Feb 20, 2018

ఏపీలో ప్రకృతి వ్యవసాయ విప్లవం

               ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి  వ్యవసాయసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో పచ్చదనం నింపడంతోపాటు ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేలా ఆహార ఉత్పత్తులు ఉండేవిధంగా చర్యలు తీసుకుంటోంది. ప్రజలంతా ఆరోగ్యంగా జీవించడానికి ప్రకృతి సాగును ప్రోత్సహిస్తోంది. 2018ని ప్రకృతి వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది.  విషపూరితమైన కృత్రిమ ఎరువులు, క్రిమి సంహారక మందులకు దూరంగా సాగుకు కృషి చేస్తున్నారు. సహజసిద్ధ వ్యవసాయం ద్వారా సాధించిన ఆహారోత్పత్తులు మనల్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా, ఆనందంగా జీవించేలా చేస్తాయి. రాష్ట్రంలో రైతులు ఓ వైపు అధిక ఉత్పత్తి వ్యయంవర్షాబావ పరిస్థితులను, మరో వైపు గిట్టుబాటు ధరలు లభించని పరిస్థితులను  ఎదుర్కొంటున్నారుప్రజలు విషపూరితమైన  క్రిమి సంహారక మందులు విపరీతంగా చల్లిన ఆహార పదార్ధాలను తింటూ రోగాల బారిన పడుతున్నారు. ప్రకృతి వ్యవసాయానికి మళ్లకపోతే మరో 200 ఏళ్లకు భూసారం పూర్తీగా దెబ్బతింటుందని యునైటెడ్ నేషన్స్ సంస్థ హెచ్చరించింది.  ప్రస్తుత పద్ధతుల్లో వ్యవసాయం చేస్తే ప్రపంచానికి మనుగడ ఉండదు.  2050 నాటికి తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. ఎరువులు, పురుగుమందులు అధికంగా వినియోగిస్తే  పర్యావరణం, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. అత్యాధునిక వ్యవసాయ పద్ధతులతో చాలా జీవరాసులు అంతరించిపోతున్నాయి.  ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ విషయాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అటు భూసారం దెబ్బతినకుండా,  రైతు ఆర్ధికంగా బలోపేతం అయ్యేందుకు, ఇటు ప్రజారోగ్యం కాపాడేందుకు వ్యూహాత్మకంగా పెట్టుబడి లేని సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్, ప్రపంచ బ్యాంకు నిపుణులు, ఐడీహెచ్ - టీఎంజీ పరిశోధనావేత్తలు వంటి అనేక మంది దీనికి మద్దతు పలుకుతున్నారు.
           రైతు సమస్యలపైన, వారి ఆదాయం పెంచడంపైన ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించే చర్యలు చేపట్టింది.  ఈ విషయంలో  రైతన్నలు విజయం సాధించారు. ఇష్టానుసారంగా ఎరువులు, పురుగుమందులు వాడకుండా రూ.328 కోట్లకుపైగా ఆదా చేశారు.  ప్రకృతి వ్యవసాయం ద్వారా ధాన్యం ఉత్పత్తి 6 శాతం, పత్తి 10 శాతం, వేరుశనగ 23 శాతం అధికంగా ఉత్పత్తి సాధించారు. ఈ విధానాన్ని మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం శిక్షణా శిబిరాలు నిర్వహిస్తోంది.  కాకినాడ, తిరుపతి, గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద  సేంద్రీయ విప్లవ పితామహుడు సుభాష్ పాలేకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రైతు శిక్షణ శిబిరాలు మంచి ఫలితాలనిచ్చాయి. రైతులకు అవగాహన కల్పించడానికి, వారు ప్రకృతి వ్యవసాయం వైపు మారడానికి ఉపయోగపడ్డాయి. గత డిసెంబర్ లో నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద పాలేకర్ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి రాష్ట్రంలోని అన్ని మండలాలు, ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 8 వేల మంది రైతులు హాజరయ్యారు. రాష్ట్రం నలుమూలల 331 మండలాల్లోని 972 గ్రామాల నుంచి ఏడాది, రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ, ఇందులో మెళకువలు తెలిసి, అధిక ఉత్పత్తులు సాధించిన 5 వేల మందితోపాటు మిగిలిన 333 మండలాల నుంచి కూడా 1700 మంది కొత్త రైతులు , 13 వందల మంది మహిళా రైతులు, కార్పోరేట్ రంగం నిపుణులు కూడా పాల్గొన్నారు. రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రకృతి వ్యవసాయ సాగుకు ఉపయోగపడే పరికరాలకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు.   ఇక్కడ శిక్షణ పొందిన రైతులు తమ గ్రామాలలోను, ఇతర గ్రామాలలోనూ రైతులకు శిక్షణ ఇస్తున్నారు.
               వ్యవసాయంలో రసాయనాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు, వానపాములు అంతరించిపోవడం, భూసారం దెబ్బతినడం, ప్రకృతి వ్యవసాయం వల్ల లాభాలు, బీజామృతం, ఘన, ధ్రవజీవామృతం తయారుచేయడం, చీడపీడల నుంచి రక్షణ కల్పించే పద్దతులు, వివిధ పంటలకు తీసుకోవలసిన జాగ్రత్తలు, అంతర్ పంటల సాగు వంటి అంశాలలో రైతులకు శిక్షణ ఇచ్చారురైతులు, వినియోగదారుల సంక్షేమం, భూసారం పెంచే వినూత్న పద్దతులు, ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తిని సాధించడం వంటి విషయాలను వారికి వివరించారు. ఈ విధానంలో రైతులు దీర్ఘకాలంలో లాభపడతారు. ఒక గ్రామంలో ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయం చేస్తే సర్టిఫికేషన్ తేలికవుతుంది. రసాయన రహిత ఆహార పదార్ధాలు అందించడానికి ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందిఈ కార్యక్రమానికి 5 ఏళ్ల వరకు 700 కోట్లు ఖర్చు చేయనుంది. ఇందుకు రాష్ట్రీయ కృషివికాస్ యోజన, పరంపరాగత్ కృషివికాస్ యోజన, కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి నిధులు సమకూరుతాయి. 5 ఏళ్ల కాలంలో అజీమ్ ప్రేమ్ జీ ఫిలాంత్రొపిక్ ఇన్షియేటివ్  రూ.100 కోట్లు ఖర్చు చేస్తుంది. భవిష్యత్ అంతా ప్రకృతి వ్యవసాయానిదే2016-17లో రాష్ట్రంలోని 704 గ్రామాల్లో 40,656 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం పరిధిలోకి వచ్చారు. 2017-18లో రాష్ట్రంలోని సగం 331 మండలాల్లో 399 క్లస్టర్లలో 972 గ్రామాలు ఈ కార్యక్రమం పరిధిలోకి వస్తాయని భావిస్తున్నారు. గతంలో ఎంపిక చేసిన గ్రామాలతో కలుపుకొని  ప్రస్తుతం 1,38,993 మంది రైతులు పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ ప్రకృతి వ్యవసాయం పద్దతులు అనుసరిస్తున్నారు. వీరిలో 25 శాతం మంది రైతులు విత్తన దశ నుంచే సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరకు  రాష్ట్రంలో లక్షా 80 వేల మంది, 2024 నాటికి 60 లక్షల మంది రైతుల వరకు ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టే అవకాశం ఉంది. తద్వారా నూరు శాతం పచ్చని ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుంది. 2027 నాటికి ఆకుపచ్చని ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా ప్రభుత్వం కృషి చేస్తాంది.

-         శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...