Feb 3, 2020

జగన్ పై సంపాదకీయాలు



పార్లమెంటులో ఏకంగా 22 మంది ఎంపీలు! కొత్తగా జాతీయ సలహాదారు పోస్టు సహా డజనుకుపైగా అలాంటి పదవులే ఢిల్లీలోనూ, రాష్ట్రంలోనూ! అయినా, జాతీయస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠ పడిపోవడమేగానీ నిలబడుతున్నట్టు కనిపించడం లేదు. జాతీయమీడియాలో వస్తున్న వార్తలు, ఆంగ్ల పత్రికల సంపాదకీయ వ్యాఖ్యలు...జగన్‌ పాలనపై వీలు దొరికినప్పుడల్లా ధ్వజమెత్తుతూనే ఉన్నాయి. ఎనిమిది నెలల క్రితం అధికారంలోకి వచ్చి, తొలి అడుగుగా ప్రజావేదికను కూల్చిన నాటినుంచీ తాజాగా రాజధాని మార్పు దాకా ముఖ్యమంత్రి జగన్‌ తీసుకొంటున్న ప్రతి చర్యా వాటి కన్నెర్రకు గురవుతూనే ఉంది. రివర్స్‌టెండరింగ్‌ విధానాన్ని ఆ పత్రిక ఈ పత్రిక అని లేకుండా అన్ని మాధ్యమాలు తూర్పారబట్టాయి. జగన్‌ కక్షసాధింపు వైఖరి.
మూడు రాజధానుల నిర్ణయంతో పరాకాష్ఠను అందుకొన్నదని తమ సంపాదకీయాల్లో ఆందోళనను వెలిబుచ్చాయి. బ్లూంబర్గ్‌ వంటి అమెరికా పత్రికలు సైతం విద్యుత్‌ ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తోందని విమర్శించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమన్వయం చేసుకొంటూ, ఆయన ఐదేళ్లలో తలపెట్టిన ప్రాజెక్టులను, నిర్ణయాలను పూర్తిచేయడం రాష్ట్రానికే కాదు.. దేశ ప్రయోజనాలకూ మేలు చేస్తుందని ముక్తకంఠం వినిపించాయి. ఈ విషయంలో మీ తండ్రి నుంచి నేర్చుకోండిఅని ముక్తాయించాయి.
 మూడు సరికాదు
‘‘మూడు రాజధానులు సరైన నిర్ణయం కాదు. భారతదేశానికి అమరావతి వంటి గ్రీన్‌ఫీల్డ్‌ రాజధాని అవసరం’’  - శేఖర్‌ గుప్తా
ప్రతిదీ రద్దే
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకం. తెలుగునాడును ఇంగ్లీషు నాడుగా మారుస్తున్నారు. జగన్‌ సర్కార్‌ పాలనలో రద్దుల పర్వమే కొనసాగుతోంది’’
-          సచ్చిదానందమూర్తి ద వీక్‌ సహ సంపాదకుడు
టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా
‘‘రాజ్యాంగపరంగా సంక్రమించిన హక్కులను ఉపయోగించుకుని శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న చంద్రబాబును అరెస్టు చేయడం పూర్తిగా అనవసరం. ఈ ఘర్షణాయుత రాజకీయాల వల్ల రాష్ట్రం దెబ్బతింటుంది. కక్షసాధింపే జగన్‌ ప్రధాన దృష్టిగా కనిపిస్తోంది. చంద్రబాబు మేధోజనితమైన అమరావతి ఇప్పుడు దయ్యాల నగరంగా మారే ప్రమాదం ఉన్నది. జగన్‌ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలే అమలు చేస్తే ఖజానా గుల్ల అవుతుంది. చంద్రబాబుతో సత్సంబంధాలు పెట్టుకుని రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా మార్చాలనుకున్న ఆయన అసంపూర్ణ కలను జగన్‌ నెరవేర్చాలి’’   (2019 సెప్టెంబర్‌ 12 సంపాదకీయం)
‘‘తరచూ విధాన నిర్ణయాలు మార్చడం వల్ల వ్యాపార వాతావరణం దెబ్బతింటుంది. అమరావతి ప్రాజెక్టు విజయవంతం అయితే దేశవ్యాప్తంగా నగరాల నిర్మాణానికి రైతులు ముందుకు వచ్చేందుకు దోహదం ఏర్పడేది. అమరావతిలో జగన్‌ నిర్మాణాలను పూర్తి చేయాలి. వాటిని అసంపూర్తిగా ఆయన మిగల్చరాదు. ఇది దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు పంపిస్తుంది’’  (2020 జనవరి 20 సంపాదకీయం)
  ద ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌
‘‘చంద్రబాబు వారసత్వాన్ని జగన్‌ చెరిపివేసే బదులు సుపరిపాలనా ఎజెండాను అమలు చేయాలి. విద్యుత్‌ ప్రాజెక్టుల రద్దు, పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌, అమరావతి లో నిర్మాణాలను వందరోజుల్లోనే నిలిపివేయడం దారుణం. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వెనక్కు వెళ్లడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి మంచి పరిణామం కాదు’’ (2019 సెప్టెంబర్‌ 13 సంపాదకీయం)
‘‘జగన్‌ మద్య అమ్మకంవిధానం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతుంది. మద్యం కొరతగా మారినంత మాత్రాన ప్రజలు మద్యానికి బానిసలు కాకుండా పోరు. దీని వల్ల చీప్‌ లిక్కర్‌ వినియోగం పెరుగుతుంది’’
(2019 నవంబర్‌ 25 సంపాదకీయం)
‘‘అమరావతి ఆలోచనను నిర్వీర్యం చేయాలన్నదే సీఎం జగన్‌ ఉద్దేశమైతే అది అసమర్థ నిర్ణయం అవుతుంది. అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మూడు రాజధానుల మధ్య వందలాది కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీని వల్ల రోజువారీ కార్యకలాపాలు దుర్భరంగా మారుతాయి’’
(2020 జనవరి 23 సంపాదకీయం)
 ఎకనమిక్‌ టైమ్స్‌
‘‘జగన్‌ ప్రభుత్వానిది తిరోగామ దృక్పథం. అమరావతి ప్రాజెక్టును రద్దు చేయడం దేశంలో పట్టణాభివృద్ధినే దెబ్బతీసే విధానం. ఇంకా యువకుడైన జగన్‌ తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హైదరాబాద్‌లో చంద్రబాబు చేపట్టిన ఐటీ హబ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకపోతే ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలి. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి చేపట్టిన యమునా ఎక్స్‌ప్రెస్‌ వే వంటి ప్రాజెక్టులను అఖిలేశ్‌ ఎలా పూర్తి చేశారో తెలుసుకోవాలి. ఒక వినూత్న పద్ధతిలో భూసేకరణ జరిపిన చంద్రబాబు కృషిని కొనసాగించి అమరావతి రాజధాని నగరం దేశానికే ఆదర్శంగా మార్చి ఉండాల్సింది. జగన్‌ విధ్వంసక పంథాలో సాగుతున్నారు. చంద్రబాబు నిర్మించిన అధునాతన కన్వెన్షన్‌ సెంటర్‌ సహా రూ. 50వేల ప్రాజెక్టులను నిలిపివేశారు. ఇది చెత్త రాజకీయం’’  (2019 నవంబర్‌ 15 సంపాదకీయం)
‘‘మౌలికసదుపాయాల ప్రాజెక్టుల విషయంలో కేంద్రం క్రియాశీలక పాత్ర పోషించాలి. విద్యుత్‌ ప్రాజెక్టుల రద్దు, అమరావతి ప్రాజెక్టు రద్దు వంటి అవివేకమైన నిర్ణయాలు జగన్‌ సర్కార్‌ అమలు చేయకుండా జోక్యం చేసుకోవాలి’’ (2019 సెప్టెంబర్‌ 3 సంపాదకీయం)
‘‘ఆంధ్రా సీఎం.. అమరావతిని చంపొద్దు. రాజకీయ కక్ష సాధింపుకోసం రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయవద్దు. దేశంలో పెట్టుబడుల వాతావరణానికి హాని కలిగించవద్దు. దేశంలో అభివృద్ధికి కేంద్రాలుగా కొత్త నగరాలు ఏర్పడాలి. అలా ఏర్పడుతున్న ఒక నగరాన్ని వధించడం క్షమించరాని, బాధ్యత రహితమైన చర్య’’
 (2019 సెప్టెంబర్‌ 12 సంపాదకీయం)
‘‘ఉద్యోగాలను స్థానికులకే రిజర్వు చేయడమనేది ఘోరమైన ఆలోచన. ఒకే భారత దేశం..ఒకే మార్కెట్‌ ఉండాలన్న ఉద్దేశంతోనే జీఎస్టీని ప్రవేశపెట్టారు. కానీ జగన్‌ సర్కార్‌ ఈ ఆలోచనను చంపేసింది. రాజ్యాంగంలో పేర్కొన్న సమానత్వ ప్రాతిపదికను కూడా ఈ నిర్ణయం కాలరాచింది. ఇది ఒక ప్రమాదకరమైన నిర్ణయం’’  (2019 జూలై 24 సంపాదకీయం)
బిజినెస్‌ స్టాండర్డ్‌
జగన్‌ తన చపలచిత్త స్వభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గండి కొడుతున్నారు. ఇంధన ప్రాజెక్టులను రద్దు చేయడం అంతర్జాతీయంగా వివాదాలకు కారణమవుతుంది.  (2019 నవంబర్‌ 26 సంపాదకీయం)
‘‘నిర్మాణమవుతున్న రాజధాని ప్రాజెక్టును రద్దు చేసి మూడు రాజధానులను ప్రకటించడంలో ఎలాంటి హేతుబద్ధత లేదు. దీని వల్ల మూడు రాజధానుల చుట్టూ తిరగడానికి ప్రజలకు భారీ ప్రయాణ ఖర్చులు భరించాల్సి వస్తుంది. సమగ్రాభివృద్ధి దెబ్బతింటుంది. రియల్‌ఎస్టేట్‌ ప్రయోజనాలు నెరవేర డం మినహా జరిగేది ఏమీ లేదు. ఇప్పటివరకూ జగన్‌ తీసుకున్న నిర్ణయాలన్ని పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసేవే. రైతులకు జరిగిన నష్టాన్ని, పరిహారాన్ని జగన్‌ ఎలా చెల్లిస్తారు? చంద్రబాబు హయాంలో నిర్మించిన భవనాల కూల్చివేత వంటి చర్యలు వ్యాపార సంస్థలను నిరుత్సాహపరుస్తాయి’’  (2020 జనవ రి 24 సంపాదకీయం)
ద టెలిగ్రాఫ్‌
‘‘ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించేందుకు మీడియాకు పూర్తి స్వేచ్చ ఉండాలి. వాటిపై కేసులు పెట్టేందుకు అధికారులను ప్రోత్సహించడం సరైంది కాదు. ఇప్పటికే అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ సూచికల్లో దేశం ఎంతో వెనుకబడి ఉంది. నియంతృత్వ పోకడలను వెంటనే మానుకోవాలి’’
 (2019 నవంబర్‌ 15 సంపాదకీయం)
 ద హిందూస్థాన్‌ టైమ్స్‌
‘‘రాజకీయ కారణాలతో అమరావతి ప్రాజెక్టుపై శీతకన్ను వేయడం సరైంది కాదు. భారీ ఎత్తున ప్రజాధనం వృధా అయ్యేందుకు జగన్‌ బాధ్యత వహించాలి. అమరావతి కోసం సేకరించిన భూమి ఏమవుతుందో చెప్పాలి. తన వ్యక్తిగత ఆకాంక్షలకోసం ప్రజా ప్రయోజనాలను దెబ్బతీయరాదు’’
 (2019 సెప్టెంబర్‌ 12 సంపాదకీయం)
బ్లూంబర్గ్‌ (అమెరికా)
‘‘లక్షలాది కోట్ల మేరకు పెట్టుబడులతో సాగుతున్న విద్యుత్‌ ప్రాజెక్టులు, అమరావతి ప్రాజెక్టులను రద్దు చేసి, పోలవరం రీటెండరింగ్‌కు వెళ్లడం ఆంధ్రప్రదేశ్‌ లోనే కాదు, మొత్తం దేశంలోనే పెట్టుబడుల వాతావరణాన్ని దెబ్బతీస్తుంది’’   (2019 నవంబర్‌ 27 సంపాదకీయం)
ద హిందూ
‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న అవకతవక నిర్ణయాలు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నాయి. వొడాఫోన్‌ సంస్థ దేశంలో కొనసాగడం కష్టమైంది. సింగపూర్‌ కన్సార్టియం అమరావతి నుంచి వెనక్కు వెళ్లింది. ఇంధన ప్రాజెక్టులు ఉనికికోసం పోరాడుతున్నాయి’’ (2019 నవంబర్‌ 14 సంపాదకీయం)
ద హిందూ బిజినెస్‌ లైన్‌
‘‘మూడు రాజధానుల ఆలోచన అమలు అంత తేలిక కాదు. రైతుల ఆందోళనను పట్టించుకోవాలి. అమరావతి దెబ్బతినకుండా చూసుకోవాలి’’   (2019 డిసెంబర్‌ 21 సంపాదకీయం)
ద ట్రిబ్యూన్‌ (చండీగఢ్‌)
‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాన్నే లక్ష్యంగా పెట్టుకుని నిర్ణయాలు జరుగుతున్నాయి. కీలకమైన ప్రాజెక్టులను రద్దు చేయడం, చంద్రబాబును అరెస్టు చేయడం సరైంది కాదు. మూడువేల కిలోమీటర్లు ప్రయాణిస్తే ప్రయాణించొచ్చు కానీ, పరిపాలన లో మాత్రం ప్రజాస్వామ్య బద్ధంగా ప్రయాణించాలి’’

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...