May 12, 2017

పెట్టుబడులకు ఆంధ్రా అనుకూలం: చైనా ప్రతినిధి బృందం

బంధాలు పఠిష్టతకు సందర్శన ఉపయుక్తం
రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు వివరించిన అధికారులు

            సచివాలయం, మే: 10: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలంగా ఉందని చైనాలోని షెన్యాంగ్ మున్సిపల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ పాన్ లింగో అన్నారు. చైనా ప్రభుత్వ  సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు బుధవారం ఉదయం సచివాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయం 2వ బ్లాక్ లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్,వ్యవసాయ ఉత్పత్తల వ్యాపారం, వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థల శాఖల మంత్రి అమరనాథరెడ్డి, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ, ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు(ఏడీబీ) సీనియర్ అధికారులు వారికి స్వాగతం పలికారు. అనంతరం చైనా, ఏపి బృందాల మధ్య జరిగిన సమావేశంలో ఏపీ  అధికారులు రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడులకు అవకాశాల గురించి వీడియో ప్రదర్శన ద్వారా వివరించారు. దేశంలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సముద్ర తీరం, అపారంగా ఉన్న వనరులు, ఖనిజసంపద, నైపుణ్యత గల మానవ వనరులు, ప్రభుత్వం కల్పించే మౌలిక వసతులు వల్ల  పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి అనుకూలంగా ఉంటుందని వివరించారు. ప్రతి ఆర్థిక సంవత్సరం 12 శాతం వృద్ధి సాధించాలన్న లక్ష్యంతో 2029 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు పేర్కొన్నట్లు చెప్పారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం  ప్రైవేటు పెట్టుబడులు రాబట్టడంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఇ-గవర్నెస్ లో రాష్ట్ర ప్రగతిని వివరించారు. పరిశ్రమల స్థాపనకు కావలసిన 39 రకాల అనుమతులు 21 రోజుల్లో పొందే అవకాశం ఉన్నట్లు తెలిపారు.  అలాగే రాష్ట్రంలో ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, పెట్రోకెమికల్, లెథర్ టెక్నాలజీ, టెక్సటైల్స్, ఎనర్జీ, లైఫ్ సైన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. వివిధ రంగా అభివృద్ధికి ప్రభుత్వం రూపొందించిన పాలసీల గురించి వివరించారు. ప్రాంతాలవారీగా పరిశ్రమల స్థాపనకు అవకాశాలను వివరిస్తూ రూపొందించిన మ్యాప్ ను ప్రదర్శించారు. రాష్ట్రంలో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలతోపాటు ఆరు విమానాశ్రయాలు ఉన్నాయని, మరో ఆరు విమానాశ్రయాల నిర్మాణం ప్రతిపాదనలో ఉన్నట్లు వివరించారు. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక జోన్లు, వాటి మధ్య పారిశ్రామిక మండళ్లు గురించి సవివరంగా తెలిపారు. సముద్ర తీరంవెంట లభించే ఖనిజవనరులు, అందుబాటులో ఉన్న పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల గురించి వివరించారు. రాష్ట్రాన్ని వ్యవసాయ ఉత్సత్తుల ఎగుమతి జోన్ గా అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను తెలిపారు. వివిధ రకాల ఖనిజ సంపద, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 17 వందలకుపైగా ఖనిజ ఆధారిత పరిశ్రమలు స్థాపించినట్లు వివరంచారు. విశాఖలో పెట్రోలియం రిఫైనరీ, పవర్ సెక్టార్ లో చేపట్టిన సంస్కరణలు, పొందిన అవార్డులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు నెలకొల్పనున్నట్లు చెప్పారు. వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్లు పది జిల్లాల్లో స్థాపించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలు, స్థాపించనున్న విద్యా సంస్థల గురించి వివరిస్తూ  నాలెడ్జి స్టేట్ గా, విద్యా హబ్ గా రూపొందనున్నట్లు తెలిపారు.

          చైనా, బ్రిటన్, సింగపూర్, జపాన్, డెన్మార్క్ వంటి దేశాలకు చెందిన అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో 29 గ్రామాలను కలుపుతూ  217 చదరపు కిలోమీటర్ల పరిధిలో నిర్మించే నూతన రాజధాని అమరావతి గురించి వివరించారు. అంతర్గతంగా నిర్మించే 9 నగరాల గురించి కూడా తెలిపారు. ఇక్కడ హైటెక్, ఫ్యాషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, టూరిజం, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉన్నట్లు తెలిపారు. 2015లో సీఎం ఆరు రోజుల పాటు చైనాలో పర్యటించి వివిధ అంశాలకు సంబంధించి 29 ఒప్పొందాలు చేసుకున్నట్లు అధికారులు వివరించారు. సోలార్ విద్యుత్ యూనిట్ స్థాపనకు కూడా ఒక ఒప్పొందం జరిగినట్లు చెప్పారు. ఇప్పటికే చైనాకు చెందిన సంస్థలు పెట్టిన పెట్టుబడుల గురించి తెలిపారు.

              చైనా ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన షెన్యాంగ్ మున్సిపల్ పీపుల్స్ కాంగ్రెస్ చైర్మన్ పాన్ లింగో మాట్లాడుతూ షెన్సాంగ్ సిటీ అభివృద్ధి క్రమం వివరించారు. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని వాతావరణం తమకు నచ్చినట్లు తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రం అనుకూలంగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే తమ దేశానికి చెందిన సంస్థలు దేశంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. తమ పర్యటన వల్ల ఇరు దేశాల మధ్య బంధం మరింత పటిష్టమవుతుందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని చెప్పారు.

పట్టణాభివృద్ధి అధికారులతో సమావేశం
         చైనా బృందం పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో కూడా సమావేశమైంది. ఈ సందర్భంగా పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కరికాల వరవన్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, పెట్టుబడులకు అవకాశాలు వివరించారు. వీడియో ప్రదర్శన ద్వారా కూడా పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు స్మార్ట్ సిటీలు,  విశాఖ, విజయవాడ, కాకినాడ, ఒంగోలు, శ్రీకాకుళం వంటి చోట్ల సౌకర్యాలు వివరించారు. విశాఖ, విజయవాడల మెట్రో రైల్ ప్రాజెక్టులు, స్వచ్ఛాంధ్ర, ఇ-గవర్నెస్ వంటి అంశాలను తెలిపారు. వంద పట్టణాలను ఆర్థిక నగరాలుగా అభివృద్ధి చేసే క్రమం, అక్కడ కల్పించే విద్యుత్, రోడ్లు, డ్రైనేజ్, మంచినీరు ...వంటి సౌకర్యాల కల్పన గురించి వివరించారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవలసిందిగా కోరారు. పరిశ్రమల స్థాపనకు కావలసిన సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పారు.

చైనా-భారత్ ఉమ్మడి వెంచర్ గా పౌల్టీ ఫీడ్స్ ఉత్పత్తి
        చైనాకు చెందిన వెల్ హోప్, భారత్ కు చెందిన నెక్సస్ ఫీడ్స్ సంస్థలు ఉమ్మడి వెంచర్ భారత్ లో ఇప్పటికే పౌల్టీ ఫీడ్స్ ఉత్పత్తిని ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఏపీలలో ఉత్పత్తి ప్రారంభించినట్లు నెక్సెస్ ఫీడ్ ఎండి సత్యనారాయణ రెడ్డి చెప్పారు. వ్యవసాయ రంగంలో పైలెట్ ప్రాజెక్టుని చేపట్టే ప్రయత్నంలో తెలిపారు. ప్రస్తుతం ఆక్వాఫీడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో కూడా ఉమ్మడిగా ఉత్పత్తులు ప్రారంభించే ఆలోచన ఉన్నట్లు ఆయన చెప్పారు. .

రెండు విడతలుగా జరిగిన సమావేశాల్లో మంత్రి అమరనాధ్ రెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వరవన్, షెన్సాంగ్ సిటీ చైర్మన్  పాన్ లింగ్, చైనా వ్యాపార వేత్త వెల్ హోప్ ఎండీ ఎలెక్స్, నెక్సస్ ఫీడ్ ఎండి సత్యనారాయణ రెడ్డి, చైనా, ఏపీ ప్రభుత్వం ఉన్నతాధికారులు, ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు అధికారులు  పాల్గొన్నారు.

 జారీ చేసినవారు: పబ్లిసిటీ సెల్, ఐ అండ్ పీఆర్, సచివాలయం, అమరావతి.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...