Feb 3, 2020

అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు తీర్మానం



20.01.2020 : మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఏపీ శాసనసభ ఆమోదించింది. కర్నూలులో హైకోర్టు, అమరావతిలో శాసనసభ, విశాఖలో సచివాలయం, రాజ్ భవన్, హెచ్‌వోడీలను ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి బిల్లు -2020,  సీఆర్డీఏ రద్దు బిల్లు  పెట్టింది. రెండు బిల్లులు సభలో ఆమోదం పొందాయి. ఉదయం 11 గంటలకు మొదలైన అసెంబ్లీ రాత్రి 11 గంటల వరకు... అంటే సరిగ్గా 12 గంటలపాటు సాగింది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ విపక్ష టీడీపీ... మూడు రాజధానులే ముద్దు అంటూ అధికారపక్షం వైసీపీ సభ్యులు హోరాహోరీగా తమ వాదనలు వినిపించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్:  రాజధానిని ఎక్కడికీ తరలించడంలేదు. అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది. దీనికి అదనంగా మరో రెండు రాజధానులను ఏర్పాటు చేస్తున్నాం. అమరావతి సహజమైన వేగంతో బ్రహ్మాండమైన నగరంగా అభివృద్ధి చెందుతుంది’’. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలా? అవన్నీ పక్కనపెట్టి ఒక్క అమరావతినే నిర్మించాలా?  నా వరకు నాకు రెండూ చేయాలని ఉంది. కానీ, అమరావతిని నిర్మించే ఆర్థిక శక్తి లేదు. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయకపోతే భవిష్యత్తు లేదు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు: జగన్మోహన్‌రెడ్డిగారూ! చిన్నవాడివైనా రెండు చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మూడు రాజధానులు ఎక్కడా రాణించలేదు అమరావతిని కొనసాగించాలి. అడుగడుగునా మంత్రులు, అధికారపక్ష సభ్యులు అడ్డు తగిలినా ఆయన తన ప్రసంగం కొనసాగించారు. రాష్ట్రానికి ఒక్క రాజధానే ఉండాలని టీడీపీ సిద్ధాంతమని, అమరావతిని రాజధానిగా నిర్ణయించామని.. ప్రధాని మోదీ, కేసీఆర్‌ కూడా ప్రశంసించారు. అమరావతికి ఇప్పటి వరకు 130 సంస్థలు వచ్చాయి. నిర్మాణానికి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. కామధేనువులా ఉపయోగపడుతుంది. ప్రస్తుతమున్న అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టులో కార్యక్రమాలు కొనసాగించుకుంటే.. ఆదాయం వచ్చినప్పుడు శాశ్వత భవనాలు నిర్మించుకోవచ్చు. తానీ భవనాలను టెంపరరీ అనలేదని, ట్రాన్సిట్‌ భవనాలని మాత్రమే అన్నాను.  అది అర్థం కాక తాత్కాలిక రాజధాని అన్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారు.  జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి నాపై రాజకీయంగా దాడి చేసినా.. నా తర్వాత సీఎం అయినప్పుడు నేను మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేశారు. జగన్ ఈ రాష్ట్రానికి 17వ ముఖ్యమంత్రి. చరిత్రలో ఏ సీఎం అయినా రాజధానిని మార్చాలని చూశారా? రాయలసీమ వాళ్లు 24 గంటలు ప్రయాణం చేసి విశాఖ వెళ్లాలంటే సాధ్యమా?


మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు  బిల్లులకు శాసనసభలో ఆమోదం
20.01.2020 : ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రవేశపెట్టిన ఏపీలో 3 రాజధానుల బిల్లుకు శాసనసభ అమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం పాలనా రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయి.
v లోకల్ జోన్లు, జోనల్ డెవలప్‌మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాలని వికేంద్రీకరణ బిల్లులో ప్రతిపాదించారు.
v పరిపాలన సంబంధిత వ్యవహారాలు మొత్తం విశాఖ నుంచి జరుగుతాయి. రాజ్ భవన్, సచివాలయం, విభాగాల అధిపతుల(హెచ్‌వోడీ) కార్యాలయాలు విశాఖలో ఏర్పాటు. శాసన కార్యకలాపాలన్నీ అమరావతిలోనే సాగుతాయి. న్యాయ సంబంధిత కార్యకలాపాలు మొత్తం కర్నూల్ నగరం నుంచి జరుగుతాయి.
v న్యాయవ్యవస్థ ఆమోదం తెలిపిన తర్వాత అమరావతి నుంచి కర్నూలుకు హైకోర్టు తరలింపు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేయాలని ప్రతిపాదన.
v  సీఆర్డీఏ రద్దు బిల్లును పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు.  సభ్యులు  ఆమోదం తెలపండంతో బిల్లు పాసయినట్లు  స్పీకర్‌ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. ఎలాంటి ఓటింగ్ లేకుండానే సభలో ఈ రెండు బిల్లు పాస్ అయ్యాయి.
మంత్రి మండలి సమావేశం: రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లింపు కాలాన్ని ప్రస్తుతమున్న పదేళ్ల నుంచి 15 ఏళ్లకు కేబినెట్ పెంచింది. ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ పదేళ్లపాటు కౌలు చెల్లించాలనే గత నిర్ణయాన్ని సవరించింది. భూమి లేని పేదలకు పెన్షన్ రూ.2500 నుంచి 5 వేలకు పెంచాలని నిర్ణయం. దీని వల్ల 21 వేల కుటుంబాలకు మేలు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి : శివరామ కృష్ణన్ కమిటీ కూడా, విభజన తర్వాత ఏపీ అభివృద్ధి ఒక చోట కేంద్రీకృతం చేయవద్దని చెప్పింది. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూముల వివరాలు అప్పటి ప్రభుత్వం ఇవ్వలేదు. కృష్ణ, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో ఆహార దాన్యాగారాలను పాడు చేయొద్దని కమిటీ చెప్పింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో మల్టీ క్యాపిటల్ జోన్స్ ఏర్పాటు చేయాలని శివరామకృష్ణన్ సూచించారు. చంద్రబాబు నిర్ణయంతో ఆయన నిస్పృహకి గురయ్యారు. 'రాజధానిలో కనీస సౌకర్యాలను కూడా చంద్రబాబు ఏర్పాటు చేయలేకపోయారు. మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కోసం ఎకరానికి 2 కోట్ల చొప్పున లక్ష కోట్ల అంచనాలు వేశారు. 8 కిలో మీటర్ల వ్యాసంలో 53 వేల ఎకరాలలో మౌలిక సదుపాయాల కోసమే లక్ష కోట్లు అవసరం అని చంద్రబాబు చెప్పారు. అప్పట్లో నాలుగైదు లక్షల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పిన సీఎం ఇప్పుడు మాట మార్చారు. 14 వేల కోట్లతో కొత్త సచివాలయం కోసం టెండర్లు పిలిచారు. రాజధాని కోసం ఐదేళ్లలో రూ. 5676 కోట్లు మాత్రమే చంద్రబాబు ఖర్చు పెట్టారు. బకాయిలు రూ. 2297 కోట్లు చెల్లించకుండా చేతులు ఎత్తేశారు. ఏడాదికి 1200 కోట్లు చొప్పున ఖర్చు పెడితే చంద్రబాబు గ్రాఫిక్ రాజధాని నిర్మాణానికి 100 ఏళ్ళు పడుతుంది. అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆపేసి ఐదు రెట్ల వేగంతో పని చేస్తే 20 ఏళ్ళలో పూర్తి అవుతుంది.
కృష్ణా, గుంటూరు జిల్లాలో 33 మంది ఎమ్మెల్యేలలో 29 మందిని ప్రజలు గెలిపించారు. రాజకీయాలలో నిజాయితీ, చిత్తశుద్ది, మంచి చేయాలనే ఆలోచన ఉండాలి. ఆర్థికంగా గడ్డు కాలంలో 8 కి.మీ కోసం లక్ష కోట్లు ఖర్చు చేయడం సమంజసమేనా. అమరావతి అభివృద్ధి కోసం అన్ని విధాలుగా సహకరిస్తాం. దాని టైం దానికి ఇస్తే ఇది మహా నగరం అవుతుంది. మనకు ఉన్న తక్కువ డబ్బుతో రాష్ట్రానికి మేలు చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నాం.
విజయవాడ, గుంటూరులో 2 వేల కోట్లు ఖర్చు చేస్తే ఇంతకు ముందున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి చేస్తాం. రూ.1100 కోట్లు ఇస్తే తాడేపల్లి, మంగళగిరి చక్కగా అభివృద్ధి చెందుతాయి. నా ఇల్లు కూడా అక్కడే ఉంది. కృష్ణా నది మీద వెళుతుంటే పరిస్థితి చూసి నాకు బాధ కలిగి రిటైనింగ్ వాల్‌కి వెంటనే డబ్బులు ఇచ్చాను. ప్రతి జిల్లాలో కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం మీద నాకు ఎలాంటి కోపం, ద్వేషం లేదు. ఆర్థిక వ్యవస్థ అవకాశాల ఆధారంగా నడుస్తుంది. మన వనరులు ఆధారంగా ప్రాధాన్యతలు ఉండాలి. ప్రజల్ని భ్రమల్లో ఉంచాల్సిన అవసరం లేదు. మరో బాహుబలి డైరెక్టర్‌ని భ్రమరావతి చేస్తా అంటూ తీసుకొచ్చి ప్రజలను మోసం చేయలేక నిజం చెబుతున్నా. లక్షా పది వేల కోట్లలో పదో వంతు ఖర్చు చేసినా పదేళ్ళలో అయినా హైదరాబాద్‌తో పోటీ పడగలం. మన పిల్లలకు అప్పుడైనా అవకాశాలు కల్పించగలుగుతాం. ఇక్కడే ఉంటే ఐదేళ్ల తర్వాత మన పిల్లలకు, రాష్ట్రానికి ఏమి అవకాశాలు ఇవ్వగలమో ఆలోచించుకోవాలి. ఇక్కడ చేయడానికి శక్తి చాలదు, అక్కడ చేయకపోతే అవకాశాలు ఏమి ఉండవు. ఐదేళ్ల తర్వాత ఇక్కడే డబ్బు ఖర్చు చేస్తే మన పిల్లలు ఉద్యోగాల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు పోవాలి. బాధ్యతగా నిర్ణయాలు తీసుకోకపోతే మనం పూర్తిగా నష్టపోతాము. చంద్రబాబుకి తాను కొనుగోలు చేసిన భూముల మీదే ధ్యాసంతా ఉంది. రాజధాని ఎక్కడికి పోదు, ఇక్కడే అసెంబ్లీ ఉంటుంది, ఇక్కడే చట్టాలు చేస్తాం. అమరావతితో పాటు ఇతర ప్రాంతాలకు అభివృద్ధి చేస్తాము. ఇక్కడ న్యాయం చేస్తూ, మిగిలిన ప్రాంతాలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మాకుంది. రైతులు ఏ విధంగానూ నష్టపోయే పరిస్థితి తీసుకురాము. భూమి లేని పేదలకు 5 వేల పెన్షన్ ఇవ్వడం వల్ల 21 వేల కుటుంబాలకు మేలు కలగనుంది. అసైన్డ్ భూములు అన్నిటికి పట్టా భూములలో సమానంగా పరిహారం, ఫ్లాట్‌లు ఇస్తాం. సహజ సిద్ధంగా జరగాల్సిన అభివృద్ధి అమరావతిలో జరుగుతుంది.

చంద్రబాబు నాయుడు: ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ రాజధానులు మార్చుకుంటూ వెళ్తే ఎలా?   అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే తప్ప... పాలనా వికేంద్రీకరణ వల్ల అది సాధ్యం కాదు. సభలో నన్ను విమర్శించడానికే సమయం కేటాయించారు. నన్ను విమర్శించినా, ఎగతాళి చేసినా పర్వాలేదు. ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి. అదే మా సిద్ధాంతం. విభజన చట్టంలో ఒక రాజధాని మాత్రమే ఉండాలని ఉంది. మూడు రాజధానుల గురించి ఎక్కడా లేదు. శివరామకృష్ణన్‌ నివేదికలో కూడా ఎక్కడా మూడు రాజధానులు గురించి చెప్పలేదు. 46 శాతం మంది విజయవాడ-గుంటూరు పాంతంపై మొగ్గు చూపారు. తర్వాత విశాఖ. రాజధానిగా విజయవాడ ఉండకూడదని కమిటీ ఎక్కడా చెప్పలేదు.
తనకు అనుకూలంగా ఉన్న అంశాలనే మంత్రి బుగ్గన చదివి వినిపించారు. కమిటీ నివేదికలో చివరికి ఏం చెప్పారనేది ముఖ్యం. భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెదేపా రాజధానిగా విజయవాడ-గుంటూరును ఎంచుకుంది. ముఖ్యమంత్రులు మారిన ప్రతిసారీ రాజధానులు మార్చుకుంటూ పోతారా? ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడుతుంటే ఇక్కడ మాత్రం పరిపాలన వికేంద్రీకరణ గురించి మాట్లాడుతున్నారు. చరిత్ర గురించి తెలియని వారు మాత్రమే దిల్లీ, చెన్నై రాజధానులు గురించి మాట్లాడుతున్నారు. దిల్లీ నడిబొడ్డులోనే పార్లమెంటు ఉంది. మూడు రాజధానుల వల్ల అభివృద్ధి జరగదు. అభివృద్ధి అనేది చేస్తేనే జరుగుతుంది. ‘‘రాజధాని తాత్కాలికం అని ఎప్పుడూ అనలేదు. ట్రాన్సిట్ అసెంబ్లీ అని మాత్రమే చెప్పాను. అసెంబ్లీ భవనం తాత్కాలికం కాదు, విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అని మాత్రమే ఉంది, రాజధానులు అని లేవు. బోస్టన్ కమిటీ రిపోర్ట్ మొత్తం బోగస్. భవిష్యత్‌లో ఐకానిక్ నిర్మాణాలు చేస్తామని చెబితే వైసీపీ వారికి అర్థం కాలేదు.

మంత్రి  బుగ్గన రాజేంద్రనాధ్ : చంద్రబాబు ప్రభుత్వం జూన్‌లో ఏర్పడింది. రాజధానిని డిసెంబరులో ప్రకటించారు.  రాజధాని ప్రకటనకు ముందే ఇప్పుడు రాజధాని ఉన్న ప్రాంతంలో 4070 ఎకరాలను టీడీపీ నాయకులు, వారి బినామీలు కొనుగోలు చేశారు.  అధికారిక సమాచారం ప్రకారం 4070 ఎకరాలు అని, వాస్తవానికి ఇంతకన్నా పెద్ద మొత్తంలో టీడీపీ నాయకులు, బినామీలు భూములు కొన్నారు.  ఇదంతా 'ఇన్‌సైడర్ ట్రేడింగ్'. ఇలా భూములు కొన్నవారిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, పల్లె రఘునాథరెడ్డి, మురళీమోహన్, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, వారి బంధువులు, పుట్టా మహేష్ యాదవ్, లింగమనేని రమేశ్, జీవీ ఆంజనేయులు, వేమూరి రవి కుమార్, వేమూరి ప్రసాద్, యార్లగడ్డ రవికిరణ్, బుచ్చయ్య చౌదరి తదితరులు ఉన్నారు.  లంక భూములు, పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు సహా ఏ భూములనూ వదిలిపెట్టలేదు. ఇది రాజధాని నిర్మాణమా, రియల్ ఎస్టేట్ వ్యాపారమా? బ్రిటిష్ పాలనలో కోట్ల రూపాయల పన్ను వసూళ్లు లండన్ తరలించి మహా సౌధాలు నిర్మించుకున్నారు. భారతీయులు కనీస అవసరాలకు నోచుకోక పోరాటం చేయాల్సి వచ్చింది. ఆధునిక కాలంలో పాలకులు అలాంటి పొరపాట్లు చేయకూడదు. శ్రీ కృష్ణ దేవరాయలు హయాంలో ఎక్కడా పెద్ద కోటలు నిర్మించలేదు, కానీ అప్పుడు తవ్విన చెరువులు ఇప్పటికీ ఉన్నాయి.

పయ్యావుల కేశవ్ : అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ వైకాపా నేతలు ఆరోపణలు చేస్తున్నారు. బినామీ చట్టం కింద బినామీ ఆస్తులను కేంద్ర చట్ట ప్రకారం ప్రభుత్వానికి అటాచ్‌ చేద్దామా? రాజధానిలో ఇల్లు ఉండాలని భూమి కొనడం తప్పా? నా కుమారుల పేరుతోనే అక్కడ భూమి కొన్నాను.  బినామీ పేర్లతో కాదు. మీరు చెబుతున్న బినామీ భూముల జాబితాను కేంద్రానికి పంపి, ఆ భూములు అమ్మి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఇవ్వండి.

17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
అసెంబ్లీ సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వాళ్లలో అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు , నిమ్మకాయల చినరాజప్ప, వాసుపల్లి గణేష్, పయ్యావుల కేశవ్, రామకృష్ణ ప్రసాద్, బాల వీరంజనేయ స్వామి, అనగాని సత్య ప్రసాద్ తదితరులు ఉన్నారు.

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపిన శాసనమండలి చైర్మన్‌
22.01.2020:  పరిపాలన వికేంద్రీకరణ - ప్రాంతాల సమగ్రాభివృద్ధి బిల్లుతోపాటు సీఆర్డీయే రద్దు బిల్లును మండలి చైర్మన్‌ షరీఫ్‌ మొహ్మద్ అహ్మద్ సెలెక్ట్‌ కమిటీకి పంపించారు. రూల్‌ 154 ప్రకారం తనకు లభించిన విచక్షణాధికారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
చైర్మన్‌ నోటి నుంచి ప్రకటన వెలువడిన వెంటనే ఒక మంత్రి సైగ చేయగానే... వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పరుగెత్తుకుంటూ చైర్మన్‌ వద్దకు వెళ్లి ఆయన వద్ద ఉన్న పేపర్లను లాక్కొని ముక్కలు ముక్కలుగా చించారు. మరో వైపు నుంచి మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ చైర్మన్‌ సీటు వద్దకు వెళ్లి రెండు చేతులతో ఆయన కదలకుండా కట్టడి చేశారు. ఈలోపు మంత్రులు అవంతి శ్రీనివాస్‌, కొడాలి నాని టేబుల్‌ పైకి ఎక్కి చైర్మన్‌ ముందు ఉ న్న బల్లను చేతులతో చరుస్తూ ఆగ్రహం ప్రదర్శించారు. బల్లపై ఉన్న శాసన మండలి ప్రొసీడింగ్స్‌ పత్రాలను మంత్రి కొడాలి నాని వెనక్కు విసిరేశారు. మంత్రులు మోపిదేవి, బొత్స, పెద్దిరెడ్డి చైర్మన్‌ ముందు నిలబడి వేలు చూపించి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌, బుద్దా వెంకన్న, నాగ జగదీశ్వర్‌, దీపక్‌రెడ్డి తదితరులు చైర్మన్‌కు రక్షణ వలయంగా నిలబడే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వారికీ, వైసీపీ సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. కొద్ది సేపటి తర్వాత టీడీపీ సభ్యులు చైర్మన్‌ను క్షేమంగా ఆయన చాంబర్‌లోకి పంపించారు. ఆ తర్వాత కూడా వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. పలువురు వైసీపీ సభ్యులు చైర్మన్‌ను ఆయన పరోక్షంలో పచ్చి బూతులు తిట్టారు.
 ‘ఒరేయ్‌... తరేయ్‌అంటూ రాయడానికి వీల్లేని పదాలనూ ప్రయోగించారు. ఎంఏ షరీఫ్‌ మతాన్ని కూడా ప్రస్తావిస్తూ దూషించారు. చైర్మన్‌ను తిడుతున్న దృశ్యాలను నారా లోకేశ్‌ సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా...  మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ఆయన వద్దకు వచ్చారు. లోకేశ్‌ చేతిలో ఫోన్‌ లాక్కోడానికి ప్రయత్నించారు. మరో ఇద్దరు మంత్రులూ వచ్చి లోకేశ్‌ను చుట్టుముట్టి, ఫోన్‌ లాక్కోవాలని చూశారు. ఈ సందర్భంగా ఆయనను కొట్టినంత పని చేశారు. యనమల రామకృష్ణుడుతోపాటు మరికొందరు ఎమ్మెల్సీలు రక్షణగా రావడంతో... లోకేశ్‌ అక్కడి నుంచి బయటపడ్డారు. సందర్శకుల గ్యాలరీలో ఉన్న శ్రీకాళహసి ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి మండలిలో ఉన్న టీడీపీ సభ్యులను బూతులు తిట్టడం కనిపించింది.

 గ్యాలరీలో హైటెన్షన్‌ : అంతకు ముందు గ్యాలరీలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణం ఏం జరుగుతుందో! అది ఎక్కడిదాకా వెళుతుందోఅనే హైటెన్షన్‌! చైర్మన్‌ తన నిర్ణయం ప్రకటించకమునుపు... సభ వాయిదా పడిన సమయంలో అధికార, విపక్ష సభ్యులు వీఐపీ గ్యాలరీలో ఇరుపక్షాలకు చెందిన బడా నేతలు కూర్చున్నారు. తొలుత టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు చిన రాజప్ప, బాలకృష్ణ గ్యాలరీలో ఉన్నారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత... అధికార పక్షానికి చెందిన సుమారు పాతికమంది ఎమ్మెల్యేలు అదే గ్యాలరీలోకి వచ్చారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా అక్కడికి వచ్చారు. వచ్చీరాగానే బాలకృష్ణను పలకరించారు. ఆయనతోపాటు సెల్ఫీ దిగారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...