Feb 3, 2020

బీసీజీ ఫీజు రూ.5.95 కోట్లు



ఈసీజీ తీయించుకున్నంత ఈజీగా బీసీజీ అమరావతి భవితవ్యాన్ని నిర్దేశించింది. సుమారు రూ.5.95 కోట్లు పుచ్చుకున్న ఈ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అవసరంఅని కేవలం ఐదు వారాల్లో తేల్చింది. మన రాష్ట్రం, దేశానికి చెందిన జీఎన్‌ రావు, ఇతర నిపుణులతో కూడిన కమిటీ తన నివేదిక సమర్పణకు మూడు నెలలకుపైగా సమయం తీసుకోగా... అమెరికాలోని బోస్టన్‌ కేంద్రంగా పని చేసే బీసీజీ కమిటీ మాత్రం ఈ పనిని చాలా తేలిగ్గా, మెరుపు వేగంతో పూర్తి చేసింది.
 పిచ్చోడి పని... అంటూ!
ప్రపంచంలో 32కుపైగా గ్రీన్‌ఫీల్డ్‌ సిటీలు (నూతన నగరాలు) నిర్మించినప్పటికీ... వాటిల్లో చైనాలోని షెంజన్‌, భారతదేశంలోని నవీ ముంబై మాత్రమే విజయవంతమయ్యాయని బీసీజీ పేర్కొంది. ‘‘వాటికి అనేక కారణాలున్నాయి. ఇప్పటికే రాజధాని ఉన్న నగరాలు అవి. మన రాష్ట్రానికి రాజధాని లేదు’’ అని వ్యాఖ్యానించింది. బహుశా... రాజధానిలో భాగమైన నగరాలు కాబట్టే నవీ ముంబై, షెంజన్‌ సక్సెస్‌ అయ్యాయన్నది బీసీజీ ఉద్దేశం కావొచ్చు. కానీ... అమరావతినే రాజధాని నగరంగా అభివృద్ధి చేస్తున్నారనే విషయాన్ని విస్మరించడం గమనార్హం.  ఇక... ఏ గ్రీన్‌ ఫీల్డ్‌ సిటీ ఎందుకు విఫలమైందో కూడా ఒక వాక్యంలో వివరించింది. అందులో... ఆస్ర్ట్రేలియాలోని మోనార్టో గ్రీన్‌ఫీల్డ్‌ సిటీ గురించి చెబుతూ, ‘‘అడిలైడ్‌కు 160 కిలోమీటర్ల దూరం. ఒక తిక్కలోడు అక్కడి నుంచి ప్రభుత్వాన్ని మార్చడం వల్ల విఫలమైంది’’ అని తెలిపింది. అంటే.. ఆ తిక్కలోడు రాజధానిని మార్చకపోతే గ్రీన్‌ఫీల్డ్‌ సిటీగా మోనార్టో విజయవంతమయ్యేదేమో! ఏపీలో అమరావతినే రాజధానిగా నిర్మిస్తున్నారు. అందువల్ల, విఫలమయ్యే అవకాశముండదనే విషయాన్నీ విస్మరించారు.

ఏమిటి ప్రాతిపదిక?
సాధారణంగా ఎక్కడైనా, ఎప్పుడైనా ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేసేటప్పుడు సంబంధిత ప్రభుత్వాలు అవి అధ్యయనం చేయాల్సిన అంశాలు, నివేదికలు ఎప్పటిలోగా ఇవ్వాలి అనే అంశాలతో నోటిఫికేషన్లు ఇస్తాయి. జీఎన్‌ రావు కమిటీ విషయంలో ఇలాంటి జీవో ఒకటి వెలువడింది. కానీ, బీసీజీ కమిటీ వ్యవహారం అంతా రహస్యంగానే సాగింది. అసలు ఇలాంటి కమిటీ ఒకటుందని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలిచ్చే బాధ్యత అప్పగించారని ఎవ్వరికీ తెలియదు. డిసెంబరు రెండో వారంలో ఒక సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ ఒక సమావేశంలో చెప్పిన తర్వాతే బీసీజీవిషయం బయటపడింది. చివరికి... బీసీజీ నివేదిక పీఠికలో గత ఏడాది అక్టోబరు 25వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఎఫ్సీ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌) కోసం నోటిఫికేషన్‌ ఇచ్చిందని, నవంబరు 27న ఎల్‌ఓఏ (ఒప్పంద పత్రం) జారీ చేయడం ద్వారా తనను ఎంపిక చేసిందని తెలిపింది. రాజధాని అంశంపై తగు సూచనలివ్వాల్సిందిగా బీసీజీ కమిటీని తాము కోరినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. కానీ, నిర్దిష్టంగా రాజధాని వికేంద్రీకరణపై అధ్యయనం చేయాల్సిందిగా తమను కోరినందునే దానిపై సూచనలిస్తున్నట్లు బీసీజీ తన తుది నివేదికలో స్పష్టంగా పేర్కొంది! అంటే... ప్రభుత్వం ముందుగానే రాజధాని వికేంద్రీకరణపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చి, అదేమాటను నిపుణుల కమిటీలతో చెప్పించడమే లక్ష్యంగా అడుగులు వేసినట్లు స్పష్టమవుతోంది.

నిశ్శబ్ద పరిశీలన, అధ్యయనం’!
సర్వసాధారణంగా ప్రభుత్వం ఏదైనా అంశంపై అధ్యయనానికి ఏర్పాటు చేసే కమిటీలు... ప్రభావితమయ్యే ప్రాంతాల్లో పర్యటించి, సంబంధిత వ్యక్తులు, నిపుణులతో చర్చించడం రివాజు. పాత రికార్డులను పరిశీలించడం, సమావేశాలను నిర్వహించడం కూడా సహజం. జీఎన్‌ రావు కమిటీ తూతూమంత్రంగానైనా ఈ పని చేసింది. బీసీజీ సంస్థ ఆ మాత్రం కూడా చేయలేదు. రాష్ట్ర ప్రణాళికా శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాలు, సంస్థల వద్ద అప్పటికే సిద్ధంగా ఉన్న మెటీరియల్‌ను తీసుకుని కట్‌ అండ్‌ పేస్ట్‌చేసి, అక్కడక్కడా కొద్దిపాటి మార్పు చేర్పులతో నివేదిక రూపొందించింది. కొన్ని విదేశీ నగరాలతో పోల్చడం ద్వారా అంతర్జాతీయ కలరింగ్‌ఇచ్చింది. గత ఏడాది నవంబరు 27న బీసీజీని ఎంపిక చేయగా... తర్వాత 2 వారాలకే మధ్యంతర నివేదికను ఇచ్చింది. ఆ తర్వాత మూడు వారాల్లోపే తుది నివేదికనూ సమర్పించేసింది. అమరావతికి ముంపు బెడద ఉందంటూ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలకు సాధికారత చేకూర్చేందుకుఅన్నట్లుగా మద్రాస్‌ ఐఐటీ దీనిపై నివేదిక ఇచ్చిందంటూ బీసీజీ ఓ మాట చెప్పింది. కానీ... అలాంటి నివేదిక ఏదీ తాము ఇవ్వలేదని ఐఐటీ మద్రాస్‌ రాజధాని ప్రాంత రైతులకు ఈ-మెయిల్‌లో బదులిచ్చింది. మరోవైపు... అనంతపురంలో వాహన విడి భాగాలు, గోదావరి జిల్లాల్లో ఆహార ప్రాసెసింగ్‌... అంటూ జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలనూ రచించింది.నిజానికి... ఆయా ప్రణాళికలన్నీ గత ప్రభుత్వ హయాంలో మొదలైనవే, ఏదో ఒక దశ వరకు వచ్చినవే! వెరసి... ప్రభుత్వ విభాగాల వద్ద ఉన్న సమాచారాన్నే కాపీ చేసి, పాత ప్రణాళికనే వల్లె వేసి ఐదు వారాల్లో ఈజీగా ఇచ్చేసిన బీసీజీ నివేదిక ఖర్చు రూ.5.95 కోట్లు!

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...