Feb 27, 2018

రాష్ట్రంలో దివ్యాంగులకు సంక్షేమ చర్యలు చేపట్టాలి



దివ్యాంగుల జాతీయ చీఫ్ కమిషనర్ కమలేష్ కుమార్ పాండే
              సచివాలయం, ఫిబ్రవరి 27: రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమ కోసం పలు  చర్యలు చేపట్టవలసి ఉందని దివ్యాంగుల జాతీయ కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ కమలేష్ కుమార్ పాండే అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దివ్యాంగుల పథకాలు అమలు తీరుని సమీక్షించేందుకు ఇక్కడికి వచ్చామని, అయితే విశాఖలో భాగస్వామ్య సదస్సుకు వెళ్లడం వల్ల అధికారులు ఎక్కవమంది సమావేశానికి హాజరుకాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సారి మళ్లీ వస్తానన, సీఎం, సీఎస్, ఇతర అధికారులను కలసి మాట్లాడాతానని చెప్పారు.  దేశంలో దివ్యాంగుల కోసం 1983లో మొట్టమొదటిసారిగా  ప్రత్యేక శాఖ ఏర్పాటు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ దే నన్నారు. అయితే ప్రస్తుతం దీనికి పూర్తి స్థాయి కమిషనర్ ని, ఇతర సిబ్బందిని నియమించి, వాహనం వంటి ఇతర సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉందన్నారు. దేశంలో 2.6 కోట్ల మంది దివ్యాంగులు ఉన్నారని, వారి సంక్షేమం, వారి హక్కుల కోసం జాతీయ కమిషన్, రాష్ట్ర శాఖలు పని చేస్తుంటాయన్నారు. దివ్యాంగుల అంశం రాష్ట్రాలకు చెందిన అంశమని, కేంద్రం నమూనాగా కొన్ని అంశాలను అమలు చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు 10 లక్షల  సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. భవిష్యత్ లో ఈ సర్టిఫికెట్లను ఆన్ లైన్ లో జారీ చేస్తామన్నారు. రాష్ట్రంలో దివ్యాంగులకు సంబంధించిన స్వచ్ఛంద సంస్థలకు కేంద్రమే రూ.6 కోట్లు మంజూరు చేసిందని, రాష్ట్రం కూడా మంజూరు చేస్తే బాగుంటుందని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఆ విధంగా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
దివ్యాంగుల చీఫ్ కమిషనర్ కార్యాలయంలో 1998 సెప్టెంబర్ నుంచి 2018 జనవరి వరకు 35,417 ఫిర్యాదులు నమోదు కాగా, వాటిలో 33,636  పరిష్కరించినట్లు వివరించారు. ఒక్క జనవరిలో 162 ఫిర్యాదులు రాగా, 110 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. వికలాంగులకు ప్రత్యేక గుర్తింపు కార్డు (యుడిఐడి) పథకం కేంద్రం ప్రవేశపెట్టిందని, ఈ పథకం కింద కొంతమందికి శిక్షణ ఇస్తారని, నిధులను కూడా కేంద్రం విడుదల చేస్తుందని చెప్పారు. దీనికి రాష్ట్ర కోఆర్డినేటర్ ని నియమించవలసి ఉందని చెప్పారు.
చిన్న పిల్లల్లో వినికిడి సమస్య పరిష్కారానికి కాక్లియా అమరిక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, మరికొన్ని రాష్ట్రాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఒక్కో కాక్లియా అమరికకు రూ.6 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. అటువంటి పథకం రాష్ట్రంలో కూడా ప్రవేశపెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. రాష్ట్రంలోని ఏదైనా విశ్వవిద్యాలయంలో దివ్యాంగులకు సంబంధించిన ఒక శాఖ ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగులైన పిల్లలను సాధారణ పాఠశాలలో చేర్చుకోవడానికి నిరాకరిస్తే, దానిని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారని హెచ్చరించారు. దివ్యాంగులకు సంక్షేమ పథకాల అమలులో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పని చేసే దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడానికి తాము ముందుంటామని చెప్పారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడానికి ఆయా రాష్ట్రాల కమిషనర్లతో కలసి జాతీయ చీఫ్ కమిషనర్ మొబైల్ కోర్టులు నిర్వహిస్తుంటారని తెలిపారు. ఏపీతో సహా 22 రాష్ట్రాల్లో 40 మొబైల్ కోర్టులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగులు 8,80,800 మందికి సహాయం, వివిధ ఉపకరణాలు పంపిణీ చేయడం కోసం కేంద్రం రూ.550 కోట్లు ఖర్చు చేసి 5500 క్యాంపులు నిర్వహించినట్లు వివరించారు. దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్రం ఇప్పటి వరకు 44వేల మందికి శిక్షణ ఇప్పించిందని, ఈ ఏడాది చివరకు 5 లక్షల మందికి, 2022 నాటికి 25 లక్షల మందికి శిక్షణ ఇప్పించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కేంద్రం 46 వేల ప్రీ-మెట్రిక్, 30 వేల మెట్రిక్, విదేశాల్లో పరిశోధన కోసం 200 స్కాలర్ షిప్ లు ఇస్తున్నట్లు చెప్పారు. 2017 ఏప్రిల్ 19 నుంచి అమలులోకి వచ్చిన దివ్యాంగుల చట్టం-2016 ప్రకారం 3 శాతం ఉన్న రిజర్వేషన్ ని 4 శాతానికి పెంచారని,  అలాగే ఈ చట్టం ద్వారా వారికి అనేక సౌకర్యాలు, రాయితీలు కల్పించారని వివరించారు. దివ్యాంగులు తమ సమస్యలను సీసీపీడి ఎట్ ఎన్ఐసీ.ఇన్(ccpd@nic.in) ద్వారా చీఫ్ కమిషనర్ కు పంపవచ్చునని కమలేష్ కుమార్ పాండే చెప్పారు. ఈ సమావేశంలో జాతీయ డిప్యూటీ చీఫ్ కమిషనర్ రాకేష్ కుమార్ రావు, దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కమిషనర్ కెఆర్ బీహెచ్ఎన్ చక్రవర్తి, డిప్యూటీ డైరెక్టర్ ఎంఏ కుమార్ రాజా పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...