Feb 6, 2020


రాజధానికి లక్ష కోట్లు అవసరంలేదు
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి, మస్తాన్‌ వలీ
వేంపల్లె, విజయవాడ, ఫిబ్రవరి 6: ‘‘రాష్ట్ర రాజధాని అమరావతిలో సచివాలయ భవనాలు వంద శాతం పూర్తయ్యాయి. అవి కనిపించడం లేదా? ప్రస్తుతం ఎక్కడి నుంచి పరిపాలన సాగిస్తున్నారో వైసీపీ నాయకులకు తెలియదా? అనేక ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే అమరావతిలో సచివాలయ భవనాలు బాగున్నాయి’’ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. వేంపల్లెలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమరావతిలోని రాజధానికి రూ.1.09 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని, అందుకే రాజధానిని విశాఖకు మారుస్తున్నామని సీఎం జగన్మోహన్‌రెడ్డి చెపుతున్న మాటల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. నాలుగేళ్లుగా అమరావతిలోని శాశ్వత భవనాల్లో నుంచే పాలన సాగుతున్న విషయాన్ని మరుగునపెట్టి, ప్రజలకు అబద్ధాలను చెబుతూ రాజధానిని మార్చాలని వైసీపీ నేతలు నిర్ణయం తీసుకోవడం శోచనీయమన్నారు. అసెంబ్లీ భవనాలు వంద శాతం పూర్తయ్యి సర్వాంగసుందరంగా తయారయ్యాయన్నారు. ఇతర రాష్ట్రాల కంటే సౌకర్యంగాను, ఆకర్షణీయంగా ఉన్నాయని తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారుల నివాస సముదాయం 70 శాతం పూర్తయిందన్నారు. ఇంకొక రూ.5 వేల కోట్లు ఖర్చుపెడితే అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవచ్చునని తెలిపారు. రైతుల నుంచి సేకరించిన భూమిలో మౌలిక వసతులకు, భవనాలకు, రైతులకు ఇవ్వగా ప్రభుత్వం వద్ద 9 వేల ఎకరాలు ఉందన్నారు. ఎకరా రూ.10 కోట్ల చొప్పున విక్రయించినా రూ.90 వేల కోట్లు వస్తుందని తెలిపారు. రాజధానిని అమరావతిలోనే పూర్తిచేయడం వలన ప్రభుత్వానికి రూ.85 వేల కోట్లు మిగులుతాయని తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా వస్తున్న పింఛన్లను ఏదోకకారణం చూపుతూ తొలగించడం దుర్మార్గమన్నారు.

రాష్ట్రంలో లక్షలాది పింఛన్లను తొలగించడంతో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు ఆందోళనకు గురవుతున్నారని తులసిరెడ్డి అన్నారు. మరో కార్యనిర్వాహక అధ్యక్షుడు మస్తాన్‌ వలీ విజయవాడలో మాట్లాడారు. ప్రత్యేక హోదాపై ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు దురహంకారంతో, పిట్టలదొరలా మాట్లాడుతున్నారని విమర్శించారు. హోదా గురించి అడిగితే శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని సీఎంనే బెదిరిస్తున్నారని అన్నారు. దీనిపై సీఎం మౌనంగా ఉంటే కేసుల గురించి భయపడుతున్నారని భావించాల్సి ఉంటుందన్నారు.


No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...