May 12, 2017

దేశానికే ఆదర్శంగా గ్రామాల అభివృద్ధి

గ్రామీణాభివృద్ధి శాఖ వర్క్ షాప్ ప్రారంభంలో మంత్రి లోకేష్
         అమరావతి సచివాలయం :ఏప్రిల్ : 7: రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని మోడల్ గ్రామంగా అభివృద్ధి చేసి, రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శంగా నిలవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులకు పిలుపు ఇచ్చారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లో శుక్రవారం ఉదయం గ్రామీణాభివృద్ధి శాఖ వర్క్ షాప్ ను ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ శాఖ అధికారులతో గ్రామాల అభివృద్ధి, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థలపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇష్టమైన, బాధ్యత గల ఈ శాఖను తనకు అప్పగించారన్నారు. సీఎం ఆకాంక్ష మేరకు వచ్చే రెండేళ్లలో ఉపాధి హామీ పథకం నిధులతో రాష్ట్రంలో 1340 మోడల్ గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. ఇందుకు సీనియర్లు బాధ్యత తీసుకోవాలని,  అధికారులు పూర్తిగా సహకరించాలని కోరారు. తాను కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు గ్రామం దత్తత తీసుకున్నట్లు తెలిపారు.
         పశ్చిమ గోదావరి జిల్లాలోని జగన్నాథపురం, సింగరాజుపాలెం తదితర 11 గ్రామాల్లో పూర్తిగా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్పారు. 70 శాతం ఉపాధి హామీ పథకం నిధులు, 20 శాతం జిల్లా పరిషత్ నిధులు, పది శాతం నిధులు ప్రజల నుంచి సేకరించి ఈ పనులు పూర్తి చేసినట్లు వివరించారు. ప్రజల నుంచి దాదాపు ఏడు కోట్ల రూపాయలు సమకూరినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ గ్రామాల్లో మురుగు వాసన లేదని, దోమలు లేవని అధికారులు మంత్రికి వివరించారు.
             ఒక గ్రామంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు  చేయడానికి పట్టే సమయం, ఖర్చు, ఎదురయ్యే సమస్యల గురించి ప్రతి చిన్న అంశం అధికారులను అడిగి తెలుసుకున్నారు. చివరికి మురుగు నీరు ఎక్కడ కలిపేది, పొల్యూషన్ సమస్య తలెత్తకుండా తీసుకునే చర్యలు తదితర విషయాలకు సంబంధించి మంత్రి అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు సవివరంగా సమాధానాలు చెప్పారు.
          ఒక్కో గ్రామానికి ఆరు నెలల సమయం పడుతుందని, కిలో మీటర్ కు రూ.15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, గ్రామాల్లో నైపుణ్యత గల ప్లంబర్ వర్కర్లు వంటి వారు దొరకడం కష్టమని అధికారులు వివరించారు. టెండర్లు పిలిస్తే ఎక్కువ సమయం 6 నుంచి 8 నెలలు పడుతుందని చెప్పారు. ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టే పనులు అయినందున వీటికి టెండర్లు పిలవకుండా చేపడతారు. అందువల్ల 3 నుంచి 4 నెలల్లో పూర్తి అయ్యే అవకాశం ఉందని ఒక అధికారి వివరించారు.

         ఆ సమయాన్ని తగ్గించే మార్గాలను మనం వెతకాలని మంత్రి అన్నారు.  ఒక గ్రామంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సర్వే మొదలు పూర్తి అయ్యేంతవరకు ఏ పనికి ఎంత సమయం పడుతుందో పది రోజుల్లో ఒక నివేదిక ఇవ్వమని అధికారులను కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యత లోపించకుండా ప్రయోగాలు చేసి తక్కువ సమయంలో పూర్తి చేయాలని మంత్రి సలహా ఇచ్చారు.


జారీ చేసిన వారు: పబ్లిసిటీ సెల్, సచివాలయం, సెల్ నెంబర్ : 9949351604



No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...