Nov 29, 2016

300 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి


ü
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి ప్రణాళిక
ü మూడు పారిశ్రామిక కారిడార్లు
ü ఏడు పారిశ్రామిక నోడ్ లు
ü ఏపీఐఐసీ ఆధ్వర్యంలో 16 భారీ ప్రాజెక్టులు
ü రెండు జాతీయ పెట్టుబడి, ఉత్పాదక మండళ్లు
ü 20 ప్రత్యేక ఆర్థిక మండళ్లు
ü చిత్తూరు, విశాఖలలో ఐటీ పెట్టుబడి రీజియన్లు
ü స్మార్ట్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్స్ 
             ప్రణాళికాబద్దమైన, స్థిరమైన పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందు కోసం పఠిష్టమైన ప్రణాళికలు రూపొందించింది. పారిశ్రామికాభివృద్ధికి క్లస్టర్ ప్రాతిపదికన ముందుకు వెళుతోంది.  పీపీపీ(పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం) పద్దతిలో బహుళ రంగాలకు సంబంధించి ప్రత్యేకమైన పార్కులు ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఏపీ పారిశ్రామిక, మౌలిక వసతుల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) లక్షా 21 వేల 655 ఎకరాలలో 300 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. ఇందులో ప్రత్యేక ఆర్థిక మండళ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పార్కులను అభివృద్ధి చేయడంతోపాటు కొత్త పార్కుల ఏర్పాటు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పారిశ్రామిక కారిడార్లు, పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక పెట్టుబడుల రీజియన్లు, ప్రత్యేక పెట్టుబడి జోన్లలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు, స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ కమిటీలను ఏర్పాటు చేశారు.
 మూడు పారిశ్రామిక కారిడార్లు
            చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్(సీబీఐసీ), విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్(వీసీఐసీ), కర్నూలు - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌(కేబీఐసీ)లను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తారు. ఈ మూడు కారిడార్లకు అనుబంధంగా ఏడు పారిశ్రామిక నోడ్ లను ఏర్పాటు చేస్తారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, అనంతపురం జిల్లా హిందూపురం, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి-ఏర్పేడు, కృష్ణా జిల్లా గన్నవరం-కంకిపాడు, కాకినాడ, విశాఖపట్నంలలో పారిశ్రామిక నోడ్ లను ఏర్పాటు చేస్తారు.  నోడ్ ల అభివృద్ధికి  ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ), జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజన్సీ(జేఐసీఏ) వంటివి ఆర్థిక సహాయం అందిస్తాయి. అంతేకాకుండా ఈ మూడు కారిడార్ల అనుసంధాన కేంద్రంగా ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కారిడార్లు రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి ఉపయోగపడతాయి. ఇక్కడ అంతర్జాతీయ స్థాయి పోటీ వాతావరణం ఉంటుంది. పెట్టబడులు, మౌలికసదుపాయాలతోపాటు స్థానిక వాణిజ్య కార్యకలాపాలు మెరుగుపడతాయి.  విశాఖపట్నం, నక్కపల్లి, కాకినాడ ప్రాంతాలను  పెట్రోలియం, కెమికల్ అండ్ పెట్రోకెమికల్ ఇన్ వెస్ట్ మెంట్ రీజియన్స్ (పీసీపీఐఆర్)గా అభివృద్ధి చేస్తారు.


16 భారీ ప్రాజెక్టులు
            పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా ఏపీఐఐసీ 16 భారీ ప్రాజెక్టులు చేపట్టింది. విశాఖ జిల్లా గుర్రంపాలెంలో ఎలక్ట్రానిక్‌ తయారీ క్లస్టర్‌(ఈఎంసీ), కాపులుప్పాడలో సమీకృత ఐటీ టౌన్‌షిప్‌, నక్కపల్లి,  విశాఖలలో సమీకృత పారిశ్రామిక తయారీ క్లస్టర్లు,  కృష్ణా జిల్లా నూజివీడులో మెగాఫుడ్‌ పార్కు, నందిగామలో పారిశ్రామిక పార్కు, ప్రకాశం జిల్లా దొనకొండలో పీపీపీ పద్ధతిలో ప్రాంతీయ అభివృద్ధి కేంద్రం, కర్నూలు జిల్లాలో అల్ట్రామెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు, ఓర్వకల్లు మెగా పారిశ్రామిక హబ్, అనంతపురం జిల్లా పాలసముద్రం క్లస్టర్, నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఆదర్శ పారిశ్రామిక పార్కు, చిత్తూరు జిల్లాలో సెరామిక్ క్లస్టర్, తిరుపతిలో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చురింగ్ క్లస్టర్ లు వివిద దశలలో ఉన్నాయి.

రెండు జాతీయ పెట్టుబడి, ఉత్పాదక మండళ్లు
            ప్రకాశం జిల్లా పామూరు సమీపంలో, చిత్తూరు జిల్లాలో కేంద్రం జాతీయ పెట్టుబడి, ఉత్పాదక మండలి(ఎన్ఐఎంజడ్- నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చురింగ్ జోన్)లను ఏర్పాటు చేస్తుంది. ఈ జోన్లను అయిదు వేల ఎకరాలలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధితోపాటు ఉపాధి కల్పనకు  ఈ మండళ్లు దోహదపడతాయి.
 చిత్తూరు, విశాఖలలో ఐటీ పెట్టుబడి రీజియన్లు
      విశాఖ, చిత్తూరులలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టుబడి రీజియన్లను ఏర్పాటు చేస్తారు. ఈ రీజియన్లలో నివాస ప్రాంతాలతోపాటు ఐటీ, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ ఉత్పత్తులు, ప్రజోపకరణాలు, మౌలిక సదుపాయాలు, పరిపాలనా సేవలు అందుబాటులో ఉంటాయి. పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు, సమీకృత టౌన్ షిప్ ల వంటివి కూడా ఉంటాయి. 

స్మార్ట్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్స్
ప్రభుత్వం వివిధ జిల్లాలలో స్మార్ట్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్స్(ఎస్ఐటీ)ను  ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ పట్టణాలకు కావలసిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వమే సమకూరుస్తుంది. ఈ పట్టణాల నుంచి సమీపంలోని జాతీయ రహదారులను కలిపే విధంగా నాలుగు లైన్ల రోడ్లు నిర్మిస్తారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తారు. సమీపంలోని రైల్వే స్టేషన్లకు, పోర్టులకు అనుసందానంగా రోడ్లు వేస్తారు. ఫైబర్ లైన్లను కూడా అందుబాటులోకి తెస్తారు.
 20 ప్రత్యేక ఆర్థిక మండళ్లు
రాష్ట్రంలో ప్రస్తుతం 16 ప్రత్యేక ఆర్థిక మండళ్లు(ఎస్ఇజెడ్-సెజ్) ఉన్నాయి. మరో నాలుగిటిని ఏర్పాటు చేస్తారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ మండళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెజ్ నిబంధనల ప్రకారం అనేక రాయితీలు కల్పిస్తూ, త్వరితగతిన అనుమతులు ఇస్తున్నారు. ఈ పారిశ్రామిక ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే పెట్టుబడుల రాకతోపాటు రాష్ట్రం ఒక మెగా పారిశ్రామిక హబ్ గా ఏర్పాడుతుంది. ఇక్కడ యువతకు ఉపాధికి ఢోకా ఉండదు. దేశంలో అత్యున్నత రాష్ట్రంగా ఎదగటానికి అవకాశం ఏర్పడుతుంది.
  
జారీ చేసినవారు: రిసెర్చ్ అండ్ రిఫరెన్స్ విభాగంసమాచార, పౌరసంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
apspecialnews@gmail.com



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...