Feb 6, 2020


మిలీనియం టవర్స్‌ ఖాళీ చేయించే పత్రాలు జతచేయండి
 పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 6: విజిలెన్స్‌ కమిషనర్‌, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వయిరీస్‌ కార్యాలయాలను కర్నూలుకు తరలిస్తూ జారీ చేసిన జీవోతోపాటు, విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌-బి నిర్మాణ పనుల కోసం రూ.19.73 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం మిలీనియం టవర్స్‌లో ఉన్న ఐటీ ఉద్యోగులను ఖాళీ చేయిస్తున్నారన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యలతో కూడిన ధర్మాసనం.. ఆ పత్రాలను పిటిషన్‌కు జత చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
 కర్నూలుకు కార్యాలయాల తరలింపు చట్టవిరుద్ధమని, రాజధాని నగర నిర్మాణ పనులు మధ్యలో నిలిపేశారంటూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఎం.రమేష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. రాజధానిలో 10,500 కోట్లకు పైగా ప్రభుత్వం వ్యయం చేసిందని, ఎలాంటి లిఖితపూర్వక ఆదేశాలు లేకుండానే రాజధానిలో అభివృద్ధి పనుల్ని నిలిపేసిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులు పెండింగ్‌లో ఉండగా కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. మిలీనియం టవర్‌లో ఉన్న 24 వేల మంది ఐటీ ఉద్యోగులను ఖాళీ చేయిస్తున్నట్లు తనకు వాట్సాప్‌ దారా సమాచారం వచ్చిందని, కార్యాలయాల తరలింపుపై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలతో పాటు వ్యక్తిగత హోదాలో సీఎం జగన్‌, డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, మంత్రులు బొత్స, బుగ్గన, కన్నబాబు, సీఎస్‌ ఎన్‌.సాహ్ని, సీఎం సలహాదారు అజయ్‌కల్లం తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
 రోహత్గీ నియామకంపై మరో పిటిషన్‌
రాజధాని వ్యవహారంపై వాదనలు వినిపించేందుకు మాజీ అటార్నీ జనరల్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీని నియమించడంతోపాటు, రూ.5 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్లతో కలిపి దీన్ని విచారిస్తామంటూ ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...