Feb 3, 2020

రాజధాని అమరావతి – మూడు రాజధానులు



            రాజధాని లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఎటువంటి వివాదాలకు తావులేకుండా అమరావతిని ఎంపిక చేశారు. దానిని ప్రతిపక్షం, అధికార పక్షం, అన్ని ప్రాంతాల ప్రజలు ఆమోదించారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం నియమించిన శివరామకృష్ణణ్  కమిటీ ముందు కూడా రాష్ట్రం నలుమూలల నుంచి అత్యధిక మంది ప్రజలు విజయవాడ-గుంటూరు మధ్యలోనే రాజధాని కావాలని కోరారు. మొత్తం 4,728 మంది తమతమ అభిప్రాయాలు తెలియజేయగా, వారిలో 2191 మంది విజయవాడ-గుంటూరు మధ్యలోనే రాజధాని ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొని గత ప్రభుత్వం శాసనసభలో అమరావతిని రాజధానిగా తీర్మానించింది. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న బీజేపీతోపాటు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. చంద్రబాబు నాయకత్వంలో ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది.   ఈ పరిస్థితులలో ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి వినయంగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నవరత్నాలు, ప్రత్యేక హోదా సాధిస్తాం అని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించి గెలిచాడు. గెలిచిన తరువాత అతని కుట్రని, కక్షని, కుళ్లుని బహిర్గతం చేస్తూ విశ్వరూపంతో రాక్షస పాలనకొనసాగిస్తున్నాడు. విచిత్రంగా, వికృతంగా తుగ్లక్ లా రాజధానిని మూడు ముక్కలు చేయడానికి పూనుకున్నాడు. ఐక్యంగా ఉన్న రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టి  ప్రాంతీయ తత్వాన్ని ప్రేరేపిస్తున్నాడు. 29 గ్రామాలకు చెందిన 28,538 మంది రైతులు ముందుకు వచ్చి 34,395 ఎకరాలు రాజధానికి స్వచ్ఛందంగా ఇచ్చారు. 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని తమ ప్రాంతంలో వస్తుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెంది, తమ బిడ్డల భవిష్యత్ బాగుంటుందన్న ఆశతో రైతులు భూములు ఇచ్చారు.  ఇప్పుడు ఆ రైతులను ఈ ప్రభుత్వం వేధించడం మొదలు పెట్టింది. మంత్రుల చేత వారిని అవహేళన చేసే విధంగా మాట్లాడిస్తున్నాడు. చారిత్రకంగా ఎంతో పేరు కలిగిన ఆంధ్రుల రాజధాని అమరావతి ప్రాంతాన్ని కూడా కించపరిచే విధంగా ఎడారి, శ్మశానం అని మాట్లాడిస్తున్నాడు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని ఆందోళన చేస్తున్న మహిళలు, రైతులపైన అమానుషంగా ప్రవర్తిస్తున్నాడు. మహిళలని కూడా చూడకుండా పోలీసుల చేత కొట్టిస్తున్నాడు. నియంతలా వ్యవహరిస్తున్నాడు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశాడు. భయానక వాతావరణం సృషించాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధానిగా అమరావతిని కోల్పోవడం అంటే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతకంటే దురదృష్టకరమైనది మరొకటి ఉండదు.
                      ఇప్పటికే ఇక్కడ నిర్మించిన సచివాలయం, శాసనసభ, మండలి, హైకోర్టు భవనాలు, రోడ్లు, కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం, 29 గ్రామాలలో ఇళ్లు లేని పేదలకు 5,024 ఫ్లాట్లు,  నిర్మాణంలో ఉన్న ఎయిమ్స్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉద్యోగుల గృహసముదాయాలను చూసి ఈ ప్రాంత రైతులు తమ కలలు ఫలిస్తున్నాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆనందించారు. ఎన్నికల ముందు వరకు అమరావతిలో 29 గ్రామాలతోపాటు విజయవాడ-గుంటూరు మధ్యన నిర్మాణ రంగం ఊపందుకుంది. లక్షల మంది నిర్మాణ నిపుణులు, కార్మికులతో ఈ ప్రాంతం అంతా కళకళలాడుతూ ఉండేది. ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు రంగంలో వందల భవనాల నిర్మాణం జరుగుతూ ఉండేది. విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీల నిర్మాణం పూర్తి అయి తరగతులు కూడా నిర్వహిస్తున్నారు.  అమృత యూనివర్సిటీతోపాటు మరికొన్ని ప్రైవేటు సంస్థల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి.   రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇంజనీర్లు, నిర్మాణ రంగ నిపుణులు, కూలీలు ఇక్కడ  ఉపాధి పొందారు. దాదాపు పది వేల కోట్ల రూపాయల వ్యయంతో అమరావతి ఎంతో అభివృద్ధి చెందుతోంది. కొత్త ప్రభుత్వం ఒక్కసారిగా పనులు నిలిపేయడంతో నిపుణులు, కార్మికులు ఎటువారు అటు వెళ్లిపోయారు. మన రాష్ట్రం వారు కూడా పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లారు. ఆ ప్రభావం ప్రైవేటు రంగంలోని నిర్మాణాలపై పడింది. ఆ రంగం కుదేలైపోయింది. దానికి చావు దెబ్బతగిలింది.  రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల పెట్టుబడిదారులు ఒక్కొక్కరుగా వెనక్కు వెళ్లిపోతున్నారు.  అన్ని రకాలుగా ఈ ప్రాంతం అథోగతిలోకి కూరుకుపోయింది. అన్ని రకాల వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయింది. ప్రజల జీవనం అతలాకుతలం అయిపోయింది.  ముఖ్యంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది.  చట్టబద్దతలేకుండా రాష్ట్ర ప్రభుత్వం జీఎన్ రావు, బోస్టన్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీలు ఇచ్చిన తూతూమంత్రం నివేదికలతో రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నట్లు ప్రకటించి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించింది.
                పరిపాలనా రాజధాని విశాఖలో పెట్టడం వల్ల అక్కడి వాతావరణ పరిస్థితులతోపాటు ప్రజలకు అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. హుధూద్ తుపాను వల్ల విశాఖకు రూ.22వేల కోట్లు నష్టం వాటిల్లింది. నీటి లభ్యత లేదు. వాతావరణ పరిస్థితులతోపాటు  సముద్ర తీరం, నక్సల్స్ ప్రాభావం ఉన్న రాష్ట్రాలకు దగ్గరగా ఉండటం,  ఇతర రక్షణ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. రాజధాని అనేది శాశ్వితమైనది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్చేది కాదు.  ఎన్నో అంశాలను దృష్టిలోపెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. అమరావతిని ఆ విధంగానే నిర్ణయించారు. అభివృద్ధి వికేంద్రీకరణను దృష్టిలోపెట్టుకొని చూసినా ఇప్పటికే విశాఖ ప్రాంతం ఉక్కు ఫ్యాక్టరీ, నేవీ, పోర్ట్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు  ఆంధ్ర విశ్వవిద్యాలయం వంటి వాటితో ఎంతో అభివృద్ధి చెందింది. సచివాలయం కూడా అక్కడ పెడితే జన సాంద్రత పెరిగిపోయి ప్రజల జీవనానికి ఇబ్బందులు ఎదురవుతాయి. విశాఖలో ఉన్న మాదిరిగా కేంద్ర ప్రభుత్వ భారీ సంస్థలు కృష్ణా, గుంటూరు జిల్లాలలో లేవు. రాజధాని ఇక్కడే అటు ఆరు జిల్లాలు, ఇటు ఆరు జిల్లాలతో రాష్ట్రానికి మధ్యలో కొనసాగిస్తే ఈ ప్రాంతం దానంతటదే అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై పెట్టడానికి అవకాశం ఉంటుంది. విశాఖలో సచివాలయం పెట్టడం వల్ల రాయలసీమ వాసులకు హైదరాబాద్ ను మించిన దూరం అవుతుంది. హిందూపురం నుంచి హైదరాబాద్ కు 464 కిలో మీటర్లు, విశాఖకు 915 కిలో మీటర్లు. కుప్పంకు 950 కిలోమీటర్లు.  రాయలసీమ జిల్లావాసులకు సచివాలయం దూరాభారం అవుతుంది. వారికి ఇదో కొత్త సమస్య వచ్చి పడింది. ఇటువంటి సమస్యలు ఏమీ లేకుండా అన్నివిధాల సౌకర్యవంతంగా ఉన్న అమరావతి నుంచి సచివాలయాన్ని మార్చడం సమంజసం కాదు. ఈ మార్పు వల్ల అనేక చట్టపరమైన సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.
                 నెల రోజులకు పైగా అఖిల పక్షం ఆధ్వర్యంలో  రైతులు, ప్రజలు చేస్తున్న ఆందోళనలు పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నియంతృత్వ ధోరణిలో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘జగన్మోహన్‌రెడ్డిగారూ! చిన్నవాడివైనా రెండు చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మూడు రాజధానులు ఎక్కడా రాణించలేదు. అమరావతిని కొనసాగించాలి’’ అని వేడుకున్నా వినలేదు. శాసనసభలో 175 స్థానాలకు వారికి 151 స్థానాలు ఉండటంతో ఆ బిల్లులు ఆమోదం పొందాయి. శాసన మండలిలో 53 స్థానాలకు  టీడీపీకి 29 మంది సభ్యులు ఉండటం, బీజేపీ, పీడీఎఫ్ సభ్యులు మద్దతు, అది పెద్దల సభ అయినందున అక్కడ ఆ బిల్లులను చర్చించి సెలెక్ట్ కమిటీకి పంపారు. సెలెక్ట్ కమిటీకి పంపడం ద్వారా బిల్లులు ఆమోదం పొందడానికి అయ్యే ఆలస్యాన్యి వైసీపీ వారు భరించలేకపోయారు.   ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏకంగా జనవరి 27న శాసన మండలినే రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేసింది.  
-----------------------------




No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...