Feb 9, 2018

పార్టీలకు అతీతంగా పోరాటం శుభపరిణామం


Ø సత్తా చాటిన ఆంధ్రులు
Ø లోక్ సభలో విశ్వరూపం చూపించిన గల్లా జయదేవ్

      వచ్చే ఏడాదికి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిధుల కేటాయింపుల్లో  ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేయడంతో ఒక్క బీజేపీ వారు తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఇక్కడ రోడ్డెక్కి తమ నిరసన గళం వినిపించారు. ఎంపీలు అక్కడ పార్లమెంటులోనూ తమ సత్తా చాటారు. ఆంధ్రులందరూ  కలసి రాజకీయాలకు అతీతంగా రాష్ట్రం కోసం  ఈ విధంగా ఆందోళన చేయడం చాలా శుభ పరిణామం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అందరూ ఆరోగ్యకరమైన వాతావరణంలో పోరాటం చేయడం వల్ల రాష్ట్రానికి మేలు జరిగే అవకాశం ఉంది. కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది.  కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా ఏపీకి అన్యాయం చేస్తోందన్న భావన ప్రజల్లో ఉంది. దానికితోడు తాజా బడ్జెట్‌ కేటాయింపుల్లో మొండిచేయి చూపడంతో రాష్ట్రంలోని ప్రజలే కాకుండే దేశవిదేశాల్లో ఉన్న వారు కూడా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ లో రాష్ట్ర రెవెన్యూ లోటునూతన రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, రైల్వేజోన్ వంటి  ముఖ్య అంశాల ప్రస్తావన లేకపోవడంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నేతలతోపాటు ప్రజలందరూ మండిపడుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలను తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.  ఈ నెల 8వ తేదీ గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌, వామపక్షాలు విజయవంతంగా బంద్‌ నిర్వహించాయి. విపక్ష వైసీపీ కూడా మద్దతు ఇచ్చింది. వారి నాయకులు, కార్యకర్తలు కూడా బంద్ లో పాల్గొన్నారుపవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ  కూడా ఇందుకు మద్దతు పలికింది. అంతేకాకుండా  తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలియచేయాలని పిలుపు ఇచ్చింది. ఏపీ ప్రజల ఆగ్రహావేశాలు, అభిప్రాయాలు కేంద్రానికి తెలియాలనే ఉద్దేశంతో ఈ బంద్‌కు టీడీపీ అనధికారికంగా మద్దతు పలికినట్లుగా భావిస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులపై ఢిల్లీలో పోరాడాలని, తమతో అక్కడ కలసిరావాలని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు మాట్లాడినప్పటికీ బంద్ విషయంలో మెతకవైఖరి అవలంభించడమేకాక వారు నేరుగా బంద్‌కు మద్దతు ఇవ్వకుండా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యాశాఖ ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించింది. సమస్య తీవ్రత దృష్ట్యా, రాష్ట్రాభివృద్ధిని దృష్టిలోపెట్టుకొని తెలుగుదేశం పార్టీ కూడా కేవలం పార్లమెంటులోనే ఈ ప్రజాందోళనలో కూడా పాలుపంచుకోవడం మంచిపనిగా భావిస్తున్నారు. రాష్ట్ర విభజన హామీలు  అమలు చేయాలని టీడీపీ, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద వేరువేరుగా ఆందోళనలు చేశారుఫ్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలన్నారు.  విభజన హామీలను కేంద్రం అమలు చేయడం లేదని విరుచుకుపడ్డారు.  రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ఏమేమి చేయాలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టంగా పేర్కొన్నారని, ప్రభుత్వం మారిన తర్వాత విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వంపై ఉందన్నారు. విభజన హామీలను అమలుచేయాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.
        రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్టీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికి పార్లమెంటులోనూ బయట తమ గళం వినిపించి తీవ్రస్థాయిలోనే  నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో అనేక విధాల వినూత్న రీతిలో నిరసన తెలిపారుప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ సీపీ ఎంపీలకు ధీటుగా తమ ఆగ్రహాహావేశాలను, ఆవేదనను వెళ్లగక్కారు. శివప్రసాద్ తనదైన శైలిలో, నిమ్మల కిష్టప్ప ఢమరుకం మోగిస్తూ నిరసన తెలిపారు. మరి ముఖ్యంగా గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ పార్లమెంటులో ప్రసంగం అమోఘం. లోక్ సభలో ఆయన 14 నిమిషాలు ఇంగ్లీషులో అనర్ఘళంగా మాట్లాడి  విశ్వరూపం చూపించారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చితీరాలని డిమాండ్ చేశారు. అందర్నీ, అన్ని సార్లూ మోసం చేయలేరు, ఆంధ్రులు ఫూల్స్‌ కాదని మీరు తెలుసుకోవాలి, విభజన చట్టంలోని 19 అంశాల్లో ఒక్కటీ అమలు కాలేదు, మీరిచ్చిన నిధులకన్నా బాహుబలి సినిమా కలెక్షన్స్‌ ఎక్కువగా ఉన్నాయని బయట ప్రజలు జోకులు వేసుకుంటున్నారు, ఏపీలో కాంగ్రెస్‌ గతే కోరుకుంటున్నారా?, ఇప్పుడు ఎన్నికలు లేవనే ఏపీకి నిధులివ్వలేదా?, హామీలపై ప్రధాని, ఆర్థిక మంత్రి  దీనిపై సమగ్ర వివరణ ఇవ్వాలని, లేకపోతే.. మీరు దురుద్దేశంతో ఉన్నట్లే భావించి, మీతో బంధంపై  ఆలోచించక తప్పదని కడిగిపారేశారు. ఓ మిత్రపక్ష ఎంపీ రాష్ట్రం కోసం ఇంత నిజాయితీగా లోక్ సభలో గళం విప్పడం సామాన్య విషయం కాదు. ఆయన ప్రసంగం అటు బీజేపీవారిని, ఇటు ఇతర పార్టీల వారిని, ప్రజలను ఆలోచింపజేసింది. ఎంపీగా ఆయన పార్లమెంటు వేదికను సమర్థవంతంగా వినియోగించుకున్నారు. ఇటువంటి ఎంపీలను అందరూ అభినందించాలి.


-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...