Apr 16, 2017

తెలంగాణ ఇంటర్ లో మెరిసిన ఆకురాతి మానస

82 మార్కులతో 10వ ర్యాంక్

        గుంటూరుకు చెందిన ఆకురాతి వెంకట కృష్ణారావు, భారత స్వరాజ్యలక్ష్మిల మనవరాలు ఆకురాతి మానస తెలంగాణలో ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో వెయ్యికి 982 మార్కులు సాధించింది. 10వ ర్యాంక్ తో తెలంగాణలో మెరిసింది. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని శ్రీగాయత్రి జూనియర్ కాలేజీలో  మానస ఇంటర్ బైపీసీ చదివింది. వెంకట కృష్ణారావు గుంటూరు పట్టణ పద్మశాలి సంఘానికి కొంత కాలం కార్యదర్శిగా పని చేశారు. పద్మశాలీయుల ఐక్యతకు కృషి చేశారు.

           మానస తండ్రి ఆకురాతి వరహా కిషోర్ సుందరం ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నారు. ఉద్యోగరీత్యా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారు నివాసం ఉన్నారు. దాంతో మానస ఆయా ప్రాంతాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో పదవ తరగతి వరకు చదివింది. ఒకటి, రెండు తరగతులు రాజమండ్రిలో, 3,4,5 తరగతులు విజయవాడలో, 6, 7 తరగతులు కోల్ కతాలో, 8వ తరగతి భువనేశ్వర్ లో 9,10 తరగతులు  హైదరాబాద్ లో, ఇంటర్ సికింద్రాబాద్ లో చదివింది.
తండ్రి వరహా కిషోర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సైకాలజీలో మాస్టర్ డిగ్రీ చేసి, ప్రస్తుతం యాస్ట్రో సైకాలజీలో పీహెచ్ డీ చేస్తున్నారు. తల్లి బాలసరస్వతి ఎమ్మెస్సీ చేశారు. వీరికి ఇంజనీరింగ్ చదువుతున్న స్వరాజ్, మానస ఇద్దరు బిడ్డలు. బాలసరస్వతి కొద్ది కాలం లెక్చరర్ గా పని చేశారు. ఆ తరువాత భర్త ఉద్యోగరీత్యా బదిలీలు - పిల్లలు ఎదిగిరావడం - వారి ఆలనాపాలనా చదువులు - ఆసక్తి ఉన్న అంశాలలో వారిని ప్రోత్సహించడం చేశారు. భర్త ఉద్యోగబాధ్యతల్లో తలమునకలై ఉంటే, పిల్లల అవసరాలన్నీ తనే దగ్గరుండి చూసుకుంటోంది.  చదువులో తల్లిదండ్రులనే ఆదర్శంగా తీసుకొని మానస ఇంటర్ లో ర్యాంక్ సాదించింది. ఉన్నత చదువులు చదవాలన్న ఆసక్తితో ఉంది. ఇంటర్ లో అధిక మార్కులు సాధించిన సందర్భంగా మానస మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మార్గదర్శకంలో ఇది సాధ్యమైందని తెలిపింది. ఇష్టంగా చదివితే ఏదీ కష్టం కాదంది. హెల్త్ కు సంబంధించిన కోర్సు చేసి, ఆరోగ్య భారత్ లో భాగస్వామిని కావాలనుకుంటున్నట్లు మానస చెప్పింది.
       

        చదువే కాకుండా మానసకు సంగీతం పట్ల ఆసక్తి ఉంది. లండన్ కు చెందిన ట్రినిటీ కాలేజీ పియానో పరీక్షల్లో డిస్టిన్షన్ లో మంచి మెరిట్ లో పాసవుతోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు స్థాయిల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.  సికింద్రాబాద్ లోని శ్రీభక్త రామదాస్ ప్రభుత్వ మ్యూజిక్, డ్యాన్స్ కాలేజీలో వీణ సర్టిఫికెట్ కోర్సు 4వ సంవత్సరం చేస్తోంది.  ఈ కోర్సులో మానస ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంటోంది. బెంగళూరులోని పండిట్ రవిశంకర్ అంతర్జాతీయ కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాల్లో జరిగిన వీణ సమ్మేళనాల్లో పాల్గొని మానస పలువురి ప్రశంసలు అందుకుంది.  అటు పాశ్యాత్య(పియానో), ఇటు భారతీయ (వీణ)  వాయిద్య పరికరాలతో ప్రయోగాలు చేసి జనరంజకమైన సంగీతం అందించాలన్నది తన ఆకాంక్షగా తెలిపింది.   సంగీతం ద్వారా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తానని మానస చెప్పింది.  














      

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...