Nov 17, 2016

4 కోట్లు దాటిన స్మార్ట్ పల్స్ సర్వే

·       కోటి 27 లక్షలకు పైగా కుటుంబాలను కలసిన ఎన్యూమరేటర్లు
·       దేశంలో ఇటువంటి సర్వే చేస్తున్న మొదటి రాష్ట్రం
·       ప్రతి ఒక్కరి వేలి ముద్ర సేకరణ 

         రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాసాధికార సర్వే-2016(స్మార్ట్ పల్స్ సర్వే) లో నాలుగు కోట్ల మంది సర్వే పూర్తి అయింది. ఈ ఏడాది జూలై 8న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచే ఈ సర్వేను ప్రారంభించారు.  రాష్ట్రంలో 5.23 కోట్ల మంది జనాభా ఉండగా, నవంబర్ 1వ తేదీ మంగళవారానికి 4 కోట్ల మందికి పైగా వివరాలు సేకరించారు. ఈ-ప్రగతిలో భాగంగా ప్రభుత్వం ప్రజల ఆర్థిక, సామాజిక స్థితుల సమగ్ర సమాచారం సేకరిస్తోంది. అలాగే అర్హులకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ సర్వే ద్వారా సేకరించి, క్రోడీకరించిన సమాచారం నిజమైన బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి ఉపయోగపడుతుందన్నది ప్రభుత్వ అభిప్రాయం. రియల్ టైమ్ గవర్నెన్స్ కు కూడా  ఇది దోహదపడుతుంది.  దాదాపు 30 వేల మంది ఎన్యూమరేటర్లు ఈ సర్వే నిర్వహిస్తున్నారు.  ప్రభుత్వంలోని 17 శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. పది సంవత్సరాలకు ఒకసారి చేపట్టే జనాభా లెక్కల మాదిరిగా కాకుండా, ఈ సర్వే అంతకు మించి ప్రతి పౌరుని వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టేలా వివరాలు సేకరిస్తున్నారు.  ఎన్యూమరేటర్లు ఎప్పటికప్పుడు సర్వే వెబ్ సైట్ లో లాగిన్ అయి, డేటాను ఎంటర్ చేస్తున్నారు. ఈ సర్వేలో ప్రతి వ్యక్తిని 32 రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. వాటిలో 12 ప్రశ్నలకు ఆధారాలతో సహా జవాబులు చెప్పాలి. కుటుంబ యజమాని, ఇంటి పరిస్థితి, స్థిర,చరాస్తులు, కుటుంబ సభ్యులు, విద్య, ఉపాధి, రేషన్ కార్డు, పింఛన్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాల ద్వారా ఆ కుటుంబం పొందే లబ్ది..మొదలైన వివరాలన్నింటినీ సేకరిస్తున్నారు. ఇవేకాకుండా ఇంటిలోని మౌలిక సదుపాయాలు, గదులు, త్రాగునీరు, విద్యుత్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆండ్రాయిడ్ ఫోన్, అప్పులు, వంటకు వాడే ఇంధనం, సొంత భూమి, ఇల్లు, వాహన వివరాలు, పిల్లల చదువులు, వారి ఉపాధి... వంటి సమాచారం కూడా నమోదు చేస్తున్నారు. సర్వేలో తొలుత కుటుంబ పెద్ద లేక అందుబాటులో ఉన్న వారి వేలిముద్ర మాత్రమే సేకరించారు. ఆ తరువాత ప్రతి వ్యక్తి వేలి ముద్ర సేకరిస్తున్నారు. గతంలో సర్వే చేసిన కుటుంబాలలోని ప్రతి వ్యక్తి వేలి ముద్రను ఆన్ లైన్ లోకి ఎక్కిస్తున్నారు. దాంతో అనుకున్న సమయానికంటే కొంత ఆలస్యం అవుతోంది. ఆధార్ వివరాలను ప్రతి వ్యక్తి మొబైల్ నెంబర్ తో అనుసంధానం చేస్తున్నారు.  ఇప్పటికే జారీ చేసిన ఆధార్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే వీరు సరిచేస్తారు. ఆధార్ రికార్డులలో నమోదై, ఆ తరువాత చనిపోయినవారి పేర్లను తొలగిస్తున్నారు. ఈ సర్వే సమాచారం మొత్తాన్ని జియోట్యాగ్ చేస్తున్నారు.
సర్వే ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. సాఫ్ట్ వేర్ వెర్షన్స్ లో మార్పులు చేయవలసి వచ్చింది.  అయితే ఇప్పుడు వాటిని  అధిగమించారు. కొంతమంది సిబ్బంది పుష్కరాలు, కరువు సహాయక చర్యలలో పాల్గొన్నందున కొన్ని జిల్లాలలో సర్వే పనులలో కొంత జాప్యం జరిగింది. ప్రస్తుతం అన్ని జిల్లాలలో సిబ్బంది చురుకుగా, వేగంగా సర్వే నిర్వహిస్తున్నారు.

  సీఎం డ్యాష్ బోర్డులో నమోదైన ప్రకారం జూలై 8వ తేదీ నుంచి నవంబర్ 1వ తేదీ మంగళవారం రాత్రి 7.05 గంటల వరకు ఎన్యూమరేటర్లు 1,27,08,985 కుటుంబాలను కలసి, 4,00,00,173 మందిని సర్వే చేశారు. 5 నెలలలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిగతంగా ఇంతమందికి చెందిన సామాజిక, ఆర్థిక అంశాల సమగ్ర సమాచారాన్ని సేకరించడం ఓ గొప్ప విజయం. సర్వే వివరాలలో కచ్చితత్వం ఉండేలా అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా వ్యవహరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఈ సర్వేను సమీక్షిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు.

దేశంలో మొదటి రాష్ట్రం
దేశంలో వ్యక్తిగతంగా ఇటువంటి సమగ్ర సర్వే చేస్తున్న మొదటి రాష్ట్రం ఏపీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. సీఎన్ బీసీ-టీవీ 18 సిస్కో డిజిటలైజింగ్ ఇండియా అవార్డును కూడా ఏపీ దక్కించుకుంది.               పరిపాలనలో సాంకేతికతను అత్యంత సమర్థవంతంగా జోడించిన ఘనత ఏపీదే. అందువల్లనే ఈ సర్వే ఇంత త్వరితగతిన పూర్తి అవుతోంది. ఈపాస్‌, పింఛన్ల పంపిణీ, భూగర్భ జలాల కొలత, ఆధార్‌ అనుసంధానం, రైతులు, డ్వాక్రా సంఘాల ఖాతాలను ఆన్‌లైన్‌ చేయటం, ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌ వంటి చర్యలతో ఐటీ వినియోగంలో ఏపీ ముందంజలో ఉంది. ఈ-ప్రగతిలో భాగంగానే ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతుల సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం ఈ సర్వే ద్వారా సేకరిస్తోంది. పారదర్శక పాలన అందించడానికి,  సంక్షేమ పథకాలు అర్హులకు సక్రమంగా అందడానికి, మరిన్ని ప్రజా ప్రయోజనకర పథకాలు ప్రవేశపెట్టాడానికి వీలుగా సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఈ సర్వేను చేపట్టారు.  ఈ సర్వే ద్వారా సేకరించే సమగ్ర సమాచారం  ప్రజలకు, ప్రభుత్వానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 


జారీ చేసినవారు : సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...