Feb 10, 2020

దెబ్బతిన్న అమరావతి బ్రాండ్‌ ఇమేజ్


v నిర్మాణాలు పూర్తి చేసుకోకముందే అమరావతిని  ప్రపంచం గుర్తించింది. బ్రహ్మాండమైన బ్రాండ్‌ ఇమేజ్ ఏర్పడింది. అనేక అంచనాలతోనే ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో సంస్థలు రాజధానిలో తమ శాఖలు, విభాగాలను ప్రారంభించేందుకు ముందుకొచ్చాయి.
v భూమి రేటు ఎక్కువా తక్కువా అనేది కాకుండా తమ కార్యాలయాలు రాజధానిలో ఉండాలని ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఆసక్తి ప్రదర్శించాయి.
v ప్రభుత్వం నుంచి 130 కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు 1293 ఎకరాలు తీసుకొన్నాయి. వాటిలో కొన్ని సంస్థలు నిర్మాణాలను కొనసాగిస్తున్నాయి. మరికొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి.
v మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది.
v ప్రత్యక్షంగా అమరావతిలో లేనప్పటికీ దానికి ఆనుకొని ఉన్న మంగళగిరి వద్ద కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మితమవుతున్న ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) పరిస్థితి కూడా డోలాయమానంలో పడనుంది. వందలాది కోట్ల రూపాయలతో రాష్ట్రానికే మణిమకుటంగా రూపొందుతున్న ఈ జాతీయస్థాయి వైద్య సంస్థ రాష్ట్రంలోని మధ్యభాగాన ఉన్నందున దాని సేవలను అన్ని ప్రాంతాల వారూ సులభంగా పొందగలుగుతారని భావించారు. భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరులలో భారీఎత్తున పెరగబోయే జనాభాకు అత్యంత నాణ్యమైన వైద్యసేవలందగలవని అనుకున్నారు. రాజధాని ముక్కలైనట్లయితే రాష్ట్ర ప్రజలు పూర్తిస్థాయిలో ఎయిమ్స్‌ సేవలు వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. రెండేళ్ల క్రితమే ప్రారంభమై ఎయిమ్స్ తాజాగా అత్యాధునిక వైద్య యంత్రాలను కూడా సమకూర్చుకొంది.
v ఇంకొన్ని కీలక సంస్థలు తాము పొందిన భూముల్లో నిర్మించబోయే భవంతులకు సంబంధించిన ప్లాన్లకు ఉన్నతాధికారులు, సంబంధిత సంస్థల నుంచి అనుమతులు పొందాయి.
v మూడుచోట్ల రాజధానుల్లో భాగంగా అమరావతి రాజధానిని విశాఖకు తరలించాలన్న జగన్‌ ప్రభుత్వం నిర్ణయం భూములిచ్చిన రైతులను నట్టేట ముంచితే.. గంపెడు అంచనాలతో అడుగుపెట్టిన ఈ సంస్థలనూ అగమ్యగోచర పరిస్థితికి గురి చేస్తోంది. ఇలాంటి పరిస్థితి  వస్తుందని తాము కలలో సైతం అనుకోలేదని పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులు, బాధ్యులు ప్రైవేట్‌ సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నారు.
v ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు దేశంలోని పలు ఇతర రాష్ట్రాలు కూడా విడిపోయి, కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అయితే వాటిల్లో ఒక్కదానిలో కూడా రాజధాని విషయంలో అమరావతి మాదిరి విచిత్ర పరిస్థితి తలెత్తలేదు. ముందటి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వారు తిరగదోడకుండా, వాటికే కట్టుబడి ఉండడంతో ఆయా రాజధానుల్లో ఎక్కడా తమ కార్యాలయాలు, శాఖలను ఏర్పాటు చేయడంలో ఎటువంటి ఇబ్బందులు గానీ, సందిగ్ధత ఏర్పడలేదు.
v ఇతర రాష్ట్రాల రాజధానుల మాదిరిగా కాకుండా అమరావతి పూర్తి గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీగా, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతుందన్న నమ్మకంతో తదనుగుణంగానే అందులో తమ కార్యాలయాలు, సిబ్బంది నివాస సముదాయాలను నిర్మించేందుకు ప్రణాళికలను రచించుకుంటున్నాయి. ఏదో తమ కార్యాలయం ప్రారంభించామంటే ప్రారంభించామని కాకుండా, అమరావతి స్థాయికి తగినట్లుగా రూపొందించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమై, భూములను కేటాయించాల్సిందిగా ఈ సంస్థలు కోరాయి.
v ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.4 కోట్ల వరకు చెల్లించి.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వరకు పలు సంస్థలు ఇక్కడ భూములు కొనుగోలు చేశాయి.
v మొత్తంమీద ఈ సంస్థలు సుమారు రూ.450 కోట్లకు పైగా  వెచ్చించాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసీ, సీపీడబ్ల్యూడీ, ఎస్డీపీవో, బీఐఎస్‌, తపాలా, నావికాదళం, ఎఫ్‌సీఐ, ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, నాబార్డ్‌, కాగ్‌, రైట్స్‌, ఫోరెన్సిక్‌, ఎన్‌ఐఏసీ, హెచ్‌పీసీఎల్‌, సిండికేట్‌ బ్యాంక్‌, ఏపీఎన్నార్టీ, ఆప్కాబ్‌, హెచ్‌సీఎల్‌.. వంటి ఎన్నో సంస్థలు భూములను కొనుగోలు చేశాయి. వీటిలో అత్యధికం ఆయా భూముల్లో తమ కార్యాలయ భవనాలను నిర్మించేందుకు అనువైన ప్లాన్లను సైతం సిద్ధం చేసుకుని, సంబంధిత అనుమతులను కూడా పొందాయి. బయో డైవర్సిటీ మ్యూజియం, ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా మ్యూజియం వంటి ప్రదర్శనశాలల ఏర్పాటుకు కూడా చంద్రబాబు ప్రభుత్వం భూములను కేటాయించింది.
v తిరుమలలోని శ్రీవారి ఆలయం తరహాలో అమరావతిలో కోవెలను నిర్మించేందుకు టీటీడీకి అప్పటి ప్రభుత్వం 25 ఎకరాలు ఇచ్చింది. కొన్ని నెలల కిందట పనులను కూడా ప్రారంభించారు. అయితే వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు మారిన దృష్ట్యా ఈ పనులు ఆగిపోయాయి. దీంతో అసలు శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతుందా? లేదా? అని శ్రీవారి భక్తులు ఆవేదన చెందుతున్నారు. 
v అమరావతికి భవిష్యత్తులో సందర్శకులు, పర్యాటకుల సందడి గణనీయంగా పెరుగుతుందన్న అంచనాతో దేశ, విదేశాలకు చెందిన ఎన్నో ప్రముఖ హోటల్‌ గ్రూపులు రాజధానిలో హోటళ్ల నిర్మాణానికి భూములను పొందాయి. ఈ సంస్థల్లో కొన్ని ఇప్పటికే తమకు కేటాయించిన భూములను నిర్మాణానికి అనువుగా చదును, మెరక చేయించడమే కాకుండా నిర్మాణాలకు అవసరమైన సాయిల్‌ టెస్ట్‌ లను సైతం చేయించాయి. అయితే, ఇప్పుడు తలలు పట్టుకుంటున్నాయి.
v  రాజధాని నగరంలో పలు ప్రఖ్యాత ప్రైవేట్‌ విద్యాసంస్థలు స్థలాలు పొందాయి. వాటిల్లో ఎస్‌ఆర్‌ఎం, విట్‌ వంటివి ఇప్పటి కే భవనాలను నిర్మించి, గత మూడేళ్లుగా తరగతులను సైతం నిర్వహిస్తున్నాయి. ఈ రెండింట్లో కలిపి 10,000 మందికిపైగా పలు ప్రాంతాలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అమృత, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్స్‌(ఎన్‌ఐడీ) తదితరాలు నిర్మాణాలను చురుగ్గా కొనసాగిస్తున్నాయి. సీఐటీడీ, ఏపీహెచ్చార్డీసీ, బీఆర్‌ శెట్టి, నిఫ్ట్‌, రెండు కేంద్రీయ విద్యాలయాలు, జేవియర్‌, ఎల్వీపీఈఐ, హెరిటేజ్‌, ఓక్‌రిడ్డ్‌ తదితర సంస్థలు నిర్మాణాలను చేపట్టేందుకు సమాయత్తమయ్యాయి.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...