Nov 17, 2016

రిటైల్ రంగాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం


v రూ.5,142 కోట్ల పెట్టుబడులు, 25 వేల ఉద్యోగ అవకాశాలు
v ఏపీ రిటైల్ పాలసీ 2015 – 2020
v ఇటువంటి పాలసీని రూపొందించిన మొదటి రాష్ట్రం
v మలేషియా ‘పెమండు’తో ఒప్పందం

          పెట్టుబడులను ఆకర్షించడంలో, ఉద్యోగ అవకాశాల కల్పనలో రిటైల్ రంగం కీలకం కానుంది. రాష్ట్ర అభివృద్ధిలో కూడా ఈ రంగం ప్రధాన భూమిక పోషించనుంది. ప్రధాన ఆర్థిక వృద్ధి కారకాలలో ఇది కూడా ఒకటిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలోపెట్టుకొని  రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రిటైల్ పాలసీ 2015-2020 ని రూపొందించింది. దేశంలో ఇటువంటి పాలసీని రూపొందించిన మొదటి రాష్ట్రం ఏపీ. ప్రస్తుతం దేశంలో ఉన్న రిటైల్ మార్కెట్ 2020 నాటికి రెండింతలవుతుందని అంచనా. అందులో ఏపీ పాత్ర కీలకంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే వ్యాపార అనుకూల విధానాలు, కల్పించే సౌకర్యాల వల్ల 2021 నాటికి రాష్ట్రంలో కనీసం రూ.5,142 కోట్ల పెట్టుబడులు, 25 వేల ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. రిటైల్ రంగానికి సంబంధించి ఉత్పత్తులు స్వయం సహాయక గ్రూపులు, సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఇ) నుంచి సరఫరా అవుతాయి. ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. కిరాణా షాపులు వంటి వాటిలో పెట్టుబడులు పెడతారు.

‘పెమండు’తో ఒప్పందం
ఈ రంగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మలేషియాలోని పెమండు (ఫర్మామెన్స్ మేనేజ్ మెంట్ అండ్ డెలీవరీ యూనిట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ మలేషియా) విధానాలను రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పెమండుతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం(ఎంఓయు) కూడా కుదుర్చుకుంది. స్థిరమైన అభివృద్ధికి ఉపయోగడే ప్రభుత్వం గుర్తించిన అత్యంత ప్రాధాన్యత కలిగిన కీలక రంగాలలో పెమండు సహాయపడుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వ, పెమండు బృందాలు విద్య, రిటైల్ రంగాలపై అద్యయనాలు, పరిశోధనలు మొదలుపెట్టాయి. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఈ బృందాలు అధ్యయనం చేశాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పర్యటించి, ప్రభుత్వ ఉన్నతాధికారులు మొదలుకొని వివిధ శాఖల అధికారులను, సిబ్బందిని, కార్మిక శాఖ, పరిశ్రమలు, వాణిజ్య, మునిసిపల్ శాఖల అధికారులను కలిశారు. రిటైల్ రంగానికి సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, సమస్యలు, సమస్యలకు మూల కారణాలను సమగ్రంగా అధ్యయనం చేశాయి.
రాష్ట్ర రిటైల్ రంగం ప్రధానంగా ఎదుక్కొనే సమస్యలను పెమండు గుర్తించింది. నగరాలు, పట్టణాలు ప్రణాళికాబద్దంగా ఏర్పాటు కానందున రిటైల్ జోన్స్ ఏర్పాటు చేయడానికి తగినంత స్థలం లేదు. ఈ రంగానికి అనుకూలమైన మౌలిక సదుపాయాలు లేవు. ప్రస్తుతం ఉన్న రిటైల్ జోన్స్ అసంఘటితంగా, అక్కడక్కడ ఉన్నాయి. వాటికి సమీపంలో వాహనాల పార్కింగ్ కు స్థలాలు లేవు. దానికితోడు గిడ్డంగులు కూడా అందుబాటులో లేవు. ప్రైవేటు వ్యాపారులను, పెట్టుబడులను ఆకర్షించేవిధంగా ప్రభుత్వ చట్టాలు, నిబంధనలు లేవు.  రిటైల్ వ్యాపారులు లైసెన్సులు పొందే విధానాలు వారికి అనుకూలంగా లేవు. పెట్టుబడులు సమకూర్చుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు.
         పెమండు బృందం సమస్యలకు పరిష్కారాలు కనుగొని, అభివృద్ధికి మార్గాలు, కొత్తకొత్త ఆలోచనలతో ఈ రంగంలో ఆశించిన ఫలితాలు సాధించడానికి ఆచరణాత్మకమైన కార్యక్రమాలను రూపొందించింది. దిగువ స్థాయి నుంచి ప్రతి దశలో ఆచరణకు అవకాశం ఉన్న వ్యూహాత్మక ప్రణాళికలను రచించింది. మొత్తం రిటైల్ రంగం అభివృద్ధి ప్రక్రియలో ప్రధానంగా 3 దశలు ఉంటాయి. వీటిని వివరించడానికి పెమండు బృందం వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ షాపు కూడా నిర్వహించింది. రాష్ట్రంలో రిటైల్ రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి, భారీ స్థాయిలో శీఘ్ర ఫలితాలను ఇచ్చే అంశాలను గుర్తించింది. ఆచరణలో ఉత్తమ ఫలితాలు పొందడానికి పెమండు బిగ్ ఫాస్ట్ రిజల్ట్స్(బీఎఫ్ఆర్) విధాన్ని ఉపయోగిస్తోంది. ఈ విధానంలో 8 దశలు ఉన్నాయి. రిటైల్ రంగానికి కావలసిన నిధులను అంచనా వేసి, వాటిని సమకూర్చుకునే విధానాలను రూపొందించింది.

ప్రధాన  సిఫారసులు
1.ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ ఫెసిలిటేషన్ సెంటర్ (ఏపీఎంఎఫ్ సీ) ఏర్పాటు
2. జిల్లా సేకరణ కేంద్రం (డీసీసీ) ఏర్పాటు
3. అత్యంత ప్రధానమైన నగరాలలో రిటైల్ పార్కుల ఏర్పాటు
4. ఎంపిక చేసిన మునిసిపాల్టీలలో సెమీ అర్బన్, గ్రామీణ రిటైల్ పార్కుల ఏర్పాటు
5. విధానపరమైన సంస్కరణల ద్వారా ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు సమకూర్చుకునే అవకాశం కల్పించాలి. వ్యాపారానికి అనుకూల పరిస్థితులు కల్పించాలి.
6.రిటైల్ వ్యాపారం రిజిస్ట్రేషన్ విధానాన్ని సరళీకరించాలి. (సింగిల్ డెస్క్ పాలసీ)
7.మండల్ నోడల్ స్టోర్స్(ఎంఎన్ఎస్) ఏర్పాటు చేయాలి.
8. కిరాణా షాపులలో సౌకర్యాలు మెరుగుపరుచుకునే అవకాశం కల్పించాలి.
రిటైల్ రంగాన్ని అభివృద్ధి పరచడానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. సింగిల్ డెస్క్ విధానం ద్వారా లైసెన్స్ పొందడం సులభతరం చేసింది. చిన్న వ్యాపారులకు రుణాలు పొందే అవకాశం కల్పించింది. మిగిలిన  సిఫారసులను కూడా అమలు చేసి రిటైల్ రంగంలో పెట్టుబడులు రావడానికి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...