May 12, 2017

మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలు

మిర్చి ధరల పతనంపై చర్చ   
5వేల చెక్ డ్యాంల నిర్మించాలని నిర్ణయం
మున్సిపాల్టీల్లో ఏపీ ల్యాండ్ డెవలప్ మెంట్ -2017 ముసాయిదా ఆమోదం
తాగునీటికి కొరతలేకుండా పఠిష్టమైన చర్యలు
         
          ఏప్రిల్ 6:  మంత్రివర్గ పునర్యవస్థీకరణ తరువాత సచివాలయంలో గురువారం మొదటిసారిగా జరిగిన మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సమావేశం అనంతరం రాత్రి 7.30 గంటలకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా మిర్చి రైతుల సమస్యలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఈ అంశంపై మంత్రులు తమతమ అభిప్రాయాలు తెలిపినట్లు చెప్పారు. మిర్చి ధర పతనం కావడానికి కారణాలు, ఏం చేస్తే రైతులకు న్యాయం జరుగుతుందో తెలుసుకొని ఒక నివేదిక ఇవ్వవలసిందిగా వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, గుంటూరు జిల్లా మంత్రి పత్తిపాటి పుల్లారావులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. మంత్రులు రైతులతో మాట్లాడి, సమీక్షించి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారని చెప్పారు.  వారి సిఫారసులు అందిన వెంటనే చర్యలు తీసుకోనున్నట్లు సీఎం చెప్పినట్లు తెలిపారు.  మిర్చి రైతుల ప్రస్తుత పరిస్థితిపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

           వేసవి ప్రారంభమైనందున తలెత్తే ప్రధాన సమస్యలపై కూడా చర్చించినట్లు మంత్రి తెలిపారు. తాగునీరు, పశుగ్రాసం, కూలీల కష్టాల తదితర అంశాలపై చర్చించినట్లు వివరించారు. ఈ వేసవిలో 5వేల చెక్ డ్యాంలు నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 45 రోజుల ప్రత్యేక కార్యక్రమం చేపట్టి వర్షాకాలం నాటికి చెరువులు, కుంటల మరమ్మతులు పూర్తి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని ఉపాధి పథకం నిధులను ఉపయోగించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
           హీరో మోటార్స్ కు భూముల కేటాయింపునకు సంబంధించి కొన్ని సవరణలు చేసినట్లు చెప్పారు. ఆ కంపెనీ మొదటి దశలో రూ.800 కోట్ల పెట్టుబడి పెడుతుందని, రెండు, మూడు దశలల్లో మరో రూ.800 కోట్లు పెట్టుబడి పెడుతుందని వివరించారు. ఆ కంపెనీకి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు ఏపీఐఐసీకి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.
నగరాలు, మున్సిపాలిటీలు వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఎదురయ్యే సమస్యలను చర్చించినట్లు చెప్పారు. ముఖ్యంగా లేఅవుట్లు, గృహ నిర్మాణం వంటి విషయంలో ఎదురయ్యే సమస్యలకు సంబంధించి కొన్ని సవరణలను ఆమోదించినట్లు తెలిపారు. స్థలాల దురాక్రమణ, అక్రమకట్టడాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ఏపీ ల్యాండ్ డెవలప్ మెంట్ రూల్స్-2017 ముసాయిదాను ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. అక్రమకట్టడాల విషయంలో కట్టిన తరువాత ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ముందుగానే అధికారులు కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.
వేసవిలో ఉపాధి కూలీల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని  టోల్ ఫ్రీనెంబర్ ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వేసవిలో మంచినీటి సమస్యలపై జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని, పనులను వేగం వంతం చేయాలని మంత్రులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ రాగానే వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకునేవిధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.

కొంతమంది మంత్రులు కొత్తగా బాధ్యతలు స్వీకరించినందున ఆయా విభాగాధిపతులతో కూడా సమావేశమైనట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు, వివిధ అంశాలల్లో ఏ ఏ సంవత్సరానికి ఏ మేరకు లక్ష్యాలు నిర్ణయించారో ఆ మేరకు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో ఆయా విభాగాధిపతులు, మంత్రులు బాధ్యత వహించాలని సీఎం చెప్పినట్లు తెలిపారు.  ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటూ ముందుకు వెళదామని సీఎం చెప్పినట్లు వివరించారు.
రాష్ట్రంలోని గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు ఉన్నట్లు కేంద్రం వద్ద నివేదిక ఉండటంతో మనకు నిధులు రావడంలేదని చెప్పారు. అలాగే రాష్ట్రంలో 5 లక్షల మందే ఇళ్లు లేనివారు ఉన్నట్లు కేంద్రం వద్ద లెక్కలు ఉండటంతో ఆ మేరకు తక్కువ నిధులు మనకు వస్తున్నట్లు తెలిపారు. న్యాయంగా మనకు రావలసిన నిధులు రావడంలేదని చెప్పారు.  వాస్తవానికి రాష్ట్రంలో 28 లక్షల నుంచి 30 లక్షల మంది ఇళ్లు లేనివారు ఉన్నారని, వారందరూ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నట్లు  వివరించారు.
వివిధ శాఖల మంత్రులు తమ పరిధిలోని సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని  సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వ చేపట్టిన ఏడు మిషన్లు, 5 గ్రిడ్లు, 5 ప్రచార అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ మెరుగైన కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్థిక వనరులు, నిధులు సమీకరణ, నిధుల విడుదలకు సంబంధించి అన్ని శాఖలు పది రోజుల్లొ నివేదికలు రూపొందించాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. నీటి సమస్య పరిష్కారానికి వెంటనే తగిన చర్యలు తసుకోవలసిందిగా కూడా సీఎం ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.

జారీ చేసిన వారు: పబ్లిసిటీ సెల్, సచివాలయం సెల్ నెంబర్ : 9949351604


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...