Nov 17, 2016

రాష్ట్రంలో రూ.41,265 కోట్ల రుణాలు మంజూరు

§  తొలి త్రైమాసికంలో రుణప్రణాళిక లక్ష్యం 25 శాతం పూర్తి
§  అనంతపురం జిల్లాలో 34 శాతం
§  తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలలో అత్యధిక రుణాలు
§  పంట రుణాలు రూ. 21,062 కోట్లు మంజూరు
§  సంతృప్తికరంగా  బకాయిల వసూలు
          రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన రుణ ప్రణాళికలో మొదటి త్రైమాసికంలో రూ.41,265 కోట్ల రుణాలు మంజూరు చేశారు. 25 శాతం లక్ష్యం పూర్తి అయింది. రాష్ట్రంలో అన్ని విధాలా అత్యంత వెనుకబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లాలో రూ. 3949 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఈ జిల్లాలో 34 శాతం లక్ష్యం పూర్తి చేశారు.  విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి 94వ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో రూ.1,65,538 కోట్ల రూపాయలతో 2016-17 రుణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రం ఆర్థిక వృద్ధి పెరుగుదలకు ఉపయోగపడే  ప్రాధమికమైన వ్యవసాయ రంగంతోపాటు, దాని అనుబంధ రంగాలకు, స్వయంసహాయ గ్రూపులకు చెందిన మహిళలకు, సూక్ష,చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణాలు ఇవ్వడానికి ఈ ప్రణాళికను రూపొందించారు. రాష్ట్రంలో ఈ రుణ ప్రణాళికను నాబార్డ్ (జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్) అనుబంధ సంస్థ అయిన నాబ్ కాన్స్ (నాబార్డ్ కన్సల్ టెన్సీ సర్వీస్) సమన్వయకర్తగా వ్యవహరిస్తుంది. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలోపెట్టుకొని బ్యాంకుల సహకారంతో  రుణప్రణాళికను సమర్థవంతంగా అమలు చేస్తున్నారు.
లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్స్(ఎల్ డీఎంలు) పంపిన సమాచారం అధారంగా రూపొందించిన తొలి త్రైమాసిక (ఏప్రిల్, మే,జూన్) వివరాలను రాష్ట్ర ప్రణాళికా శాఖ విడుదల చేసింది. అత్యధికంగా రూ. 5,178 కోట్ల రుణాలు (27 శాతం) ఇచ్చిన తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో, రూ. 4,855 కోట్ల రూణాలు (28 శాతం) ఇచ్చిన కృష్ణా జిల్లా రెండవ స్థానంలో నిలిచాయి. చిత్తూరు జిల్లాలో రూ. 3,275 కోట్లు (28 శాతం), విశాఖపట్నం జిల్లాలో రూ. 3,921 కోట్లు (28 శాతం), కర్నూలు జిల్లాలో రూ. 2,680 కోట్లు (26 శాతం), నెల్లూరు జిల్లాలో రూ. 2,744 కోట్లు (25 శాతం), కడప జిల్లాలో రూ. 2,072 కోట్లు (24 శాతం), ప్రకాశం జిల్లాలో రూ. 2,756 కోట్లు ( 24 శాతం), విజయనగరం జిల్లాలో రూ. 1,016 కోట్లు (22 శాతం), పశ్చిమగోదావరి జిల్లాలో రూ. 3,866 కోట్లు (21 శాతం), శ్రీకాకుళం జిల్లాలో రూ. 1,049 కోట్లు (19 శాతం), గుంటూరు జిల్లాలో రూ. 3,903 కోట్లు (18 శాతం) రుణాలు మంజూరు చేశారు. మూడు నెలల కాలంలో 7 జిల్లాలలో 25 శాతానికి మించి రుణాలు మంజూరు చేశారు.

పంట రుణాలు రూ. 21,062 కోట్లు

      రుణ ప్రణాళికను విభాగాల వారీగా పరిశీలిస్తే, ఈ ఏడాది పంట రుణాల లక్ష్యం రూ. 60,000 కోట్లు కాగా, మొదటి మూడు నెలలలోనే రూ. 21,062 కోట్లు మంజూరు చేసి, 35 శాతం లక్ష్యం పూర్తి చేశారు. వ్యవసాయానికి సంబంధించి కాలపరిమితి రుణాలు రూ. 965 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలలో రూ. 1,209 కోట్లు రుణాలు మంజూరు చేశారు. , సూక్ష,చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ ఎంఇ)కు రూ. 4225 కోట్లు మంజూరు చేశారు.
        ఈ రుణాలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు  పెట్టుబడులు సమకూరుస్తాయి. అలాగే గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి, ఆర్థిక వృద్ధికి ఉపయోగపడతాయి.

సంతృప్తికరంగా  బకాయిల వసూలు
     ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రుణ బకాయిల వసూలు సంతృప్తికరంగా ఉంది.  మంజూరు చేసిన రుణ మొత్తానికి మించి బకాయిలు వసూలయ్యాయి. రూ. 41,265 కోట్ల రుణాలు ఇవ్వగా, రూ. 50,246 కోట్లు బకాయిలు వసూలయ్యాయి. స్వల్పకాలిక రుణాలు రూ. 20,753 కోట్లు, కాలపరిమితి వ్యవసాయ రుణాలు రూ. 2,033 కోట్లు వసూలయ్యాయి. వ్యవసాయ అనుబంధ రంగాలలో రూ.7,146 కోట్లు, , సూక్ష,చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి రూ.6,810 కోట్లు వసూలయ్యాయి. ఈ రకమైన రుణ బకాయిల వసూలు ఆశాజనకమైన పరిణామంగా భావిస్తున్నారు.

జారీ చేసినవారు :  సమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...