Feb 15, 2018

చాణుక్యుడు లాంటి బాబుకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసు


మంత్రులు సోమిరెడ్డి, అచ్చన్నాయుడు, ఆనందబాబు
అమరావతి, ఫిబ్రవరి 14: రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ అమలు చేయడంలో కేంద్రం తత్సారం చేస్తున్నందున చాణుక్యుడు లాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, కింజరాపు అచ్చన్నాయుడు, నక్కా ఆనందబాబు పేర్కొన్నారు. సచివాలయం 1వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం వారు మీడియాతో మాట్లాడారు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసి రాష్ట్రానికి న్యాయం చేస్తుందని తమకు ఇప్పటికీ నమ్మకం ఉందని, ఒకవేళ ఇంకా ఆలస్యం చేస్తే అప్పుడు సీఎం నిర్ణయం తీసుకుంటారన్నారు. ఏం చేయాలో అది చేస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ ఢిల్లీలో పోరాటం చేస్తోందన్నారు. సీఎం ఇప్పటికి 29 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాన మంత్రిని, కేంద్ర మంత్రులను కలిసి పరిస్థితిని వివరిస్తూనే ఉన్నారని చెప్పారు. మరో పక్క తమ మంత్రులు, ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేస్తున్న విషయం ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. ప్రత్యేక హోదాకు సమానంగా 5 ఏళ్లపాటు ప్రయోజనాలు, రాయితీలు ఇస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారని, ప్రత్యేక హోదాను త్యాగం చేయలేదని, ఇస్తామన్న ప్యాకేజీని అమలు చేయమేని డిమాండ్ చేస్తున్నామన్నారు.
 ప్రతి పక్షనేతగా వైఎస్ జగన్మోహన రెడ్డి బడ్జెట్ పై ఒక్క మాట కూడా మాట్లాడలేదని, వాళ్ల ఎంపీలు మాత్రం బడ్జెట్ బాగుందని చెప్పారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీల రాజీనామా అనేది ఓ డ్రామా అని, ఇంతకు ముందు ఎన్నిసార్లు చెప్పారు, 2016లో రాజీనామా చేస్తామన్నారు, ఆ తరువాత 2017, 2018 బడ్జెట్లు ప్రవేశపెట్టారు.  చేశారా అని ప్రశ్నించారు.  రాజీనామాలు చేయాలంటే ధైర్యం ఉండాలి. ఏడాది ముందు చేస్తే మళ్లీ ఎన్నికలు రావు, అందువల్ల ఏప్రిల్ తరువాత అంటున్నారు, అమోఘమైన తెలివితేటలు అని విమర్శించారు.  లోక్ సభ జరిగేటప్పుడు రాజీనామాలు చేయకుండా, ఏప్రిల్ 6 తరువాత లోక్ సభ సమావేశాలు జరగనప్పుడు రాజీనామాలు చేయడం అర్ధమేమిటని అడిగారు. జగన్మోహన రెడ్డి నిర్దోషేమీ కాదని, 14 నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై వచ్చారన్నారు. ఆయనపైనే కేసులు ఉన్నాయని, ప్రధాని మోడీకి భయపడవలసిన అవసరం తమనేత చంద్రబాబుకు లేదన్నారు. ఆయనపై ఏవిధమైన కేసులు లేవని చెప్పారు. బెయిల్ కోసం సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్నారని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో అభ్యర్థులను ప్రకటించక ముందే, వారు కోరకుండానే  మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారని విమర్శించారు. ఆ పార్టీకిగానీ, నాయకునిగా జగన్మోహన రెడ్డి గానీ గుర్తింపులేదన్నారు. వాళ్ల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
మిత్రపక్షంగా తామే పార్లమెంటులో ఆందోళన చేస్తున్నామని చెప్పారు. ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే టీడీపీ పోరాడుతోందన్నారు. తమ తీరుని చూసి జగన్మోహన రెడ్డి భయంతో పాత నాటకానికి తెరతీశారని విమర్శించారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు క్విట్ ప్రోకో ద్వారా రాష్ట్రాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. ఏ1 ముద్దాయి రోడ్డుమీద ముద్దులు పెడుతుంటే, ఏ2 ముద్దాయి ఢిల్లీలో ఉన్నారన్నారు. ప్రత్యేక హోదా కోసం గానీ, ప్యాకేజీ కోసం గానీ జగన్మోహన రెడ్డి ఢిల్లీలో ఏమైనా చేశారా? అని ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము పార్లమెంటును ఉపయోగించుకుంటున్నామని, ఆయన శాసనసభ సమావేశాలకు రాకుండా రోడ్డుమీద ముద్దులుపెట్టుకుంటూ పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రం కోసం మంత్రి సుజనా చౌదరి మాట్లాడితే అతనిపై పీఎంకు ఫిర్యాదు చేయడమేమిటని ప్రశ్నించారు.
తమకు మంత్రి పదవులు ముఖ్యంకాదని, గతంలో తమ పార్టీ నుంచి 29 మంది ఎంపీలు గెలిచినప్పుడు అప్పటి ప్రధాని  వాజ్ పాయ్ మంత్రి పదవులు ఇస్తామంటే తిరస్కరించిన విషయం గుర్తు చేశారు. జగన్మోహన రెడ్డికి ప్రతిపక్షం పాత్ర పోషించే దమ్ములేదన్నారు. రాష్ట్రంలో అధికార పక్షం తామే, ప్రతిపక్షం తామేనన్నారు. దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా తలసరి ఆదాయం వచ్చే వరకు సహాయం చేయమని కోరుతున్నామని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని తెగేసి చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...