May 12, 2017

అధికారులను ఆకట్టుకుంటున్న యువనేత నారా లోకేష్


రాజకీయంగా ఎదగాలన్న ఆకాంక్ష, అదే సమయంలో వేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందడానికి తన వంతు కృషి చేయాలన్న  తపన ఉన్న యువనేత నారా లోకేష్. మంత్రి పదవి చేపట్టిన ప్రారంభంలోనే తన ప్రవర్తన,  తండ్రి లాగా ఇన్నొవేటివ్ ఆలోచనలతో అధికారులను బాగా ఆకట్టుకుంటున్నారు. అధికారుల పట్ల వినయ విధేయతలతో వ్యవహరించడం, వారి సీనియార్టీని, సామర్ధ్యాన్ని గుర్తించి గౌరవిస్తున్న తీరుపట్ల వారు ఆకర్షితులవుతున్నారు.  మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత అమరావతి సచివాలయంలో జరిగిన గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారుల మొదటి సమీక్షా సమావేశంలో చాలా హుందాగా వ్యవహరించి లోకేష్ అందరి దష్టిని ఆకర్షించారు. అందకి చేతులు జోడించి చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేశారు.  ఆధునిక సాంకేతిక అంశాల మేళవింపుతో కొత్తగా ఆలోచనలు చేయడం తండ్రి నుంచి వంటపట్టించుకున్నట్లు కనిపిస్తోంది. పనుల్లో వేగం పెంచడానికి తండ్రి మాదిరే అధికారులపై వత్తిడి పెంచుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పోల్చితే నవ్వుతూ పలకరించడం, నవ్వుతూ ప్రతి నమస్కారం చేయడం, నవ్వుతూ మాట్లాడటం లోకేష్ ప్రత్యేకత. ఓ బిడ్డకు తండ్రి అయినా మంచి జోష్ తో ఇంకా కుర్రవాడిగానే కనిపిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కుమారుడైనా ఆ దర్పం ప్రదర్శించడంలేదు. అధికారులకు అది బాగా నచ్చుతోంది. సమావేశానికి రావడం కొంచం అలస్యం కావడంతో రావటం రావటంతోనే క్షమాపణలు కోరారు.


              తనకు అప్పగించిన శాఖ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలని, వేగంగా గ్రామాలు అభివృద్ధి చెందాలని, అంతే వేగంగా చేపట్టిన పనులు పూర్తి చేయాలన్న ధృడ సంకల్పం లోకేష్ లో బాగా కనిపిస్తోంది. చాలా ఉత్సాహంగా మనిషి మంచి తేజస్సుతో ఉన్నారు.  అంతే కాకుండా ప్రతి అంశాన్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రామీణాభివద్ధిలో ప్రధానమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజి (భూగర్భ మురుగునీటి పారుదల) వ్యవస్థపై అధికారులను అనేక ప్రశ్నలు అడిగి  అన్ని విషయాలను తెలుసుకున్నారు. ఒక గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తి కావడానికి సర్వే మొదలుకొని పూర్తి అయ్యే వరకు పట్టే సమయం- దానికి వాడే టెక్నాలజీ- అయ్యే ఖర్చు- ఉపాధి హామీ నిధులు –
ఇతర మార్గాల్లో నిధుల సమీకరణ - సీసీ రోడ్లు లేని చోట- ఉన్న చోట పనులు చేపట్టే విధానం, వివిధ దశలలో ఉత్పన్నమయ్యే  సమస్యలు- పైపులు బిగించే పద్దతులు- చివరకు మురుగు నీరు చేరే ప్రదేశం-ప్లాస్టిక్ చెత్త- మురుగు వాసన- దోమలు- కాలుష్యం ఏర్పడకుండా తీసుకునే చర్యలు- గ్రామ సర్పంచ్ లు, స్థానికుల సహకారం....ఇలా అన్ని అంశాలు అధికారులను అడిగి సమగ్రంగా తెలుసుకున్నారు. లోకేష్  ప్రశ్నలు  అడిగే తీరు అందరికీ బాగా నచ్చింది. ప్రశ్నలు అడిగే సమయంలో ‘మీకు టెస్ట్ కాదు, నేను తెలుసుకోవడానికి’ అని వినమ్రంగా చెప్పడం బాగుంది. నర్మగర్భంగా ఆయా అధికారుల అవగాహన, విషయ పరిజ్ఞానం, సామర్థ్యం తెలుసుకోవడానికి కావచ్చు లేదా నిజంగానే తాను తెలుసుకోవడానికి కావచ్చు. ఏదిఏమైనా సీనియర్ అధికారులను గౌరవిస్తూ, పనిని ఇంకా వేగవంతం చేసే విధంగా వారిని ఉత్సాహపరిచారు. దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా గ్రామాలను అభివృద్ధి చేయాలన్న తన ఉద్దేశాన్ని తెలియజేశారు. మధ్య మధ్యలో తన తండ్రి ప్రస్తావన తెస్తూ, ఈ పనులలో వేగం పెరగాలని, త్వరగా పూర్తి కావాలన్నది ముఖ్యమంత్రి గారి ఉద్దేశమని చెప్పారు. ఎంతో బాధ్యత గల ఈ శాఖను తనకు అప్పగించారని లక్ష్యం మేరకు రాబోయే రెండేళ్లలో 1340 గ్రామాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను అందరం కలసి పూర్తి చేద్దామని చెప్పారు. తక్కువ సమయంలో ఈ పనులు పూర్తి చేయడానికి తీసుకోవలసిన చర్యలు, తలెత్తే సమస్యలతో పది రోజుల్లో ఒక నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పనులు త్వరగా పూర్తి కావడానికి కావలసిన అన్ని తాను సమకూరుస్తానని వారికి భరోసా ఇచ్చారు. అలాగే శాఖాపరంగా, పనులు పరంగా మనందరం ఒకటేనని, పరస్పర సహకారంతో కలసికట్టుగా పనిచేయాలని వారిలో ఒక రకమైన ఐక్యభావాన్ని, ఉత్తేజాన్ని కలిగించారు. తనపై ఫోకస్ ఎక్కువ ఉంటుందని, అందువల్ల అధికారులు అందరూ తమతమ విధుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని ఒకటికి రెండుసార్ల హెచ్చరించారు.   గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందడంతోపాటు  రాజకీయ నాయకుడిగా కూడా తాను ఈ పనులు వేగంగా పూర్తి చేయవలసిన అవసరం ఉందని అర్ధమొచ్చేవిధంగా  లోకేష్ అధికారులకు సరదాగా నవ్వుతూ చక్కగా వివరించిన తీరు ఆయన రాజకీయ పరిణతికి నిదర్శనంగా చెప్పవచ్చు. అదేవిధంగా సమావేశం మధ్యలో అభినందనలు తెలియజేయడానికి వచ్చిన  మాజీ మంత్రి, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులను అన్నా అని ఎంతో మర్యాదగా పలకరించడం, కొందరితో మీరు పెద్దవారని ఆప్యాయంగా పలకరించడం, నవ్వుతూ ప్రతి నమస్కారం చేసే తీరు భవిష్యత్ లో ఆయన రాజకీయ ఎదుగుదలను సూచిస్తున్నాయి. అటు అధికారులు, ఇటు పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తల పట్ల లోకేష్ వ్యవహరించే తీరుని అందరూ ప్రశంసిస్తున్నారు. 

-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...