May 14, 2017

ఏపీలో నైపుణ్యత కలిగిన యువశక్తి ఆవిర్భావానికి శిక్షణ

Ø ఏపీ ప్రభుత్వం-బ్రిటిష్ కౌన్సిల్ మధ్య ఒప్పందం
Ø శిక్షణతో లక్ష మంది నైపుణ్యత కలిగిన యువశక్తి ఆవిర్భావం
Ø 17 లక్షల మందికి ఆంగ్ల భాష నేర్పే ప్రాజెక్ట్

            రాష్ట్రంలోని యువత అన్ని అవకాశాలను అందిపుచ్చుకునేవిధంగా, వారి ఇంగ్లీష్ భాషా పరిజ్ఙానం పెంపొందించేందుకు ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఓ ప్రాజెక్టును చేపట్టింది. లక్ష మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో  బ్రిటిష్ కౌన్సిల్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఎంపిక చేసిన ఉన్నత విద్యా సంస్థల్లో, కళాశాలల్లో చదువుకునే యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం ఈ ప్రాజెక్టు ద్వారా వారి ఆంగ్లభాషా ప్రావీణ్యాన్ని మెరుగుపరుస్తారు. అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ ద్వారా వారికి భాషలో మెళకువలు నేర్పుతారు. తద్వారా వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నవారికి కూడా వారు పనిచేసే చోట భాషా కౌశల్యం ప్రదర్శించేవిధంగా శిక్షణ ఇస్తారు.

         బ్రిటిష్ కౌన్సిల్ అనేది యూకెకు చెందిన అంతర్జాతీయ సాంస్కృతిక సంబంధాలు, విద్యా అవకాశాలు మెరుగుపరిచే సంస్థ. 1934లో ప్రారంభించిన ఈ సంస్థకు 18 శాతం నిధులను బ్రిటిష్ ప్రభుత్వం సమకూరుస్తుంది.   ప్రపంచ వ్యాప్తంగా వందకు పైగా దేశాలతో కలసి అక్కడి సంస్కృతి, కళలు, ఆంగ్లభాష, విద్య, సామాజిక రంగాల్లో కలసి పని చేస్తుంది. యూకే, ఆయా దేశాల మధ్య స్నేహపూర్వక విజ్ఞానాన్ని, ప్రజల మధ్య అవగాహనను పెంపొందిస్తుంది. ఆంగ్ల భాషలో శిక్షణకు సహకరిస్తోంది. తమ దేశానికి చెందిన సాంస్కృతిక వనరులను వినియోగించుకొని అక్కడి ప్రజల జీవితాల్లో మార్పునకు సహకరిస్తూ, విశ్వాసాన్ని కలిగిస్తూ, సంబంధాలను మెరుగుపరుస్తుంది. కౌన్సిల్ ప్రతినిధులు ప్రతి ఏటా రెండు కోట్ల మందికి పైగా ప్రజలను ఆన్ లైన్ లో కలుసుకుంటారు. యూకే-ఇండియా ఇయర్ ఆఫ్ కల్చర్ 2017లో భాగంగా బ్రిటిష్ కౌన్సిల్ అనుబంధ సంస్థ బీసీఈఈఎస్ఐపీఎల్ (బ్రిటిష్ కౌన్సిల్ ఎగ్జామినేషన్ అండ్ ఇంగ్లీష్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) ఏపీతో తమ సంబంధాలను బలోపేతం చేసుకుంటోంది. ఈ ఏడాది పొడవునా అనే కార్యక్రమాలు పండుగ వాతావరణంలో జరుపుతారు.  ఆ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చక్కని ఎకోసిస్టమ్ ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఉండటంతో ఈ సంస్థ ఇక్కడ వ్యవస్థీకృత, సుస్థిరమైన ఓ పైలెట్ ప్రాజెక్టుని నిర్వహిస్తోంది. ఏపీలోని కళాశాలల్లో నాణ్యమైన, ఉత్తమ ఇంగ్లీష్ బోధన జరుగుతోంది. దీని ద్వారా 17 లక్షల మంది విద్యార్థులు తరగతి గదిలోనే ఆంగ్ల భాష సంభాషణా చాతుర్యం మెరుగుపరుచుకొని, ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవడానికి, విద్యా, ఉపాధి అవకాశాలను దక్కించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ పైలెట్ ప్రాజెక్టు 15 నెలల పాటు కొనసాగుతుంది. ఆంగ్ల భాషను బోధించే అధ్యాపకులు తమ బోధన విధాలనాలను మెరుగుపరుచుకుంటారు. ఆ విధంగా వారు ఉత్తమ రీతిలో సంభాషణా చాతుర్యాన్ని ప్రదర్శించే విధంగా శిక్షకులు తయారవడానికి అవకాశం ఉంటుందిమాస్టర్ ట్రైనర్లను కూడా అభివృద్ధి పరచుకోవడానికి వీలుకలుగుతుంది. ఆంగ్లం బోధించే ఉపాధ్యాయకులకు నిరంతరం వృత్తిపరమైన శిక్షణ ఇస్తారువిద్యార్థులు ముఖాముఖి, ఆన్ లైన్ ద్వారా శిక్షణ పొందుతారు.
విస్తృతమైన పరిశోధనల ఆధారంగా భాష నేర్చుకునేవారికి అనుకూలంగా ఈ బ్రిటిష్ కౌన్సిల్ కొన్ని విధానాలను రూపొందించింది. అత్యుత్తమ బోధనా వాతావరణాన్ని సృష్టించేవిధంగా, డిజిటల్ కార్యక్రమాలను కూడా తయారు చేశారు. ఆ ప్రకారం నాణ్యమైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కొన్ని కార్యక్రమాలను రూపొందించారు. ఈ ప్రాజెక్టులో అధ్యాపకులకు కూడా శిక్షణ ఇస్తారు. వారిలో కూడా పోటీ తత్వం ప్రోత్సహిస్తారు. తమ వద్ద నేర్చుకునే విద్యార్థులకు వారు మద్దతుగా నిలిచి, వారు అత్యుత్తమ స్థాయికి ఎదిగేవిధంగా తీర్చిదిద్దుతారు. ఆ విధంగా విద్య పూర్తి చేసుకొని విశ్వవిద్యాలయాల నుంచి, కళాశాలల నుంచి బయటకు వచ్చిన వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
           
  విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ద్వారా రాష్ట్రాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసి, వృద్ధి రేటు వేగంగా పెరిగేవిధంగా కృషి చేయాలన్న పట్టుదలతో ఏపీ సీఎం ఉన్నారు. లక్ష మందికి ఉపాధి నైపుణ్య శిక్షణ ఇప్పించాలన్న ఉద్దేశం ఆయనది. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా నిలవడానికి బ్రిటిష్ కౌన్సిల్బీసీఈఈఎస్ఐపీఎల్ ముందుకు వచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, స్పోకెన్ ఇంగ్లీష్ స్థాయిని వృద్ధి చేసి రాష్ట్రంలో నైపుణ్యత కలిగిన యువశక్తిని రూపొందించడానికి ఏపీ ప్రభుత్వం, బ్రిటిష్ కౌన్సిల్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఆంగ్ల భాషలో శిక్షణ పొందడం ద్వారా లక్ష మంది ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. వారు ఆధునిక శిక్షణ పద్దతుల ద్వారా ఆంగ్ల భాష అభ్యాసం, సంభాషణా చాతుర్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వీలవుతుంది. 21వ శతాబ్ధపు అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అంతర్జాతీయ స్థాయి పని వాతావరణానికి అలవాటుపడతారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన సర్టిఫికెట్ పొందుతారు. ఈ శిక్షణ ద్వారా ఇక్కడి యువత రాష్ట్రంలో వచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడమేకాక దేశవిదేశాల్లో ఉపాధి పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకే అత్యధిక అవకాశాలు రావాలన్నది ప్రభుత్వం లక్ష్యం. వివిధ రంగాలకు చెందిన పలు పరిశ్రమలకు కావలసిన మానవ వనరులను ఇక్కడే సమకూర్చాలని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఇది దోహదపడుతుంది. మౌలిక సదుపాయాలతోపాటు  నైపుణ్యత గలిగిన మానవవనరులు ఇక్కడే లభిస్తే పారిశ్రామికవేత్తలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఇక్కడి యువతలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అభివృద్ధి చెందితే వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతోపాటు పెట్టుబడులు రావడానికి అవకాశం ఏర్పడుతుంది.


-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...