Feb 5, 2018

ప్రభుత్వంవైపు ఆశగా చూస్తున్న హోం గార్డులు

        


  పోలీసులతో సమానంగా శాంతిభద్రతల విధులు నిర్వహిస్తూ కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్రంలోని హోం గార్డులు తమ జీతాలు పెరిగే సమయం వచ్చేసిందని ఆశగా ఎదరు చూస్తున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలతోపాటు తెలుగు రాష్ట్రం తెలంగాణ కూడా దేశ అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాలను అమలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. పోలీసులతో సమానంగా బందోబస్తులో పాల్గొంటున్నా వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సదుపాయాలు లేవు. ఉద్యోగ భద్రతలేదు   ఆరోగ్యబీమా లేదు. కనీస వేతనాలు అందడంలేదు. ఎటుంటి అలవెన్సులూ లేవు. అయితే వారికి పని చేస్తారన్న గుర్తింపు మాత్రం ఉంది. ఆ గుర్తింపేతోనే తమకు  మంచి జరుగుతుందని భావిస్తున్నారు. పోలీసులకు సహాయపడేందుకు 1963లో హోం గార్డ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి వీరు కూడా పోలీసులతో సమానంగా ఎండనకవాననక రోడ్లపై బందోబస్తు, కార్యాలయాల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, రాత్రి వేళల్లో గస్తీ వంటి అన్ని పనులను చేస్తూనే ఉన్నారు. ఇక రాష్ట్రపతి నుంచి ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, మంత్రుల వరకు వారి పర్యటనల సమయంలో, పండుగలు, ఉత్సవాలు, అన్ని మతాల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భారీ బహిరంగసభలు, సమ్మెలు, ఆందోళనల సందర్భంగా రోజుల తరబడి విధులు నిర్వహిస్తున్నారుఅంతేకాకుండా ఎస్పీ, డిఎస్పీ, సర్కిల్ పోలీస్ కార్యాలయాల్లో సేవలందిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు.  అనేక సందర్భాల్లో వీరికి భోజనం కూడా అందుబాటులో ఉండదు. అయినా విధులు నిర్వహిస్తూనే ఉంటారు. విధుల నిర్వహణలో పోలీసుల పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంటుంది. అయితే వారికి జీతం, ఇతర అలవెన్సులు, సౌకర్యాలు ఉంటాయి. హోం గార్డులకు ఏ రకమైన అలవెన్సులు, సౌకర్యాలు లేవు. బందోబస్తు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినా బస్ ఛార్జీలు కూడా ఇవ్వరు.

దేశంలో హోంగార్డుల పరిస్థితిని తెలుసుకున్న సుప్రీం కోర్టు 2015 మార్చి 11, ఆ తరువాత 2016 మేలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం జీతం బేసిక్ రూ.16,400, డియర్ నెస్ అలవెన్స్(డీఏ) రూ.2950, ఇంటి అద్దె అలవెన్స్(హెచ్ఆర్ఏ) రూ.2000, వాషింగ్ అలవెన్స్ రూ.100 మొత్తం 21,450 చెల్లించాలని ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం హోం గార్డులకు జీతాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ హోంగార్డ్ డీజీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు గత ఏడాది  లేఖలు రాశారుదాంతో  కొన్ని  రాష్ట్రాలలో వేతనాలు పెంచారు. అలాగే పోలీసులకు మాదిరిగా ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం హోం గార్డులకు జీతాలు పెంచాలని గత ఏడాది నవంబర్ లో ఒడిషాలో హోం గార్డ్ కమాండెంట్ జనరల్ ప్రభుత్వానికి లేఖ రాశారు. హోం గార్డులకు డెయిలీ డ్యూటీ అలవెన్స్ రూ.675 గా నెలకు జీతం 20,250కి పెంచుతూ జనవరి 31న తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందిఅంతే కాకుండా ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయల జీతం పెంపుట్రాఫిక్ విధులు నిర్వహించేవారికి కాలుష్య ప్రమాద అలవెన్స్ కింద పోలీస్ కానిస్టేబుల్స్ కు ఇచ్చే మాదిరిగా 30 గౌరవవేతనం ఇస్తారు. మహిళా హోం గార్డులకు మహిళా పోలీసులకు మాదిరిగా ఇద్దరు పిల్లల వరకు ఆరు నెలల ప్రసూతి సెలవులు, పురుష హోం గార్డులకు పోలీసులకు మాదిరిగా 15 రోజులు పితృత్వపు సెలవులు ఇస్తారు. అంతేకాకుండా హోంగార్డులకు రెండు పడక గదుల ఇళ్లు నిర్మాణం, ఆరోగ్యబీమా సదుపాయం కల్పిస్తూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు
            ఏపీలో దాదాపు 15,363 మంది హోం గార్డులు ఉన్నారు. వారిలో 12,163 మంది శాంతిభద్రతల విభాగంలో, 3,200 మంది విజిలెన్స్, అగ్నిమాపక విభాగం, ఆర్టీసీ, పురావస్తు, దేవాలయాలు తదితర విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు.  ఈ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి వీరు అరకొర కూలీతోనే పని చేస్తూ అనేక ఇబ్బందులు పడుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. 2013 డిసెంబర్ వరకు వీరికి రోజుకు రూ.200 ఇచ్చేవారు. 2014 జనవరి నుంచి దానిని రూ.300కు పెంచారు. 2016 ఏప్రిల్ 1 నుంచి రూ.400లకు పెంచారు. వాషింగ్ అలవెన్స్ ని రూ.1000 నుంచి రూ.1500లకు పెంచారు. ప్రస్తుతం నెలకు రూ.12 వేలతో  విధులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం బాగోక గానీ, అత్యవసర పని ఉండి ఒక్క రోజు రాకపోయినా జీతం కట్ చేస్తారు. ఇంత దయనీయంగా వీరు బతుకుతున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం వేతనంపోలీసులుగా గుర్తింపు, ఉద్యోగ భద్రత, కుటుంబం మొత్తానికి ఆరోగ్యబీమా, పోలీస్ కానిస్టేబుల్ తో సమానంగా యూనిఫాం అలవెన్స్, బందోబస్తు సమయంలో వేతనంతోపాటు కరువుభత్యం, టీఏ, డీఏ, మరణానంతరం అంత్యక్రియ ఖర్చు రూ.15 వేలు, పోలీస్ కానిస్టేబుల్ ఎంపికలో హోం గార్డులకు 25 శాతం రిజర్వేషన్, వేతనంతో కూడిన సెలవులు, మహిళా హోం గార్డులకు ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగా ప్రసూతి సెలవులు, పిల్లల చదువులకు ఫీజు మాఫీ, పక్కా గృహాలు, పదవీ విరమణ చేసిన హోం గార్డుకు రూ.5 లక్షలు, చనిపోయిన హోంగార్డు కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తింపు,   5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన హోం గార్డుని కానిస్టేబుల్ శిక్షణకు పంపడం వంటివి వారు  కోరుతున్నారు.  ఈ నేపధ్యంలో దేశంలోని పలు ఇతర రాష్ట్రాలతోపాటు తెలంగాణలో కూడా హోంగార్డుల వేతనం పెంచడంతో ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. హోంగార్డుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని  గతంలో కూడా వారి జీతాల పెంపు అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో  చర్చించారు.  తెలంగాణ ప్రభుత్వం జీఓ జారీ చేయడంతో ఇక్కడి హోం గార్డులు  తమకు సానుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.  వారి ఆశలు ఫలించాలని ఆశిద్ధాం.
-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...