Nov 2, 2023

ఆశాజనకంగాలేని బీఆర్ఎస్ పరిస్థితి


తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే  కాంగ్రెస్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు.  తెలంగాణ సాధించిన పార్టీగా భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఇప్పటి వరకు మంచి గుర్తింపు ఉంది. అయితే, ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. అన్ని వర్గాల ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పథకాల అమలులో ఎమ్మెల్యేలు  పక్షపాతంతో  వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వినవస్తున్నాయి.  నిరుద్యోగ సమస్య తీవ్రరూపం దాల్చింది. టీఎస్పీపీఎస్సీ పేపర్ లీకేజీతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.తీవ్ర ఒత్తిడికి గురైన యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. టికెట్ల కేటాయింపులో బీసీలు, మహిళలతోపాటు చాలా వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. 

సిట్టింగ్ ఎమ్మెల్యేల వ్యవహారశైలి వల్లే బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వారు మళ్లీ పోటీచేస్తున్న కొన్ని చోట్ల ప్రజలు ఆవేశంతో ఊగిపోతున్నారు. మళ్లీ వారికి ఓటువేసే ప్రసక్తేలేదని ఖరాఖండిగా చెబుతున్నారు.  ప్రచారానికి వెళుతున్న కొందరు ఎమ్మెల్యేలపై  ప్రజలు తిరగబడుతున్నారు.కొన్ని గ్రామాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే అయినా, అభ్యర్థి అయినా ‘మా ఊరికి రావద్దు’ అని ప్లెక్సీలు కూడా పెడుతున్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నల్లొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆదోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మంచిర్యాల ఎమ్మెల్యే దినకర్ రావు,తుంగతుర్తి ఎమ్మెల్యే గాదం కిషోర్ కుమార్ వంటి అనేక మందిని ఓటర్లు నిలదీస్తున్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వారు చల్లగా జారుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో స్థానికులకు, బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. పోలీసులు కూడా రంగంలోకి దిగి ప్రజలకు సర్ధిచెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. 

 అనేక మంది ఎమ్మెల్యేలు  భూములు ఆక్రమించినట్లు  ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పథకాలు అన్నీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారన్నది ప్రజల ఆరోపణ. చాలా పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, పథకాల అమలులో అవకతవకలు జరగడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తీవ్రవ్యతిరేకత ఏర్పడింది. అనేక వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో  బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ వారికి 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజాంపేట, పేట్ బషీరాబాద్ లలో భూమి కేటాయించింది. సొసైటీవారు ఆ భూమికి అప్పటి మార్కెట్ ధర ప్రకారం ప్రభుత్వానికి డబ్బు చెల్లించారు. సుప్రీం కోర్టు కూడా ఏడాది క్రితం సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ భూమిని సొసైటీకి అప్పగిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా నమ్మబలికారు.  ఒక్క నిజాంపేట  భూమిని మాత్రమే సొసైటీకి అప్పగించారు. పేట్ బషీరాబాద్ భూమిని ఇప్పటి వరకు అప్పగించలేదు. ఈ సొసైటీలో దాదాపు 1100 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 70 మంది వరకు తనువు చాలించారు. హైదరాబాద్ లోని మిగిలిన జర్నలిస్టులు కూడా సొసైటీ ఏర్పాటు చేసుకుంటే భూములు ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. వారు సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారు. భూమి మాత్రం కేటాయించలేదు. దాంతో అత్యధిక మంది జర్నలిస్టులు ఈ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఇంతకు ముందు ఎప్పుడూ ప్రజల్లో బీఆర్ఎస్ అంటే ఇంతటి తీవ్రవ్యతిరేకత కనిపించలేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.  

బీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా అంతఆశాజనకంగా లేదు. వాటిలో ప్రజాకర్షణ పథకాలు ఏమీలేవు.  పాత పథకాలు కొనసాగిస్తామని, ప్రజలందరికీ బీమా సౌకర్యం, ఆరోగ్యశ్రీ గరిష్ట పరమితి రూ.15 లక్షలకు పెంచుతామని, పేద మహిళలకు, జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌, పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి,రేష‌న్ కార్డు పై సన్న బియ్యం ఇస్తామని, రైతుబంధు,దివ్యాంగుల పెన్షన్, ఆసరా పెన్షన్ ల పెంపు వంటి హామీలు ఇచ్చారు.  ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్‌ అమలు  సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయడానికి  ఒక  కమిటీ నియమిస్తామని చెప్పారు. అసైన్డ్‌ భూములపై ఆంక్షలు ఎత్తివేతకు ప్రయత్నం చేస్తామని మాత్రమే హామీ ఇచ్చింది. ఈ హామీలన్నిటికీ మెలికలు పెట్టారు. అందువల్ల ఓటర్లు వాటిని నమ్మే పరిస్థితుల్లో లేరు. 

గతంలో ఇతర పార్టీలకు చెందిన అనేకమంది బీఆర్ఎస్ లో చేరడానికి ఆసక్తి చూపించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత తీవ్ర రూపం దాల్చింది. ఎన్నికల సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. సర్వేలలో  అధిక శాతం కాంగ్రెస్ కు అనుకూలత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు,జడ్పీ చైర్మన్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతోపాటు పలుకుబడికలిగిన ముఖ్యనేతలు, జడ్సీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్ లు అనేక మంది బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో చేరుతున్నారు. అయితే, అత్యధిక మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. బీఆర్ఎస్ లో టికెట్లు రాని కొంతమంది ప్రముఖులు తమ అనుచరులతో కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ వారికి టికెట్లు కూడా ఇచ్చింది. 

బీఆర్ఎస్ పై వ్యతిరేకత  కాంగ్రెస్ పార్టీకి కలిసివస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి రాష్ట్ర పార్టీలో ఓ ఊపు తెచ్చారు. దానికి తోడు బీఆర్ఎస్ పై అసంతృప్తి, ఆ పార్టీ ప్రముఖ నేతలు భారీస్థాయిలో  కాంగ్రెస్ లో చేరడం... వంటి అంశాలన్నీ కాంగ్రెస్ కు కలిసివస్తున్నాయి. దాంతో ఆ పార్టీ ప్రజల్లోకి దూసుకుపోతోంది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాల హామీ కూడా ఓటర్లలోకి బాగా చొచ్చుకు వెళ్లింది. మహిళలు, యువతపై వారు ప్రత్యేక దృష్టి పెట్టారు. మహిళా పథకాలు పక్క రాష్ట్రం కర్ణాటకలో అమలు చేయడంతో ఆ పార్టీపై నమ్మకం పెరిగింది. ఎన్నికల సర్వేల ఫలితాలు, ప్రజాభిప్రాయం ప్రకారం కూడా కాంగ్రెస్ పార్టీకి 70 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ అసాధ్యంగా కనిపిస్తోంది. 

- శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...