Feb 16, 2018

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు

          
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు అసలుసిసలు బ్రాండ్ అంబాసిడర్ లా వ్యవహరిస్తున్నారు. ఆయన విదేశీ పర్యటలన్నీ విజయవంతమవుతున్నాయి. మంచి ఫలితాలనిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, రాజధాని అమరావతి పేర్లు దశదిశలా మారుమ్రోగుతున్నాయి. ఓ రాజకీయవేత్తగా, ప్రజాప్రతినిధిగా, సీఎంగా  కంప్యూటర్, సమాచార టెక్నాలజీలో ఆయన పరిజ్ఞానం అమోఘం. ముందు చూపుతో ఆయన చేసే ప్రతి ఆలోచన, వేసే ప్రతి అడుగు భావితరాలకు బంగారు బాట వేస్తుంది. రాజకీయవేత్తగా ఆయనకున్న విషయ పరిజ్ఞానానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ సంస్థల సీఈఓలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇటీవల జరిపిన దక్షిణ కొరియా, లండన్, దావోస్ పర్యటనలతోపాటు ఈ నెల 8న జరిపిన దుబాయ్ పర్యటన కూడా విజయవంతమయింది. పరిపాలనలో ఆయన సమర్థత, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అభివృద్ది చూసి పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ పర్యటనలో ఆయన అనేకమందిత దిగ్గజ సంస్థల అధినేతలను, పలువురు ప్రముఖులను కలుసుకున్నారు. సీఎం సమక్షంలో పలు ఎంఓయులు జరిగాయి. ఉక్రేయిన్, మరికొన్ని ఇతర దేశాలలో పెద్దఎత్తున భూకమతాలు కలిగివున్నఫీనిక్స్ గ్రూపు ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ గౌరవ్ థావన్, గ్రూపు ఫైనాన్స్ కంట్రోలర్ నితిన్ నావన్ థీర్ తో సీఎం సమావేశమయ్యారు. ఏపీలో వ్యవసాయరంగంలో అనుసరిస్తున్న వినూత్న విధానాల గురించి వారికి వివరించారు. ఏపీలో భారీ రైస్ మిల్లు, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని గతంలో మాటిచ్చిన ప్రకారం ఏప్రిల్ నుంచి  ప్లాంట్ పనులు ప్రారంభించనున్నట్లు వారు సీఎంకు చెప్పారు. ఉక్రేయిన్‌లో అమెరికాకు చెందిన కొన్ని సంస్థల సహకారంతో ఫీనిక్స్ నెలకొల్పుతున్న ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుందని, దీని తరువాత భారత్ మార్కెట్‌పై దృష్టి సారిస్తామన్నారు. తమ రాష్ట్రంలోని అనంతపురము ప్రాంతంలో వేరుశెనగ సాగు చేపట్టేందుకు గల అవకాశాలు పరిశీలించాలని, వేరుశెనగ నుంచి బటర్ తయారు చేసే కర్మాగారాన్ని నెలకొల్పాలని సీఎం వారికి సూచించారు. షరాఫ్ గ్రూప్ వైస్ చైర్మన్ షరాఫుద్దీన్ మొహమ్మద్ హుస్సేన్ షరాఫ్ ఆధ్వర్యంలో ఆ గ్రూప్ ఎగ్జిక్యూటీవ్ బృందం సీఎంతో సమావేశమైంది.   ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలను ఈ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రాసెసింగ్ జోన్ నెలకొల్పడానికి సన్నాహాలు కూడా చేస్తున్నారు. భూముల కొనుగోలు ప్రయత్నంలో ఉన్నారు. భారత ప్రభుత్వం ప్రకటించబోయే ఫుడ్ ప్రాసెసింగ్ విధానం కోసం ఈ సంస్థ ఎదురు చూస్తోంది. భారత్‌లో ఇప్పటికే 300 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిన ఫరాఫ్ గ్రూపు పూనే, లుథియానాలో వ్యాపారం కేంద్రీకరించింది. ఆహార శుద్ధి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా రవాణా సదుపాయాలు ఉండాలని వారు అభ్యర్థిస్తున్నారు. తమిళనాడులో ఇప్పటికే ఈ సంస్థ భారీ స్థాయిలో భూమిని సమకూర్చుకుంది. భూముల సంబంధిత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా సహకారం అందిస్తుందని, వెంటనే తమ ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు జరపమని సీఎం వారికి సూచించారు. అనేక అంశాలలో ఏపీ ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తోందని హుస్సేన్ ప్రశంసించారు. త్వరలో తమ సంస్థ అత్యున్నతస్థాయి బృందాన్ని ఏపీకి పంపిస్తామని చెప్పారు. దుబాయ్‌లో తన ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే వ్యాపారవేత్తల సదస్సుకు హాజరుకావాలని షరాఫ్   సీఎంను ఆహ్వానించారు.
 ఎమిరేట్స్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో ఆ గ్రూప్ చైర్మన్ షేక్ అహ్మద్ బీన్ సయీద్ అల్ మక్దూమ్‌తో సీఎం సమావేశమయ్యారు. ఆ గ్రూప్ రాష్ట్రంలో అడుగుపెట్టేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఎయిర్ క్రాఫ్ట్  తయారీ, విమానాల ఇంటీరియర్, డ్యూరబుల్స్ తయారీ కేంద్రాలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఎమిరేట్స్ గ్రూపు ముందుకొచ్చింది. ఏవియేషన్ శిక్షణ కోసం ఒక అకాడమీని సైతం నెలకొల్పనుంది. దీంతో పాటు మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (ఎమ్ఆర్ఆర్) సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఎం సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి సంస్థ( ఏపీఈడీబీ)తో ఎమిరేట్స్ గ్రూపు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం ఎమిరేట్స్ గ్రూపు, ఏపీఈడీబీ కలిసి వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేస్తాయి. ఏరోస్పేస్ సంబంధిత మౌలిక సదుపాయాలు, తయారీ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటిల్లో ఎమిరేట్స్పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను ఈ వర్కింగ్ గ్రూపులు పరిశీలిస్తాయి. అలాగే ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఏపీలో నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపులోనూ ఎమిరేట్స్’, ఏపీఈడీబీ సంయుక్తంగా కలిసి పనిచేస్తాయి. ఈ ఒప్పందం వాస్తవరూపం దాల్చితే రాష్ట్రానికి కొత్తగా రూ. 30 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చేందుకు అవకాశం లభిస్తుంది. దుబాయ్ ఎయిర్‌పోర్టు ఫ్రీ జోన్ అథారిటీ డైరెక్టర్ జనరల్, దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ అథారిటీ వైస్ చైర్మన్, దుబాయ్ ఎయిరో స్పేస్ డైరెక్టర్ డాక్టర్ మహమ్మద్ అహ్మద్ అల్ ఝరూనీతో కూడా సీఎం సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ స్థాయి ఎయిరోసిటీ ఏర్పాటు సన్నాహాల్లో వున్నామని, ఇందుకోసం సౌదీ అరేబియా పెట్టుబడిదారులతో కలిసి పనిచేస్తున్నామని ఝురానీ వెల్లడించారు. కేపీఎంజీ సహకారంతో మరో మూడు నెలల్లో దీనిపై సవివర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఎయిర్ బస్తో ఒప్పందం కుదుర్చుకున్నామని, నాసాతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. విశాఖలో జరిగే సీఐఐ-భాగస్వామ్య సదస్సుకు హాజరవుతానని ఝురానీ మాటివ్వగా, అప్పటికి స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆరు ఖండాలు, 40 దేశాల్లోని నౌకాశ్రయాల్లో మెరైన్, ఇన్‌లాండ్  టెర్మినళ్లను కలిగి, సప్లయ్ చైన్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్యానికి మార్గం సుగమం చేయండంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న డీపీ వరల్డ్ గ్రూప్ చైర్మన్ సుల్తాన్ బీన్ సులేయమ్‌, గ్రూపు డిప్యూటీ ఛీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజ్ జిత్ సింగ్ వాలియా, కార్పొరేట్ ఫైనాన్స్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ ఖన్నాలను సీఎం కలిసినప్పుడు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు, వివిధ అంశాలలో కలిసి పనిచేసేందుకు  ఏపీ, డీపీ వరల్డ్ సంయుక్త భాగస్వామ్యంతో కార్యబృందం ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఏపీ ప్రభుత్వ మౌలిక సదుపాయాల శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్‌జైన్, డీపీవరల్డ్ సీఈవో యువరాజ్ ఉన్నారు. ఏపీలో తమ సంస్థ కార్యకలాపాల విస్తృతికి వెంటనే ఒక బృందాన్ని పంపించేందుకు సుల్తాన్ అంగీకారం తెలిపారు. 
బిజినెస్ లీడర్స్ ఫోరం యూఏఈ ఆధ్వర్యంలో ఏర్పాటైన రోడ్ షోలో సీఎం పాల్గొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలు- ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాటా మంతీఅనే ఇతివృత్తంతో ఏర్పాటైన ఈ రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. పెట్టుబడులు తెండి. అనుమతులు, వ్యవస్థాపన అంశాలకు తాను భరోసాగా ఉంటానని, ఆ బాధ్యత తనదని స్పష్టం చేశారు.  తమది అందమైన, ఆహ్లాద రాష్ట్రం అని,  పెట్టుబడులకు  చక్కని గమ్యస్థానంగా ఎంచుకోండని పిలుపు ఇచ్చారు. విశాఖ మహానగరంలో లులూ గ్రూపు ఏర్పాటు చేస్తున్న కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించిన నిర్మాణ ఆకృతులు ఆ సంస్థ ప్రతినిధులు సీఎం బృందానికి చూపించారు. విశాఖలో ఈనెల 26న లులూ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి సీఎం  శంకుస్థాపన చేసే అవకాశం వుంది. ముఖ్యమంత్రి బృందంలో ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్య కార్యదర్శి జి. సాయిప్రసాద్, మౌలికవసతుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఏపీఈడీబీ సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్ ఉన్నారు. యుఏఈలో భారత రాయబారి నవదీప్ సూరి కూడా ఈ బృందం వెంట ఉన్నారు.

-శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్- 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...