Feb 5, 2020


50 రోజుల రైతు పోరాటం
రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దని ప్రజా రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పోరాటం 50 రోజులకు చేరింది. ప్రభుత్వంలో మాత్రం చలనం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి కక్షపూరితంగా ఉన్మాద దోరణిలో తాను అనుకున్నది తాను చేసుకుంటూ పోతున్నాడు. ఇటు రైతుల ఆందోళనను గానీ, అటు న్యాయస్థానాల హెచ్చరికలను గానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రశాతంగా ఉన్న రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు, కుల చిచ్చు పెట్టి అలజడి, ఆందోళనలు సృష్టించాడు. రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. దయనీయ పరిస్థితులలో రాష్ట్రం విడిపోయినా అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, ఆర్థికంగా ప్రగతిపథంలోకి తీసుకువెళ్లారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని, నవరత్నాలు, ఒక్క ఛాన్స్ అని వినయంగా ఎన్నికల ముందు వేడుకొని అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చావు దెబ్బతీశాడు. రాష్ట్రాభివృద్ధిని 20 ఏళ్లు వెనక్కు నెట్టేశాడు.
అమరావతి ప్రాంత రైతులు 5 కోట్ల ఆంధ్రులను భవిష్యత్ ని దృష్టిలోపెట్టుకొని తమ ప్రాంతంలో రాజధాని వస్తే తమ బిడ్డల భవిష్యత్ బాగుపడుతుందన్న ఆశతో 28,538 మంది రైతులు తమ జీవనాధారమైన 34,395.50 ఎకరాలను స్వచ్ఛందంగా రాజధాని కోసం ఇచ్చారు. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా ఇన్ని వేల ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇవ్వలేదు. చరిత్రలో నిలిచిపోయేటటువంటిది వారి త్యాగం. అటువంటి త్యాగాలు చేసిన రైతులు ఈ రోజున రోడ్డున పడ్డారు. భూములు ఇచ్చిన వారిలో అత్యధిక మంది దళితులు, బీజీలు, పేదలే ఉన్నారు. ఈ ప్రభుత్వం వారి మధ్య కూడా కులా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇన్ సైడర్ ట్రేడింగ్, ఒక సమాజికవర్గం వారే భూములు కొన్నారని చెప్పిందే చెప్పుకుంటూ వస్తోంది.
         ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రాజధానిని మూడు ముక్కులు చేయనున్నట్లు సీఎం జగన్ ప్రకటించడంతో రాజధాని ప్రాంత ప్రజలతోపాటు భూములిచ్చిన రైతులలో ఒక్కసారిగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ముందు రైతులలో స్పందన వచ్చినప్పటికీ రోజు గడుస్తున్న కొద్ది కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు మిగిలిన 11 జిల్లాలలో కూడా మూడు రాజధానుల పట్ల వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రారంభంలో రాజధానిలోని 29 గ్రామాలకు చెందిన మహిళల పాత్ర ఉద్యమంలో కీలకంగా ఉంది. వారి ఆవేదనను వివిధ రూపాలలో వ్యక్తం చేశారు. నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డితోపాటు అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా అంగీకరిస్తూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. కేంద్ర నిధులు కూడా సమకూరుస్తోంది.  శాసనసభ, మండలి, సచివాలయ, హైకోర్టు భవనాలు, ఏపీఐఐసీ భవనం వంటివాటిని నిర్మించారు. పేదలకు 5024 ఇళ్లు నిర్మించారు. రోడ్లతోపాటు   గత ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లు, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 8 నెలల నుంచి ఇక్కడే ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. దాదాపు పదివేల కోట్ల రూపాయలతో న్యాయమూర్తులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేంద్ర సర్వీసులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉద్యోగుల వసతి గృహ సముదాయాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఎయిమ్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రైవేటు రంగంలో కూడా అనేక నిర్మాణాలు పూర్తి అయ్యాయి. ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. సకల సదుపాయాలు, మౌలిక వసతులు సమకూర్చుకుంటున్న అమరావతి రాష్ట్రం నడిబొడ్డున, నది ఒడ్డున అందరికీ అందుబాటులో ఉంది. ఈ పరిస్థితులలో అర్ధంతరం రాజధానిని విశాఖకు తరలిస్తారనేసరికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. దాదాపు 48 వివిద ప్రజా, వ్యాపార సంఘాలతో అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటైంది. అమరావతి రాజధానిగా కొనసాగాలని పోరాటం చేస్తోంది. దాంతో అన్ని జిల్లాలకు ఉద్యమం విస్తరించింది. 13 జిల్లాల్లో శాఖలు ఏర్పాటు చేశారు. ఒక్క వైసీపీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీల వారందరూ అమరావతి పరిరక్షణ సమితితో కలిసి పోరాడుతున్నారు. ఉద్యమం రోజురోజుకు ఊపందుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు వచ్చి రాజధాని రైతులకు మద్దతు తెలుపుతున్నారు.  రాజధానిని తరలిస్తున్నారని తెలిసి ఆ గ్రామాలకు చెందిన ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు, రైతు కూలీలు   మనోవేదనతో 37 మంది గుండె ఆగి మృతి చెందారు.   రైతులు, మహిళలతోపాటు అన్ని వర్గాల వారు, అన్ని ప్రాంతాల వారు ఉద్యమంలో పాల్గొంటున్నారు.
ఒక రాష్ట్రం- ఒకే రాజధాని, పరిపాలనను కాదు  అభివృద్ధిని వికేంద్రీకరించాలి, మూడు రాజధానుల మాట ఉపసంహరించుకోవాలి, ప్రాణాలైనా అర్పిస్తాం. అమరావతిని కాపాడుకుంటాం, మా త్యాగాలకు విలువ లేదా?,         మేం భూములు ఇచ్చింది ప్రభుత్వానికే గానీ పార్టీలకు కాదు, పార్టీలతో మాకు సంబంధం లేదు, మాది  రాజధాని పార్టీ మాత్రమే అని వారు నినదించారు.  ఇక్కడి వారికి మద్దతుగా  ఇతర రాష్ట్రాలతోపాటు  విదేశాలలో కూడా ప్రదర్శనలు చేస్తూ మద్దతు ప్రకటిస్తున్నారు. రాజధాని గ్రామాలలో రోజుకో విధంగా రైతులు, మహిళలు ఆందోళన చేస్తున్నారు. బంద్ లు చేస్తున్నారు. రోడ్లపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. రోడ్లపై బైఠాయిస్తున్నారు. దాంతో బెంబేలెత్తిపోయిన ప్రభుత్వం, పోలీసులు రైతులు, ఉద్యమకారులపై చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఉద్యమాన్ని అణచడానికి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. లాఠీ ఛార్జీ చేసి రక్తం కారేవిధంగా కొట్టారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు అని కూడా చూడకుడా చితకబాదారు.  144 సెక్షన్, సెక్షన్ 30 ప్రవేశపెట్టి వారిని నానా విధాలుగా హింసిస్తున్నారు. వేధిస్తున్నారు. ఆ గ్రామస్థులు తమ గ్రామంలో అడుగుపెట్టాలన్నా గుర్తింపు కార్డులు చూపించుకోవలసిన దుస్థితి దాపురించింది. అమ్మవారి గుడికి మొక్కులు తీర్చుకోవడానికి వెళ్లే మహిళలను కూడా అడ్డుకొని రక్తం కారేటల్లు కొట్టారు. విజయవాడలో షాపింగ్ కు వచ్చిన మహిళలను కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ వ్యాన్లు ఎక్కించారు.   ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం పోలీసుల ద్వారా, కడపలోని ప్రైవేటు వ్యక్తుల ద్వారా చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉంది. ఉద్యమకారులు వేసిన టెంట్లను తగులబెట్టారు. వైసీపీ మంత్రులు, నేతలు  రైతులను పెయిడ్ ఆర్టిస్టులని చాలా హీనం చేసి మాట్లాడారు. వారి త్యాగాన్ని కించపరుస్తూ అవహేళన చేశారు.   చివరకు అమరావతి పరిరక్షణ సమితి కార్యాలయాన్ని ప్రారంభించడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఘటనలపై జాతీయ మహిళా కమిషన్ వచ్చి విచారించినా, హైకోర్టు చివాట్లు పెట్టినా ప్రభుత్వంలో గానీ, పోలీసులలో గానీ మార్పులేదు.
ఛలో అసెంబ్లీ పిలుపుకు స్పందించి తరలి వచ్చిన రైతులపై పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు. లాఠీలతో చావబాదారు. మహిళలని కూడా చూడకుండా కొట్టారు. ఓ పక్క రాష్ట్ర వ్యాప్తంగా అమరావతిని తరలించవద్దని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం శాసనసభలో అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది. నిరసన తెలుపుతూ ఆందోళన చేస్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ లను అదుపులోకి తీసుకొని అర్ధరాత్రి వరకు గతుకుల రోడ్లలో తిప్పి మంగళగిరిలో వదిలిపెట్టారు. నిరసన తెలియజేస్తున్న ఎంపీ గల్లా జయదేవ్‌ని పోలీసులు ఒక రాత్రంతా అలాగే తిప్పారు. సూదులతో పొడిచారు. చేతులు వెనక్కు మడిచి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారు.
ఈ రెండు బిల్లులను శాసన మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపారు. దానికి కూడా ప్రభుత్వం తట్టుకోలేకపోయింది. 20 మంది మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు శాసనమండలిలోలో, గ్యాలరీలలో కూర్చొని నానా రచ్చ చేశారు. మండలి చైర్మన్‌ని మతం పేరుతో దుర్భాషలాడారు. చివరికి శాసనసభలో బలం ఉందిగదా అని శాసన మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేశారు. ప్రభుత్వం పరిస్థితి అంత దారుణంగా ఉంది. ప్రభుత్వ కార్యాలయాలను తరలించవద్దని, అలా తరలిస్తే అందుకు అయ్యే ఖర్చుని ఆయా శాఖల అధికారుల నుంచి వసూలు చేస్తామని హైకోర్టు హెచ్చరించినా విజిలెన్స్‌ కమిషనరేట్‌కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇంత చేస్తున్నా మరో పక్క రాజధానిని అమరావతి నుంచి తరలించడంలేదని వైసీపీ నేతలు బుకాయిస్తుంటారు.
అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చడానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది.  అనేక విధాల అడ్డదారులు తొక్కుతోంది. పచ్చి అబద్దాలు చెబుతోంది. దళితులు ఉద్యమంలో పాల్గొనకుండా చేయడానికి నానా తంటాలు పడుతోంది. రైతులకు ఇచ్చే కౌలు పరిహారాన్ని పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచారు. రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్‌ని రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచారు. రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎంపీలను రైతుల వద్దకు రాయబారం పంపుతోంది.  ప్రభుత్వం ఎన్ని చేసినా రైతులు ఆందోళనను విరమించడంలేదు. ఇంకా ఉధృతం చేస్తున్నారు. రాష్ట్రానికి ఒకటే రాజధాని అదే అమరావతిని అనే విషయంలో రాజధాని రైతులతోపాటు అమరావతి పరిరక్షణ సమితి, ప్రతిపక్షాలు, న్యాయవాదులు, వివిధ వర్గాల ప్రజలు ఒకే తాటిపై ఉన్నాయి. శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తున్నారు.  రాజధాని అమరావతి కోసం ఖండాంతరాల్లోనూ ప్రవాసాంధ్రులు ఆందోళన చేశారు.   సేవ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అమెరికాలోని కాలిఫోర్నియాహ్యూస్టన్ఒమాహకాన్సస్ సిటీపోర్ట్ ల్యాండ్‍, అట్లాంటాసెయింట్ లూయిస్డెట్రాయిట్బోస్టన్బాల్టిమోర్చార్లట్ర్యాలీమిన్నియాపోలిస్కొలంబస్డల్లాస్‌లతోపాటు లండన్ లో కూడా  ఫ్లకార్డులు పట్టుకొని ప్రదర్శనలు నిర్వహించారు.
ప్రజలు కూడా ప్రజాస్వామ్య పద్దతిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. ఉద్యమం అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు వ్యాపించినా ప్రభుత్వంలో మార్పు రానందున ఉద్యమాన్ని ఇంకా విస్తృతం, ఉధృతం చేయవలసిన అవసరం ఉంది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...