Feb 20, 2020

పార్కింగ్‌ స్థలం లేదా వాహన రిజిస్ట్రేషన్ నో

          
  పార్కింగ్‌కు స్థలం లేకుండా లారీలు, బస్సులు, కార్లు, వ్యాన్లు, ఆటోలు కొనుక్కోవడం మన దేశంలో అందరికీ అలవాటై పోయింది. చిన్న బజారైనా, సందైనా ఆ వాహనాలను ఇంటి ముద్దు పెట్టేస్తారు. అంతే కాకుండా ఇంటి ముందు వాహనం పెట్టుకోవడం తమ హక్కుగా భావిస్తారు. ఒక కారు మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉన్నంత వెడల్పు ఉన్న వీధిలో ఇంటి ముందు కారు పార్కింగ్ చేస్తారు. ఒకళ్లని చూసి మరొకరు అలా పెట్టేస్తున్నారు. చాలా మంది మధ్య తరగతివారు కుక్కని పెంచడం, కారు మెయింటెయిన్ చేయడం స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. కుక్కల్ని పెంచితే పరవాలేదు. కుక్కని కుక్కంటే  వారికి ఎక్కడలేని కోపం వస్తుంది. దానికో పేరుంటుంది.  లక్కీ, టామీ, రాజు....ఆ పేరుతోనే పిలవాలి. అంతేకాకుండా ఆ కుక్కలతో వరస కలుపుతారు. ఇంటిగలవారికి పెంపుడు కుక్క ఉంటే ఆ ఇంట్లో అద్దెకు ఉండేవారిని అంకుల్, ఆంటీ అని పరిచయం చేస్తారు. వారి పిల్లలను అన్న, అక్క అని పరిచయం చేస్తారు. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్లు భరించాలి.  కుక్కల విషయం పక్కన పెడితే వాహనాలదే పెద్ద సమస్య. ఆర్థికంగా అంత స్తోమత లేకపోయినా మహా నగరాలతోపాటు చిన్నచిన్న పట్టణాలలో కూడా పార్కింగ్ ప్రదేశం లేకుండానే వాహనాలు కొనేసి ఇంటి ముందు పెట్టేయడం మనవారికి బాగా అలవాటైపోయింది. ఇళ్ల ముందు మెట్లు రోడ్ల మీదకు కట్టేస్తారు. మళ్లీ ఆ ఇంటి ముందు కారు పెడతారు.   ఇది చాలా పెద్ద సమస్యగా తయారైంది. టూ వీలర్లు పెడితే పరవాలేదు. కార్లు, వ్యాన్లు పెట్టడం వల్ల చాలా పెద్ద సమస్య. కొంతమంది కవర్లు కప్పేసి నెలలకు నెలలు ఇంటి ముందు కార్లు పెట్టేస్తున్నారు.  ఆ వీధిలోకి కార్లు, టూ వీలర్లు కూడా వెళ్లడానికి అవకాశం ఉండదు.  వారికి ఎవరు చెబుతారు? మునిసిపాలిటీ వారా? పోలీసు వారా? లేక ఆ వీధిలోని వారా? ఎవరూ వారికి చెప్పరు. దాంతో వారు వాహనాన్ని ఇంటి ముందు పెట్టుకోవడం వారి హక్కుగా భావిస్తారు. ప్రజలు మాత్రం ఇబ్బందులు పడాలి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్న జ్ఞానం  ఆ వాహన యజమానులకు  ఉండదు. రోడ్డుపై అడ్డంగా ఉందని అంటే ‘‘ మా ఇంటి ముందు పెట్టుకోక ఎక్కడ పెట్టమంటావు?’’ అని ఎదురు ప్రశ్నిస్తారు.  వాదనలతో ఆగకుండా గొడవలు, ఘర్షణలకు కూడా దారితీసిన సంఘటనలు ఉన్నాయి.  వాహనాలను ఎక్కడబడితే అక్కడ పార్కింగ్ చేయవడం వల్ల ఇబ్బందులుపడే వారికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్-ఎన్ జీటీ) ఇటీవల శుభవార్తలాంటి తీర్పు ఇచ్చింది. పార్కింగ్ స్థలాలు లేకపోతే ఢిల్లీ సహా దేశంలోని 122 నగరాల్లో వాహనాలకు రిజిస్ట్రేషన్ చేయవద్దని ఎన్ జీటీ చైర్ పర్సన్ జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం గత సంవత్సరం డిసెంబర్ 20న ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ కోసం వాహనాలపై నియంత్రణ అవసరమని జస్టిస్ ఆదర్శ కుమార్ అభిప్రాయపడ్డారు. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న 122 నగరాల్లో కూడా ఈ నిబంధన అమలు కావాలని ఆదేశించారు. ‘‘పబ్లిక్ స్థలాలు, రహదారులు పార్కింగ్ స్థలాలుగా మారిపోకూడదు. పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా పార్కింగ్ కోసం ముందే ప్రణాళికలు రూపొందించుకోవాలి. నిర్ధేశిత స్థలాల్లో మాత్రమే వాహనాలు నిలుపుదలకు అనుమతించాలి. ఇందు కోసం ట్రాఫిక్ పోలీసులు సహా చట్టబద్దమైన సంస్థలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.’’ అని ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ నగరం అత్యంత కలుషితమైపోయింది. గాలి నాణ్యత లోపించి, ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్న 122 నగరాల్లో పార్కింగ్ స్థలాలను గుర్తించి అక్కడ ఎన్ని వాహనాలను నిలిపేందుకు అవకాశం ఉందో తెలపాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా శాఖ అధికారులను ధర్మాసనం కోరింది. తగిన పార్కింగ్ స్థలాలు అందుబాటులో లేని నగరాలలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం పెంచమని కూడా సలహా ఇచ్చింది. ఏ నగరంలోనై పార్కింగ్ స్థలాలు అందుబాటులో ఉన్నంతవరకే వాహనాల సంఖ్యని పరిమితం చేయాలని కూడా సూచించింది. చాలా రకాల సమస్యలకు ఇది పరిష్కారం. పౌరులలో క్రమశిక్షణ, ఎదుటివారికి అసౌకర్యం కలిపించకూడదని, తనకి ఉన్న హక్కులే ఎదుటివారికి కూడా ఉంటాయన్న జ్ఞానంలేకపోవడం వల్లే ఎక్కవ సమస్యలు తలెత్తుతున్నాయి.  పర్యావరణ పరిరక్షణకు, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఈ ధర్మాసనం ఆదేశాలను అధికారులు చిత్తశుద్ధతో అమలు చేయవలసిన అవసరం ఉంది.
-     శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్ - 9440222914

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...