May 12, 2017

మరో 15 రోజులకు ధాన్యం కొనుగోలు గడువు పెంపు

·      పౌరసరఫరాల శాఖ మంత్రిగా ప్రత్తిపాటి పుల్లారావు బాధ్యతల స్వీకరణ
    రేషన్ సరకుల పంపిణీలో నగదు రహిత లావాదేవీలు తప్పనిసరి కాదు
          సచివాలయం, ఏప్రిల్ 10 : ధాన్యం కొనుగోలు గడువును మరో 15 రోజులకు పెంచుతున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన రెండ్రోజుల్లో ఆన్ లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామన్నారు. సచివాలయంలోని నాలుగో నెంబర్ బ్లాకులోని తన ఛాంబర్ లో సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రిగా ప్రతిపాటి పుల్లారావు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రేషన్ సరకుల పంపిణీలో నగదు రహిత లావాదేవీలు తప్పనిసరి కాదని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. ఎవరైనా నగదు రహిత లావాదేవీలు జరపాలని పట్టుబడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్డుదారులు తమకు వీలైన రీతిలో సరుకులు కొనుగోలు చేసుకోవొచ్చునన్నారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు నిలిపినట్లు తన దృష్టికి సమాచారం వచ్చిందన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ధాన్యం కొనుగోలు గడువును మరో 15 రోజులకు పెంచుతున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన రెండ్రోజుల్లో ఆన్ లైన్ ద్వారా డబ్బులు చెల్లిస్తామన్నారు. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తామన్నారు. కోటీ 40 లక్షలకు పైగా ఉన్న కార్డుదారులకు నాణ్యమైన సరకులను పంపిణీ చేస్తామన్నారు. పేదలకు అన్నంపెట్టే నిత్యావసర సరకుల పంపిణీలో ఎటువంటి అవకతవకలూ చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం చంద్రబాబునాయుడు తనపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తానని మంత్రి తెలిపారు. పౌర సరఫరాల శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేవిధంగా కృషి చేస్తానన్నారు. జూన్ నాటికి అందరికీ గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం చక్కెర పంపిణీపై సబ్సిడీ ఎత్తివేసిందన్నారు. ఏప్రిల్ నెలకు కార్డుదారులపై భారం పడకుండా ఉండేలా రాష్ర్ట ప్రభుత్వమే సబ్సిడీపై చక్కెర పంపిణీ చేస్తోందన్నారు. వచ్చే నెల నుంచి ఎలా పంపిణీ చేయాలన్నది త్వరలో సీఎంను సంప్రదించి చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు ఆయన తన ఛాంబర్లో దేవుని చిత్రపటాల ముందు పూజలు జరిపారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ర్ట వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్ సభ్యునిగా రిటైర్డ్ జడ్జి ముత్యాలనాయుడి నియామక ఫైల్ పై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తొలి సంతకం చేశారు. పౌర సరఫరాల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రత్తిపాటి పుల్లారావును, ఎంపి రాయపాటి రాయపాటి సాంబశివరావు, వినుకొండ ఎమ్మెల్యే, టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, జిల్లా పరిషత్ చైర్మన్ జానీమూన్, ఎమ్మెల్యే శ్రావణ్, ఎమ్మెల్సీ రామకృష్ణతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పౌర సరఫరాల శాఖ  కమిషనర్ బి.రాజశేఖర్, డైరెక్టర్ జి.రవిబాబు, గుంటూరు జేసీ కృతికా శుక్లా, డీఎస్ వో చిట్టిబాబు తదితరులు అభినందనలు తెలియజేశారు.
జారీ చేసిన వారు : పబ్లిసిటీ సెల్, సచివాలయం, అమరావతి


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...