May 21, 2017

ఆచ్ఛాదన, అశ్లీలతలేని అందమైన స్త్రీ మూర్తి!

అదే డాక్టర్ మాచిరాజు సృష్టి
    మేళకర్తల రాగాలకు కూడా
   వర్ణ రూపం ఇచ్చే  ప్రయత్నం

         ఆయన కుంచె కదిపినా, గీత గీసినా స్త్రీ రూపం సంతరించుకుంటుంది. స్త్రీ  అంటే ఆయనకు అంతటి గౌరవం, అభిమానం. స్తీ మహాశక్తి స్వరూపిణి. సౌందర్య రాశి. స్త్రీ సౌందర్యం మనసుకి, మాటలకు అందదు.  దానిని రంగులలో, గీతలలో కాన్వాస్పై ఆవిష్కరించే ప్రయత్నాలు ఆయన దీర్ఘకాలంగా కొనసాగిస్తున్నారు.  ఆచ్ఛాదన, అశ్లీలతలేని అందమైన స్త్రీ మూర్తిని సృష్టించగల దిట్ట. ఆయనే 'కళారత్న'డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు.   ఆయన వృత్తి వైద్యం. ప్రవృత్తి చిత్రకళ.  వైద్య వృత్తిలో ఊపిరిసలపకుండా ఉన్నప్పటికీ  చిత్రకళపై ఆయనకు మక్కువ ఏమాత్రం తగ్గలేదు. చిత్రకళలో కూడా ఉన్నత స్థాయికి ఎదిగారు.  ఆయన చిత్రకలకు ప్రధాన వస్తువు స్త్రీ మూర్తి. ప్రకృతి దృశ్యాలు - మనసులో మెదిలే భావాలు - ఆలోచనలు - స్త్రీ సౌందర్య రూపాలన్నింటినీ ఆయన కాన్వాస్ మీద ఆవిష్కరించారు. అశ్లీలత గోచరించకుండా అందమైన స్త్రీ రూపాన్ని అంతే అందగా, నగ్నంగా చిత్రించగల కళాపిపాసి. అవన్నీ ఆయన ప్రతిభకు అద్దం పడతాయి. అంతర్జాతీయ స్థాయి చిత్రకారుల కళారీతులను అధ్యయనం చేశారు. దేశ విదేశాల్లో అనేక మంది చిత్రకారులను కలసి వారితో భావాలను పంచుకున్నారు.  సాహిత్య, సంగీతంలో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. ఇంగ్లీషు, తెలుగు భాషల్లో దిగ్గజాల రచనలు, కవితలు చదివి ఆయన ఓ గొప్ప తత్వవేత్తగా ఎదిగారు. సాహిత్యంలోని లోతులను ఎంతగా అవగాహన చేసుకుంటారో, సంగీతంలోని మాధుర్యాన్ని అంతగా ఆస్వాదిస్తారు. ఒక్క స్త్రీ సౌందర్యాన్నే కాకుండా, ప్రకృతిలోని అందాలతోపాటు 'వర్ణవిలాసంలో స్వర్ణవినాయకం' అని విఘ్నేశ్వరుని కూడా పలు రూపాలలో చిత్రించారు.  చిత్రకారులకు వినాయకుని రూపం ఓ వరం. 5,6 గీతలతో కూడా ఆ రూపాన్ని చూపించగలరు. మాచిరాజు కూడా వివిధ రంగుల్లో అనేక రూపాలకు జీవం పోశారు. తన అపురూప చిత్రాలతో ఖండాతరవాసులను కూడా ఆయన ముగ్దలను చేశారు. డాక్టర్ మాచిరాజు దేశవిదేశాల్లో హైదరాబాద్, బెంగళూరు, పాండిచేరి, ముంబై, న్యూఢిల్లీలతోపాటు మాంచెస్టర్, లివర్ పూల్, వేల్స్, చెష్టర్ షైర్ వంటి చోట్ల తన ఆర్ట్ ఎగ్జిబిషన్లు నిర్వహించారు.

          పెన్సిల్తో మొదలై జలవర్ణం, తైలవర్ణం చిత్రాల వరకు - సాంప్రదాయ చిత్రాల నుంచి ఆధునిక నైరూప్య చిత్రాల వరకు -  ఒంగోలు నుంచి లండన్ వరకు ఆయన చిత్రకళా ప్రదర్శనల ప్రస్తానం కొనసాగుతోంది. ఆయన ఆలోచనల దొంతరుల నుంచి రూపుదిద్దుకున్న చిత్రాలు  కళాభిమానులను అబ్బుపరుస్తాయి. బాపు, ఎస్ వి రామారావు వంటి సుప్రసిద్ద చిత్రకారుల ప్రశంసలు అందుకున్నారు.   కాల క్రమంలో ఏడాదికేడాది కొత్త ఆలోచనలతో , కొత్త ఆవిష్కరణలతో ఆయన చిత్ర కళలో వైవిద్యం, పరిణతి కనిపిస్తోంది. ఎన్ని ఇజాలను ఆయన అధ్యయనం చేసినా, ఎంతమందిని అభిమానించినా  సాంప్రదాయ, ఆధునిక రీతుల మేళవింపుతో తనదైన ఓ కొత్త శైలిని రూపొందించుకున్నారు.  రంగుల ప్రపంచంలో నిత్యనూతనంగా ప్రయాణించే ఓ స్వాప్నికుడు. కొంగొత్త స్పూర్తితో మాయా సౌందర్యం  అంతఃకోణాన్ని నైరూప్యతతో నూతన పద్దతులలో చిత్రించడం కూడా మొదలుపెట్టారు. నైరూప్య చిత్రాల అస్పష్టతలోంచి స్పష్టత చూపే ప్రయత్నం చేస్తున్నారు. నైరూప్యత అంటే అదో చైతన్య స్రవంతి. సత్య సౌందర్యం. దృశ్యానికి భాష అవసంరలేదు.  కుంచె పట్టుకుంటే ఆయన ఓ తత్వవేత్తయిపోతారు. ఆ రంగుల్లో, ఆ గీతల్లో, ఆ ఒంపుల్లో చెప్పే అంశాలు అనంతం. అదో అద్భుత ప్రపంచం. ఆయన కుంచె నుంచి జాలువారిన  నైరూప్యతలో స్పష్టత వచ్చిన తరువాత, ఆ స్వచ్ఛత, ఆ నిర్మలత్వం, దాని అర్ధం బోధపడటం....ఆ అనుభూతి, ఆ ఆనందం, ఆ హాయి వేరు. అది అనుభవించవలసిందే. వర్ణించడం సాధ్యంకాదు. అదో మధురానుభూతుల మేళవింపు. ఆ రంగుల్లో, ఆ గీతల్లో, ఆ ఒంపుల్లో చెప్పే అంశాలు అనంతం. అదో అద్భుత ప్రపంచం. స్త్రీ మూర్తిని అర్ధం చేసుకోవడం, ఆమె సౌందర్యాన్ని  తెలుసుకోవడమేకాదు సాహిత్యం, సంగీతంలో కూడా ఆయనకు ప్రవేశం ఉంది. వాటిలో కూడా ఆయన  పరిపూర్ణత సాధించారు. జ్ఞాన దృష్టితో రాగాలను కూడా రంగులలోకి మార్చగల సమర్ధుడు. ఇప్పుడు రాగాలను కూడా  వర్ణ రూపంలోకి మార్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఆ బృహత్తర కార్యక్రమాన్ని ఓ  తపస్సు, యజ్ఞంలా  కొనసాగిస్తున్నారు.   మేళకర్తల రాగాలకు వర్ణ రూపం    తేవడానికి 15 ఏళ్లుగా డాక్టర్ మాచిరాజు కుంచెతో సృజనాత్మకంగా కుస్తీ పడుతున్నారు.

        ఆయన సృష్టించే చిత్రాలకు ప్రేరణ గురించి ప్రస్తావించినప్పుడు, సమయం - వయసు - సందర్భం... ఏది ప్రభావితం చేస్తే అది కాన్వాస్ మీద ఆవిష్కరణ అవుతుందని చెప్పారు. స్త్రీ మూర్తిని నగ్నంగా చూపుతారన్న విమర్శకు  అందానికి ఆచ్ఛాదన దేనికి? అని ప్రశ్నించారు.  అలా అని స్త్రీని చపలచిత్తంతో చూడనని,  అందమైన దృష్టితోనే చూస్తానని, ఆ దృష్టితోనే తన మదిలో మెదిలిన రూపాన్ని గీస్తానని వివరించారు.  కర్ణాటక సంగీతంలో 72 తల్లి రాగాలు ఉన్నాయని, 72 మేళకర్తల రాగాలను వర్ణరూపంలోకి తీసుకువచ్చే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నట్లు తెలిపారు.  ఇది తన జీవిత లక్ష్యంగా పేర్కొన్నారు. 15 ఏళ్లుగా ఇది కొనసాగుతోందన్నారు. ఇప్పుడే తుది దశకు వచ్చినట్లు తెలిపారు. దీనిని పూర్తి చేసి ప్రపంచ వ్యాప్తంగా కళా ఉత్సవాలు నిర్వహించాలని అనుకుంటున్నట్లు డాక్టర్ మాచిరాజు అని తన మనసులోని మాటలు చెప్పారు.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...