May 12, 2017

పేదరిక నిర్మూలన సాధ్యమేనా?

 స్థిరమైన అభివృద్ధి కోసం 17 అంశాలకు అత్యంత ప్రాధాన్యత
 రూపుమాపే దిశగా 2030 వరకు ప్రణాళికలు
      జీసీఐలో 20లోపు స్థానమే లక్ష్యం
          రాష్ట్రంలో పేదరికం సమూలంగా నిర్మూలించడం సాధ్యమేనా? అంటే సాధ్యమేనంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని పనులు చేపట్టడంలో ఆయనకు ఆయనే సాటి. హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధికి ఆయన వేసిన పునాదే అందుకు నిదర్శనం. అక్కడ ఐటీ పరిశ్రమ ఏ విధంగా విస్తరించిందో అందరికీ తెలిసిందే.  ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది. ఆ అభివృద్ధి శాశ్వితం. రాష్ట్రం విడిపోయినా ఈ విషయంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలాగే రాష్ట్రంలో మారుమూల గ్రామాలతో సహా పేదరికాన్ని నిర్మూలించడానికి కూడా ఆయన నడుం బిగించారు.  ఇందుకోసం ఓ సుదీర్ఘ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. 2030 నాటికి పేదరికాన్ని సమూలంగా తొలగించేవిధంగా లక్ష్యాలను నిర్ధేశించుకొని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక వృద్ధి, కుటుంబ వికాసం, సమాజ వికాసం, ఇతర సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఆర్థిక వృద్ధి, సామాజిక సమస్యలు, ఆకలి, పేదరికం, గ్రామపంచాయతీ స్థాయి నుంచి అభివృద్ధి, సంక్షేమం, ఆరోగ్యం, విద్య, పర్యావరణ పరిరక్షణ వంటి 17 అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, 169 లక్ష్యాలను ప్రభుత్వం నిర్ధేశించింది.  2017-18 బడ్జెట్ ని కూడా దీనిని దృష్టిలోపెట్టుకొని రూపొందించారు.
          ముందుగా వేసిన అంచనాల ప్రకారం 2016–17 ఆర్థిక సంవత్సరంలో  12.61 శాతం వృద్ధి రేటు సాధించింది. 2014–15లో 8.5 శాతం, 2015–16లో 10.95 శాతం వృద్ధి రేటు నమోదైంది. ఒక దశాబ్ధం పాటు స్థిరమైన రెండంకెల సమ్మిళిత వృద్ధి రేటు 12 నుంచి 19 శాతం నమోదు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2022 నాటికి ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. తలసరి ఆదాయినికి వచ్చేసరికి 2014–15లో రూ.93,699, 2015–16లో రూ.1,07,532, 2016–17లో రూ.1,22,376 ఉంటుందని అంచనా. 2030 నాటికి తలసరి ఆదాయం రూ.9,60,768లకు చేరాలన్నేది లక్ష్యం. మానవాభివృద్ధి సూచిక(హెచ్ డీఎఫ్-హ్యూమన్ డవలప్ మెంట్ ఇండెక్స్) 2015లో 0.67 ఉంది. అది 0.90కి చేరాలన్నది ప్రభుత్వ అంచనా. పేదరిక నిష్పత్తి ప్రాతిపదిక సంవత్సరం 2011-12లో 9.2 ఉంది. దానిని పూర్తిగా నిర్మూలించాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉంది..
          2015-16 లెక్కల ప్రకారం రాష్ట్రంలో 45 లక్షల మందికి సామాజిక భద్రత లభిస్తోంది. దానిని వంద శాతానికి చేర్చాలి. రాష్ట్రంలో హెక్టారుకు 2641 కిలోల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. దానిని 4409 కిలోలకు పెంచాలన్నది లక్ష్యంగా నిర్ధేశించారు. 38 శాతం ఉన్న నీటిపారుదల సౌకర్యాన్ని 57శాతానికి పెంచుతారు. 2015లో శిశుమరణాల రేటు వెయ్యికి 35 ఉంది. దానికి 3కి తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రసూతి మరణాల నిష్పత్తి 2015లో లక్షకు 92 ఉంది. దానిని 16కు తగ్గించాలన్నది లక్ష్యం. 2015లో పిల్లల్లో రోగనిరోధక శక్తి 65.3 శాతం ఉంది. దానికి వంద శాతానికి పెంచాలి. 2015లో పోషకాహార లోపం 31.9 గా ఉంది. వంద శాతం మందికి పోహకాహారం అందేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.
            2011 లెక్కల ప్రకారం అక్షరాస్యత 67.4 శాతం మాత్రమే ఉంది. దానిని వందశాతానికి పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. మహిళల అక్షరాస్యత 60 శాతం మాత్రమే ఉంది. దానిని నూరు శాతానికి పెంచాలి. 2015-16లో సెకండరీ పాఠశాలల వరకు 80.5 శాతంగా ఉన్న జీఈఆర్(గ్రాస్ ఎన్ రోల్ మెంట్ రేషియో-స్థూల నమోదు నిష్పత్తి)ని వంద శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో 0.29 గా ఉన్న జిని కోఎఫిషియంట్( ఒక దేశం లేక ఒక ప్రాంతంలో దుర్భర పేదరికాన్ని విశ్లేషించే ప్రక్రియ) 0.26కి తగ్గించాలన్నది లక్ష్యం. 2015లో నైపుణ్యత గల కార్మికులు కేవలం 5 శాతం మంది మాత్రమే ఉన్నారు. వారిని రెండు కోట్లకు పెంచవలసి ఉంది. ఇందుకోసం నిధులను కూడా పెంచారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 48 శాతం మందికి మాత్రమే సురక్షితమైన తాగునీరు అందుతోంది. దానిని వంద శాతానికి పెంచడానికి ప్రణాళికలు రూపొందించారు. అలాగే పారిశుధ్యాన్నికి ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. 2015-16లో 52.4 శాతం మందికి మాత్రమే మరుగుదొడ్ల సౌకర్యం ఉంది. వంద శాతం మందికి అందుబాటులోకి తీసుకురావడానికి మరుగుదొడ్లు నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రాన్ని త్వరలోనే బహిరంగ మలమూత్ర విసర్జన లేని ప్రాంతంగా ప్రకటించడానికి సీఎం పట్టుదలతో ఉన్నారు. 2015లో 67.4 శాతం ఉన్న ప్రాథమిక సేవలను వంద శాతం పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇ-ప్రగతిలో భాగంగా 2015 నాటికి 329 ప్రభుత్వ సేవలను ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చారు. వంద శాతం ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చురుకుగా పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఫైబర్ గ్రిడ్ పనులు దాదాపు 90 శాతం పూర్తి అయ్యాయి. త్వరలోనే ఇ-ప్రగతి సాధించిన రాష్ట్రంగా ప్రకటించే అవకాశం ఉంది. 2015-16 నాటికి రాష్ట్రంలో విద్యుత్ స్థాపన సామర్ధ్యం 9486 మెగావాట్లుగా ఉంది. దానిని 42 వేల మెగావాట్లకు పెంచాలన్నది లక్ష్యం. ఇళ్ల వినియోగానికి ఇప్పటికే 24 గంటలు వంద శాతం విద్యుత్ సరఫరా అవుతోంది. 2015-16లో రిన్యూవబుల్ ఎనర్జీ(పునరుత్పదక శక్తి) వాటా5.14 శాతం ఉంది. దానిని 30 శాతానికి పెంచాలన్నది ప్రతిపాదన. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను  వంద శాతానికి తీసుకువెళ్లాలన్నది ప్రభుత్వ లక్ష్యం. పర్యావరణ పరిరక్షణలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటి పచ్చదనం నింపే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 2015-16 నాటికి 26 శాతం ఉన్న పచ్చదనాన్ని 50 శాతానికి
పెంచడానికి చర్యలు చేపట్టారు. స్వావలంభన సాధించి, అన్ని రంగాల్లో మహిళలు భాగస్వామ్యం పెరిగే విధంగా ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తోంది. 2015లో 37 శాతంగా ఉన్న వారి భాగస్వామ్యం 50 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అలాగే అన్ని రంగాల్లో రాష్ట్రం అంతర్జాతీయ స్థాయికి ఎదిగేవిధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.  2015 అంతర్జాతీయ పోటీ సూచిక (జీసీఐ-గ్లోబల్ కాంపిటేటివ్ ఇంన్ డెక్స్) ప్రకారం 51వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని మొదటి  20 స్థానాల్లో ఒకటిగా నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆయా రంగాలకు కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు చేసి, రూపొందించిన ప్రణాళికలన్నీ సక్రమంగా, అనుకున్న రీతిలో అమలు జరిగితే  లక్ష్యం మేరకు 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమవుతుంది.
-         శిరందాసు నాగార్జున, డెవలప్ మెంట్ జర్నలిస్ట్ -9440222914







No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...