Nov 16, 2016

సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టి

Ø ఎంఎస్ఎంఇ పాలసీ 2015 -2020
Ø సబ్సిడీలు, రాయితీలు, రీయింబర్స్ మెంట్స్ తో భారీగా ప్రోత్సాహకాలు
Ø పారిశ్రామిక పార్కులలో 15 శాతం భూమి కేటాయింపు

             స్థానిక వనరులు, ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఇ-మైక్రో,స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్)ను ప్రోత్సహిస్తోంది.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు ఆర్థిక, సామాజిక అభివృద్ధిని సాధించడానికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే చిన్నతరహా పరిశ్రమలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటి కోసం ఈ ఏడాది బడ్జెట్ లో 25 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ రంగంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువమందికి ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. అంతే కాకుండా వెనుకబడిన ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలలో యూనిట్లు నెలకొల్పడం ద్వారా ప్రాంతీయ అసమానతలు తొలగించడానికి వీలవుతుంది. ఉత్పత్తి, ఉపాధి విషయంలో  ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఖాదీ, వ్యవసాయాధారిత వంటి చిన్నచిన్న పరిశ్రమలను అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించడానికి వీలవుతుంది. యూనిట్ల స్థాపనకు నిరుద్యోగ యువతకు బ్యాంకుల నుంచి రుణం పొందడానికి, ఉత్పత్తి అయిన వస్తువుల మార్కెటింగ్ కు పరిశ్రమల శాఖ సహాయ సహకారాలు అందిస్తుంది. అంతేకాకుండా మూతపడిన పారిశ్రామిక యూనిట్లను పునరుద్దించడానికి చేయూతనందిస్తుంది.  ఉత్పత్తి అయిన వస్తువుల సరఫరా, చెల్లింపుల విషయంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలతో ఏవైనా సమస్యలు తలెత్తితే పారిశ్రామిక వసతుల కల్పన మండలి(ఐఎఫ్సీ-ఇండస్ట్రియల్ ఫెసిలిటేషన్ కౌన్సిల్) ద్వారా పరిష్కరించడానికి కృషి చేస్తుంది.
          ప్రభుత్వం రెండంకెల స్థిర అభివృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో ఉత్పత్తి, ఉపాధికి ఎక్కువ  అవకాశాలున్న ఈ రంగంలో గత ఏడాదికంటే ఈ ఏడాది 30 శాతం ఎక్కువగా బ్యాంకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. గత ఆర్థిక సంవత్సరం(2015-16)లో రాష్ట్రంలో సూక్ష, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ఆధారపడిన 3,76,634 మందికి రూ.16,960 కోట్లు బ్యాంకులు రుణాలుగా ఇచ్చాయి. ఈ ఏడాది రూ. 22 వేల కోట్ల రూపాయలు రుణాలుగా ఇవ్వాలని నాబార్డ్ (వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంకు), రాష్ట్రస్థాయి బ్యాంకింగ్ కమిటీలు నిర్ధేశించాయి.

ఎంఎస్ఎంఇ పాలసీ 2015 -2020
      ఈ రంగం ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం ఎంఎస్ఎంఇ పాలసీ 2015 -2020ని రూపొందించింది. ఈ పాలసీ ద్వారా ఈ రంగానికి ప్రభుత్వం అనేక సబ్సిడీలు, రీయింబర్స్ మెంట్స్, రాయితీలు ప్రకటించింది. ఈ రంగంలో పరిశ్రమను నెలకొల్పితే రూ.20 లక్షలకు మించకుండా 15 శాతం పెట్టుబడి సబ్సిడీ ఇస్తారు. ఉత్పత్తి ప్రారంభమైన తరువాత 5 సంవత్సరాల వరకు వ్యాట్, సీఎస్టీ, ఎస్జీఎస్టీ తిరిగి చెల్లిస్తారు. వడ్డీ సబ్సిడీ రీయింబర్స్ చేస్తారు.  నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తారు. విద్యుత్ ఛార్జీలు రీయింబర్స్ చేస్తారు. పరిశ్రమకు ఉపయోగించడం కోసం కొనుగోలు చేసే స్థలం, షెడ్, భవనంపై స్టాంప్, బదిలీ డ్యూటీ వంద శాతం రీయింబర్స్ చేస్తారు. నిబంధనలకు అనుగుణంగా యూనిట్ స్థాపన కోసం భూమి కొనుగోలు చేస్తే రూ.10 లక్షలకు మించకుండా 25 శాతం వరకు రీయింబర్స్ చేస్తారు. బీసీ, ఎస్సీ,ఎస్టీలకైతే రూ.20 లక్షలు మించకుండా 50 శాతం వరకు రీయింబర్స్ చేస్తారు. వ్యవసాయ భూమిని పారిశ్రామిక ఉపయోగాల కోసం మార్పు చేసే చార్జీలలో రూ.10 లక్షల లోపు 25 శాతం వరకు రీయింబర్స్ చేస్తారు. పేటెంట్ రిజిస్ట్రేషన్ కోసం చేసే ఖర్చులు రీయింబర్స్ చేస్తారు. ఉద్యోగులు లేక కార్మికుల వృత్తి నైపుణ్యానికి సంబంధించి శిక్షణకు అయ్యే ఖర్చులను కూడా రీయింబర్స్ చేస్తారు. ఐఎస్ఓ-9000, బీఐఎస్ నాణ్యత ప్రమాణాల ధృవీకరణ పత్రం కోసం రూ.50 వేల వరకు సమకూరుస్తారు. ఉత్పత్తుల నాణ్యత విషయంలో బహుళజాతి కంపెనీలతో పోటీపడాలనేది దీని ముఖ్య ఉద్దేశం. ఉత్పత్తిలో ఎంఎస్ఎంఇ ఇతర రంగాలతో పోటీపడేవిధంగా టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడానికి, ఆధునీకరించడానికి ఒక్కో యూనిట్ కు రూ.2.50 లక్షల వరకు సమకూరుస్తారు. రాష్ట్రంలో ఏపీఐఐసీ (ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) అభివృద్ధిపరిచే పారిశ్రామిక పార్కులలో ఎంఎస్ఎంఇ పరిశ్రమలకు 15 శాతం భూమిని రిజర్వు చేస్తారు. కొత్తగా ప్రారంభించే యూనిట్లకైతే మిషనరీ విలువలో పది శాతం ఆర్థిక సహాయం చేస్తారు. ఈ రంగంలో పరిశ్రమల సమస్యల పరిష్కారినికి ఒక డెస్క్ ను ఏర్పాటు చేశారు.

‘ఆంధ్రప్రదేశ్ రత్నాలు’ అవార్డులు
      ఈ రంగంలో ఉత్పాదక సామర్థ్యం, రక్షణ విధానాలు, నూతన పోకడలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ‘ఆంధ్రప్రదేశ్ రత్నాలు’ అనే అవార్డులను ప్రభుత్వం ఇస్తోంది. పారిశ్రామికవేత్తల మధ్య పోటీ తత్వాన్ని పెంపొందించడానికి ఈ అవార్డులు ఇస్తున్నారు.

జారీ చేసినవారు :  సమాచార పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...