Feb 15, 2020

మండలిలో రాజ్యాంగ సంక్షోభం!


v ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఆకస్మికంగా రాజ్యాంగ సంక్షోభం తలెత్తింది. మండలి చైర్మన్‌ ఎం.ఎ.షరీఫ్‌ ఇచ్చిన ఆదేశాలను పాటించలేనని పేర్కొంటూ అసెంబ్లీ-మండలి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు ఆయనకు లిఖితపూర్వక సమాధానం పంపారు. మండలి చరిత్రలో ఇటువంటి పరిణామం ఇదే తొలిసారి. చైర్మన్‌ ఆదేశాలను ధిక్కరించినందుకు కార్యదర్శి సభా ధిక్కరణ విచారణ ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ (3 రాజధానులు) బిల్లులను సెలెక్ట్‌ కమిటీ పరిశీలనకు పంపాలని చైర్మన్‌ ఇచ్చిన ఆదేశాల తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
v రాష్ట్రంలో రెండు చట్ట సభలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండడం సంక్లిష్టతను పెంచింది. మామూలుగా శాసనసభ, మండలికి వేర్వేరు కార్యదర్శులు ఉండాలి. కానీ ఇంతకు ముందు మండలి కార్యదర్శిగా ఉన్న సత్యనారాయణ పదవీ విరమణ తర్వాత ఆ స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు. అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న బాలకృష్ణమాచార్యులే మండలికి కూడా కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. శాసనసభలో వైసీపీకి, మండలిలో టీడీపీకి ఆధిక్యం ఉండడం.. రెండు సభలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండడంతో పరిస్థితి క్లిష్టంగా మారింది. సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు వ్యవహారంలో తాము చెప్పినట్లే వినాలని అధికార పక్షం.. మండలిలో సంఖ్యాబలం ఉన్న తమ మాటే వినాలని విపక్ష టీడీపీ పట్టుబడుతున్నాయి.
v తన ఆదేశాల మేరకు వెంటనే సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు చేసి బులెటిన్‌ విడుదల చేయాలని రెండు రోజుల క్రితం మండలి చైర్మన్‌ ఆయనకు లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు. 48 గంటల్లో తన ఆదేశాలు పాటించాలని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. కానీ తాను ఆ ఆదేశాలను పాటించలేకపోతున్నానని కార్యదర్శి శుక్రవారం పంపిన సమాధానంలో పేర్కొన్నట్లు సమాచారం. చైర్మన్‌ ఆదేశాలపై కొందరు సాంకేతిక అభ్యంతరాలు లేవనెత్తారని, అందువల్ల తాను ఆ ఆదేశాలను పాటించలేకపోతున్నానని ఆయన తెలిపారు. దీనితో సెలెక్ట్‌ కమిటీ వ్యవహారంలో పీట ముడి పడింది.
v కార్యదర్శి తన అభిప్రాయాన్ని రాసి పంపడంతో దీనిపై ఏం చేయాలన్నదానిపై మండలి చైర్మన్‌ న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు సమాచారం. మరోపక్క మండలిలో సంఖ్యాబలం ఉన్న టీడీపీ కూడా ఈ పరిణామాలపై చర్చిస్తోంది.
v సెలెక్ట్‌ కమిటీ ఫైలును మండలి కార్యదర్శి తిప్పిపంపడం సభా ధిక్కారమేనని, ఆయన తప్పు చేశారని మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. కార్యదర్శి వ్యవహార శైలిపై ఎమ్మెల్సీలెవరైనా ఫిర్యాదు చేస్తే సభాహక్కుల ఉల్లంఘన కింద విచారణ జరపాల్సి వస్తుంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...