Feb 16, 2018

చివరి త్రైమాసికంలోనే అదనపు బడ్జెట్


ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు
          సచివాలయం, ఫిబ్రవరి 16: ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అదనపు బడ్జెట్ అడగవద్దని, ముఖ్యమైన ప్రాజెక్టులు ఏమైనా ఉంటే బడ్జెట్ లోనే పెట్టుకోవాలని, అదనపు బడ్జెట్ కావాలంటే చివరి త్రైమాసికంలోనే ఇస్తామని ఆర్థిక మంత్రి యనమ రామకృష్ణుడు అధికారులకు స్పష్టం చేశారు. సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తులోని సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రి సమీక్షించారు. ఆయా శాఖలకు కేటాయించిన నిధులను అవసరాన్ని బట్టి ఇతర పథకాలు, ప్రాజెక్టులకు వినియోగించుకునే వెసులుబాటు ఇచ్చామన్నారు. అయితే స్థిరాస్తులకు కేటాయించిన నిధులను రెవెన్యూ ఖర్చులకు మళ్లించకూడదని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో స్థిరాస్థి ఖర్చులు పెంచుతామని చెప్పారు.   కేటాయించిన నిధులు ఖర్చు చేసిన తరువాత మాత్రమే అదనపు నిధులు అడగాలన్నారు. ప్రతి శాఖ  ముఖ్యమంత్రి హామీలను, ఇంటింటికి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు సంబంధించిన పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలని, అందుకు అవసరమైన నిధులను ఇస్తామని చెప్పారు. ఈ పనులు పంచాయతీరాజ్ శాఖలో ఎక్కువగా ఉంటాయని, ఇది చాలా ముఖ్యమైన శాఖని పేర్కొన్నారు. రోడ్లు, త్రాగునీరు, భూగర్బ మురుగునీటిపారుదల పనులను పూర్తి చేయాలని చెప్పారు. పంచాయతీలు, మున్సిపాలిటీలలో  అప్పటికి ఉన్న జనాభా ప్రాతిపదికన నీటి పథకాలను రూపొందిస్తారని, జనాభా పెరిగిన తరువాత ఆ పథకాలు సరిపోవన్నారు. అవి పాతబడిపోయి ప్రస్తుత అవసరాలను తీర్చలేవని చెప్పారు.  అందువల్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలోపెట్టుకొని పథకాలను చేపట్టాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే పథకాలకు నిష్పత్తి ప్రకారం ఎంత ఖర్చయినా నిధులు విడుదల చేస్తామని చెప్పారు. మానవాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గ్రామీణుల ఆరోగ్యం మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ  అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో వైద్యులు అందుబాటులో ఉంచే ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్ పోస్టులను త్వరగా భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు.
          గ్రామ పంచాయతీలలో 80 శాతం సిసి రోడ్లు పూర్తి అయినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యునికేషన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇందుకు రూ.430 కోట్లు ఖర్చయినట్లు తెలిపారు.  రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి ఆలోచనన్నారు. నివాస ప్రాంతాలకు మెటల్ రోడ్లు వేసినట్లు తెలిపారు. నీటి పథకాలను భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకొని 25 ఏళ్ల వరకు పెరిగే జనాభా అవసరాలను దృష్టిలోపెట్టుకొని రూపొందిస్తున్నాట్లు వివరించారు. ఐటీ విభాగంలో వచ్చే ఏడాది కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నామని, అలాగే జీఎస్టీ, విద్యుత్, ఉత్పత్తి ఇన్సెంటివ్స్  వంటి  రాయితీలు ఇవ్వవలసి ఉన్నందున అదనపు నిధులు కేటాయించాలని మంత్రి కోరారు. ఫాన్స్ కాన్ వంటి అయిదు అంతర్జాతీయ సంస్థలు రానున్నట్లు తెలిపారు. తిరుపతిలో ఐటీ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని లోకేష్ చెప్పారు. వైద్య ఆరోగ్య సేవలు ప్రజలందరికీ అందుబాటులో ఉన్నట్లు ఆ శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. తాము చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా ఖరీఫ్ లో కోటి ఎకరాలకు నీరందించినట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. రాయలసీమకు 160 టీఎంసీలు, కొత్త ఆయకట్టు 70 వేల ఎకరాలకు 40 టీఎంసీల నీరుల నీరందించినట్లు వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా రబీపంట వేశారని తెలిపారు. చెరువులు కూడా నింపినట్లు మంత్రి చెప్పారు.
          ఎన్టీఆర్ సుజల పథకానికి, లెడ్ బల్బులకు నిధులు పెంచమని పంచాతీరాజ్ శాఖ అధికారులు కోరారు. వచ్చే నవంబర్ నాటికి రాష్ట్రంలోని వీధి బల్బులు అన్నీ ఆన్ లైన్ కు ఎక్కుతాయని, అలాగే విద్యుత్ కనెక్షన్లు కూడా కంప్యూటరైజేషన్ అయిపోతాయని, మాన్యువల్ ఏమీ ఉండదని వివరించారు. ఎండీఓల వాహనాలకు నిధులు ఇవ్వాలని కోరారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 25వేల బోర్లకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్  పాలసీలతోపాటు సైబర్, డీటీపీ వంటి కొత్త పాలసీలు ప్రకటించామని, -ప్రగతి, స్టార్ట్ అప్ కంపెనీలు, మౌలిక వసతులు, సబ్సిడీలు తదితరాలకు అవసరం ఉన్నందున తమ శాఖకు  ఎక్కువ నిధులు కేటాయించాలని  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యునికేషన్స్ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ కోరారు. మేజర్ కంపెనీలు అనేకం వస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ప్రత్యక్షంగా 42 మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. వచ్చే ఏడాది కోటి మందికి డిజిటల్ లిటరేచర్ పై అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.  ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయడం దేశంలో మన రాష్ట్రం 4వ ర్యాంకులో ఉన్నట్లు  వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కూడా 24 గంటలు వైద్య సేవలతోపాటు బైక్ అంబులెన్స్ కూడా అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ఐటిడీఏ అధికారులు ప్రతివారం తనిఖీలు చేస్తుంటారని చెప్పారు. డయాలసిస్ కేంద్రాలు మరో 14 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అవుట్ పేషెంట్ల సంఖ్య పెరిగిందని, మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో సహజ ప్రసవాలు బాగా పెరిగాయన్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యసేవలను నీతిఅయోగ్ కూడా ప్రశంసించినట్లు చెప్పారు. డాక్టర్ పోస్టుల భర్తీకి డాక్టర్లు ఎవరూ ముందుకు రావడంలేదని తెలిపారు. ప్రస్తుతం పోస్టుల భర్తీ బాధ్యత ఏపీపీఎస్సీకి అప్పగించాలని చెప్పారు. నిధుల మంజూరు, బిల్లుల చెల్లింపుల  విషయంలో ఆర్థిక సహకరించాలని ఆమె కోరారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావలసిన నిధులు, నరేగా, ఇతర కేంద్ర ప్రభుత్వ నిధులు, నాబార్డ్ రుణాలు, వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్, బీమా, 104 ఉద్యోగుల జీతాలు, మహాప్రస్థానం పథకం, తెలుగు గంగ తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయి.
          ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శులు కెవివి సత్యనారాయణహేమా మునివెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...