Feb 5, 2018

బడ్జెట్ లో ఆశించిన కేటాయింపులు జరుగలేదు


మంత్రి కాలవ శ్రీనివాసులు
              సచివాలయం, ఫిబ్రవరి 5: కేంద్ర తాజా బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ఆశించిన కేటాయింపులు జరుగలేదని సమాచార, పౌరసంబంధాలు, గ్రామీణ గృహ నిర్మాణ శాఖల మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు.  సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లో రాష్ట్ర రెవెన్యూ లోటు , నూతన రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ అంశాల ప్రస్తావన లేకపోవడంతో రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలోని తెలుగువారందరూ అసహనానికి గురయ్యారని, కొందరు ఆగ్రహావేశాలు కూడా వ్యక్తం చేశారని చెప్పారు. బాధ్యతాయుతమైన ప్రభుత్వ నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అసంతృప్తిని వ్యక్తం చేశారని, కేంద్రపై వత్తిడి తెస్తున్నారని తెలిపారు.  రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే పరమావధిగా భవిష్యత్ కోసం ఆయన నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. బిజేపీ మిత్రపక్షమైనా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ, కేంద్రంపై వత్తిడి తెస్తున్నామని,  రాష్ట్రాభివృద్ధి కోసం పోరాడతామని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల వేదికగా తమ పార్టీ అవతరించిందని, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ తమ ఆలోచనలు, నిరసనలు తెలియజేస్తామన్నారు.  రాజీలేని పోరాటం చేస్తామన్నారు. బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో అడగవలసి ఉందని చెప్పారు. బడ్జెట్ లోని అన్ని అంశాలను అద్యయనం చేస్తున్నామని,  టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీస్తున్నారన్నారు. ఫలితాలు సాధించేవరకు పోరాడతామని చెప్పారు.
విభజన హామీలు నెరవేర్చే విషయంలో అన్ని పార్టీలు బాధ్యత తీసుకోవాలన్నారు. ఎక్కడైతే విభజన జరిగిందో అక్కడే న్యాయం జరగాలన్నారు. పార్లమెంటుని వేదిక చేసుకొని తమ పార్టీ ఎంపీలు తమ వాదన వినిపిస్తున్నారని చెప్పారు. విభజన చట్టంలో చెప్పింది చేయమని అడుతున్నట్లు తెలిపారు. కొన్ని కార్యక్రమాలకు కేంద్రం సహాయం చేస్తుందని, ఆ విషయం తాము చెబుతూనే ఉన్నామన్నారు. కేంద్రం సహకరిస్తే రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చెస్తామని మంత్రి కాలవ చెప్పారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...