Nov 21, 2016

సాగర తీరం వెంట పరిశ్రమల పంట

v నెంబర్ 1 రాష్ట్రంగా ఎదగనున్న ఏపీ
v విసీఐసీలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు, 50 వేల ఉద్యోగాలు
v ఏడీబీ అధ్యయనం పూర్తి, త్వరలో పనులు ప్రారంభం
v గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ సప్లై చైన్
v 974 కిలో మీటర్ల సాగర తీరం
v ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్‌

           ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముద్ర తీరంలోనూ, తీరం వెంబట భూగర్భంలోనూ అపారమైన సంపద నిక్షిప్తమై ఉంది. దానికి తోడు నైపుణ్యత కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. నిరంతరం విద్యుత్ సరఫరా అవుతూ ఉంటుంది. ప్రభుత్వం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఙానంతోపాటు ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్)ని పరిపాలనలో చొప్పించి ఇ-ప్రగతిని సాధిస్తోంది.  సాగర తీరంలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, జల రవాణాకు అనేక అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటినీ సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఇటు ప్రభుత్వం రంగంలోనూ, అటు ప్రైవేటు రంగంలోనూ  పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రభుత్వం అనేక ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా పేరొందిన పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు(ఎంఓయు) కూడా చేసుకుంది. రాష్ట్రంలో విశాఖ మేజర్ పోర్టుతోపాటు గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం వంటి పలు మీడియం పోర్టులు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ ఎగుమతులకు ఈ పోర్టులు అనుకూలం. రాష్ట్రంలో పోర్టులను అభివృద్ధి చేస్తూ,  కొత్త పోర్డులు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ (సిబిఐసి) పరిధిలోకి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం వస్తుంది. పారిశ్రామికంగా అభివృద్ధిపరచడానికి అనువైన ప్రాంతంగా దీనిని గుర్తించారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి), జపాన్ ఇంటర్నేషనల్ కార్పోరేషన్ ఏజన్సీ(జెఐసిఏ) లు కలసి సిబిఐసికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను  రూపొందించాయి.
తీరప్రాంత మొదటి కారిడార్
     దేశంలో తీరప్రాంతంలో ఏర్పడే  మొదటిది విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ (విసిఐసి). ఇది భవిష్యత్ లో తూర్పు ఆర్థిక  కారిడార్ గా కీలకం కానుంది. ఇది శ్రీకాకుళం జిల్లాలోని పైడిభీమవరం నుంచి తమిళనాడులోని చెన్నై వరకు విస్తరించి ఉంటుంది. 2500 కిలో మీటర్ల కారిడార్ ఇది. ఇందులో విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, శ్రీకాళహస్తిలను పారిశ్రామిక హబ్ లుగా తీర్చిదిద్దుతారు. ఈ కారిడార్ లో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు, 50 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. జపాన్ కు చెందిన అంతర్జాతీయ ఫండింగ్ ఏజెన్సీ ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) వీసీఐసీకి భారీగా 4,200 కోట్ల రూపాయలు రుణాన్ని ఇచ్చేందుకు అంగీకరించినట్లు కేంద్ర మంత్ర వెంకయ్య నాయుడు చెప్పారు. ఈ కారిడార్ ను రెండు దశల్లో అభివృద్ధి చేస్తారు. తొలి దశలో రూ.2,100 కోట్లు, రెండో దశలో రూ.2, 100 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ఏడీబీ అంగీకరించింది. ఈ ప్రాజెక్టు తొలిదశ 2019 నాటికి పూర్తవుతుంది.  రెండవ దశ 2022 నాటికి పూర్తి అవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 840 మిలియన్ డాలర్లు. ఇందులో ఏపీ ప్రభుత్వానికి 30 శాతం వాటా ఉంటుంది. 
         వీసీఐసీ ఏర్పాటుకు సంబంధించి ఏడీబీ (ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్) అధ్యయనం పూర్తయిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. తొలిదశలో ప్రధానమైన 800 కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారు.  దీంతో దక్షిణ తూర్పు ఆసియా దేశాలతో భారత్ వాణిజ్య కార్యకలాపాలు మరింత బలోపేతమవుతాయని ఏడీబీ పట్టణాభివృద్ధి విభాగపు ప్రధాన విశ్లేషకుడు మనోజ్ శర్మ అభిప్రాయపడ్డారు. పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వల్ల విశాఖ-చెన్నై తీరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా అవతరిస్తుందని చెప్పారు. మెరైన్ ఉత్పత్తుల్లో ఏపీ దేశంలో అత్యున్నత స్థానంలో ఉంది. ఎగుమతులు కూడా అధికంగా ఇక్కడ నుంచే జరుగుతున్నాయి. మెరైన్ కార్గోలను  పంపే మేజర్ పోర్టులలో విశాఖపట్నం పోర్ట్ ఒకటి.   2015-16లో ఏపీ నుంచి రూ. 9,328 కోట్ల విలువైన 1,67,130 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.  అందువల్ల పెద్ద పెద్ద పారిశ్రామిక యూనిట్లతోపాటు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపనపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. విసిఐసి ప్రాజెక్టు అనుకున్న సమయానికి సమర్థవంతంగా పూర్తి కావాలంటే ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం చాలా అవసరం. అందుకోసం ప్రభుత్వం ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
       పారిశ్రామిక అవసరాలకు కావలసిన భూములు సమకూర్చే బాధ్యత ఏపిఐఐసి (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్) చూసుకుంటుంది. భూసేకరణ, పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాల కేటాయింపు, వాటికి అనుకూల పరిస్థితులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వ్వవహారాలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం  కలెక్టర్లను ఆదేశించింది. రాష్ట్రంలో నౌకానిర్మాణం, రేవులు, తయారీరంగం, మౌలిక సదుపాయాలు వంటి ముఖ్యమైన రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశానికి చెందిన సంస్థలు ఉత్సుకత చూపుతున్నాయని ఇటీవల ఇక్కడికి వచ్చిన రష్యన్ ఫెడరేషన్ పరిశ్రమలు-వాణిజ్య శాఖల మంత్రి డెనిస్ మాంతురోవ్ చెప్పారు. పెట్టుబడులకు పుష్కలమైన అవకాశాలు గల రాష్ట్రంగా ఏపీని ప్రపంచ దేశాలు గుర్తించాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌, రష్యా మధ్య సరికొత్త వాణిజ్య, పారిశ్రామిక, ఆర్థిక బంధాలు బలపడే అవకాశం ఉంది. విశాఖలో వరల్డ్ క్లాస్ మాన్యుఫాక్చరింగ్ కాంప్లెక్స్ నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రష్యాకు చెందిన టెక్నో నికోల్‌, ఇండియాకు చెందిన సన్‌ గ్రూపు ప్రతినిధులతో రెండవ అవగాహన ఒప్పందాలు కూడా చేసుకుంది.  
తీరంలో గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ సప్లై చైన్
ఇచ్చాపురం నుంచి తడ వరకు 9 జిల్లాలలో విస్తరించి ఉన్న సముద్రతీర ప్రాంతాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ సప్లై చైన్ గా రూపొందించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉంది. తీరం వెంట ఆర్థికాభివృద్ధికి ఉన్న అవకాశాన్ని ప్రభుత్వం గుర్తించింది. మౌలిక వసతులలో భాగంగా తీరం వెంట రోడ్డును కూడా నిర్మిస్తారు. ఇప్పటికే విశాఖ - భీమిలి బీచ్ రోడ్డును నిర్మిస్తున్నారు. దానికి కొనసాగింపుగా భీమిలి-భోగాపురం మధ్య బీచ్ రోడ్డుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. రాష్ట్రంలోని నౌకాశ్రయాలు తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా దేశాలను అనుసంధానంగా నిలుస్తాయి.  ఆయా దేశాలతో వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉన్నాయి. అందువల్లనే ఏపిని తూర్పు తీర ముఖద్వారంగా అభివర్ణిస్తారు.
               తీరప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి దేశవిదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. పెట్టుబడులు పెట్టేందుకు ఇపుడు అన్ని దేశాలు భారత్ వైపే చూస్తున్నాయి. పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తే వెంటనే అనుమతులిస్తామని  సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పరిశ్రమలకు కల్పించే రాయితీల వల్ల పారిశ్రామికవేత్తలు ఏపీకి రావడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పటికే దేశంలో రెండంకెల ఆర్థిక వృద్ధి సాధించిన ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచింది. సాగరతీరం అభివృద్ధి చెందితే దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుంది.
జారీ చేసినవారు: రిచర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగం,  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
apspecialnews@gmail.com

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...