల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ అందిస్తామని జపాన్ కు చెందిన యొకోహమా పోర్టు ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని పోర్టుల అభివృద్ధికి తాము సహకరిస్తామని హిటాచి గ్రూప్ జీఎం అకిరా షిముజు కూడా సీఎంకు హామీ ఇచ్చారు. పెట్టుబడులు పెడతామని, అయితే రాయితీలు కల్పించాలని ఆయన కోరారు.  ఏపీలో జపనీస్ డెస్క్ పేరుతో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం ఆయనకు చెప్పారు. సనరైజ్‌ స్టేట్‌ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీలోని హెంబర్‌ పోర్టు అధికారులు కూడా  ఆసక్తి కనబరిచారు.  
రాష్ట్రంలో నౌకానిర్మాణ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశానికి చెందిన సంస్థలు ఉత్సుకత చూపుతున్నాయని రష్యన్ ఫెడరేషన్ పరిశ్రమలు-వాణిజ్య శాఖల మంత్రి డెనిస్ మాంతురోవ్ చెప్పారు. ఏపీ ఇడీబీ, జేఎస్‌సీ యునైటెడ్ షిప్పింగ్ కార్పొరేషన్ మధ్య ఒక ఒప్పందం కూడా  జరిగింది. జేఎస్‌సీ యునైటెడ్ షిప్పింగ్ కార్పొరేషన్ రష్యా, తూర్పు యూరప్‌లో అతిపెద్ద నౌకా  నిర్మాణ సంస్థగా పేరొందింది. ఈ సంస్థ సబ్ మెరైన్లు, ఉపరితల నౌకలు, సైనిక అవసరాల కోసం ప్రత్యేక జల వాహనాలు, సముద్ర గర్భంలో మంచుగడ్డలు కరిగించే యంత్రాలు, ఆఫ్‌షోర్ సొల్యూషన్స్, ట్రాన్స్‌పోర్టు వెస్సల్స్, స్పెషలైజ్డ్ వెస్సల్స్, జాలర్లకు ఉపయోగపడే వేట పడవలను తయారుచేస్తుంది. జేఎస్‌సీ యునైటెడ్ షిప్పింగ్ సంస్థ, ఏపీ ప్రభుత్వంతో కలిసి సరకు రవాణా, ప్రయాణికుల రవాణాకు వీలయ్యే నౌకలను రూపొందిస్తుంది. వాటి నిర్వహణ  కూడా చేపడుతుంది.
 రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఈ విధమైన చర్యల వల్ల రాష్ట్రంలో పోర్టులు త్వరితగతిన అభివృద్ధిచెందే అవకాశం ఉంది. జలరవాణాకు అవకాశాలు పెరిగి రాష్ట్ర ఆర్థికవృద్ధికి దోహదపడుతుంది.

జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...