May 12, 2017

ఆర్థిక నేరాలపై విస్తృత స్థాయిలో చర్చ

సచివాలయంలో ఎస్ఎస్ సీసీ 11 వ సమావేశం
·       ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని నిర్ణయం
·       ఈ నెల 26న స్వయంసేవక గ్రూపు మహిళలకు శిక్షణ
            సచివాలయం, మే 11: రాష్ట్రంలో చట్టవ్యతిరేకంగా జరుగుతున్న ఆర్థిక నేరాలపై స్టేట్ లెవల్ కోఆర్డినేషన్ (ఎస్ఎల్ సీసీ) విస్తృత స్థాయిలో చర్చించింది. సచివాలయం 2వ బ్లాక్ ఆర్థిక శాఖ సమావేశ మందిరంలో ఎస్ఎల్ సీసీ 11వ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా డిపాజిట్ల పేరుతో జరుగుతున్న మోసాలు, వాటికి సంబంధించిన కేసులను ఆర్బీఐ, రాష్ట్ర ఆర్థిక, హోం శాఖల ఉన్నతాధికారులు సమీక్షించారు. చిట్ ఫడ్ కంపెనీలు, కోపరేటివ్ సొసైటీలు, రియల్ ఎస్టేట్, బిల్డర్స్, డెవలపర్స్, కాల్ మనీ, ఎర్రచందనం మొక్కల పెంపకం... వంటి పేర్లతో జరిగే మోసాలు చర్చకు వచ్చాయి. అనేక రకాలుగా జరిగే ఆర్థిక నేరాలు, వాటికి సంబంధించిన వివిధ సివిల్, క్రిమినల్ కేసులను సమీక్షించారు. నల్లధనం అరికట్టడానికి చేపట్టిన సంస్కరణలు ఆర్బీఐ అధికారులు వివరించారు. అగ్రిగోల్డ్, అభయగోల్డ్, కార్పోరేట్ జూయలరీ సంస్థలు సేకరించే డిపాజిట్లు, ఉద్యోగాల పేరుతో వసూలు చేసే ఫీజులు,  మజుమ అఫిషిలియేట్ ఎక్సపెర్టైజ్ లిమిటెడ్, చెరుకూరి గ్రూప్(హైదరాబాద్), అవని గ్రూప్(ఒంగోలు, హైదరాబాదు), ప్రగతి గ్రామీణ వికాస(విజయవాడ), వెబ్ వర్క్.ఇన్(కాన్పూర్),చిట్ మాక్స్(హైదరాబాద్), ఇందూరు డెవలపర్ అండ్ ఏజన్సీ(విజయవాడ), కపిల్ చిట్స్ గ్రూప్, యూనిక్ గోల్డ్ ఇండియా, విశ్వమిత్ర ఇండియా పరివార్(ఉత్తభారతం), గోల్కొండ, హవాలా ... వంటి కేసులు ప్రస్తావనకు వచ్చాయి. ఇదీ అది అని కాకుండా బ్యాంకులు, కేవైసీ, హవాలా నేరాలు, చట్టవ్యతిరేకంగా జరిగే నగదు లావాదేవీలు, వాటిని అరికట్టడానికి తీసుకోవలసి చర్యలు అన్నిటిపై చర్చించారు. చట్టవ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే, మోసం చేసిన కంపెనీలపై వచ్చిన ఫిర్యాలు, తీసుకుంటున్న చర్యలు,  లీగల్ కేసులను గురించి పోలీస్ అధికారులు వివరించారు.  చట్ట వ్యతిరేకంగా జరిగే ఆర్థిక నేరాలన్నిటినీ, అవి జరిగే తీరును, తీసుకోవలసిన జాగ్రత్తలను సమగ్రంగా చర్చించారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే సంస్థలు, అధిక వడ్డీ ఇస్తామని చట్టవ్యతిరేకంగా డిపాజిట్లు  సేకరించే సంస్థలపై, వెబ్ సైట్ల ద్వారా జరిగే మోసాలను అరికట్టడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఉన్నతాధికారులు మాట్లాడారు. ఏఏ కేసులు కోర్టు విచారణలో ఉన్నయో, కొన్ని కేసులు ఏఏ స్థాయిల్లో విచారణ దశలో ఉన్నయో కొందరు అధికారులు వివరించారు.  ముఖ్యంగా ఇటువంటి ఆర్థిక నేరస్తుల బారిన పడకుండా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, వారికి అవగాహన కల్పించడానికి ఆచరాణాత్మకమైన కార్యక్రమాలపై చర్చించారు. ప్రజలు ఎక్కడబడితే అక్కడ డబ్బు డిపాజిట్ చేయకుండా, ఏ విధంగా మోసాలు జరుగుతాయో వారికి వివరించి చెప్పే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. చిల్లర వ్యాపారులు, చిన్న వ్యాపారులు, మార్కెట్లలోనూ, బజార్ల వెంట తిరుగుతూ కూరగాయలు అమ్ముకునేవారు ఎక్కవ వడ్డీకి డబ్బుతీసుకునే అంశాలను, వారిని ఆదుకునే మార్గాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు.
ఎవరినిబడితే వారిని నమ్మి చట్టవ్యతిరేకంగా డిపాజిట్లు చేయకుండా, అధిక వడ్డీలకు నగదు తీసుకొని నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్రంలో విస్తృత స్థాయిలో ఉన్న స్వయంసేవక గ్రూపుల మహిళలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. మొదట ఈ నెల 26న రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వంద మంది స్వయంసేవక సంఘాల ముఖ్యులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.  వారు ఆయా జిల్లాల్లోని గ్రూపు సభ్యులకు అవగాహన కల్పిస్తారు.  ఎంపిక చేసి వారికి రిజర్వు బ్యాంకు, పోలీసు శాఖ, ఆర్థిక శాఖల అధికారులు శిక్షణ ఇస్తారు.
ఈ సమావేశంలో ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.రవిచంద్ర, సెక్రటరీ కె.సునీత, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏ. అనురాధ, సీఐడీ ఐజీ అమిత్ గార్గ్, సీఐడీ అడిషనల్ డీజీ తిరుమల రావు, రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ ఆర్.సుబ్రమణియన్, జనరల్ మేనేజర్ సువెందు పాటి పాల్గొన్నారు.


జారీ చేసినవారు: పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం, అమరావతి. 


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...