Jan 16, 2020

అమరావతిని రక్షించండి


15-01-2020
సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఎంపీ సుజనా చౌదరి లేఖ
రాజధానిని కొనసాగిస్తే రూ.1.13 లక్షల కోట్ల ఆదాయం
తరలిస్తే... రూ.4 లక్షల కోట్ల పరిహారం చెల్లించాలి
‘‘అమరావతిని రక్షించండి. అది మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను రక్షిస్తుంది. ఇప్పటికైనా చిన్న చిన్న రాజకీయ వైరాలు పక్కనపెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి కోసం అమరావతినే రాజధానిగా కొనసాగించండి’’ అని కోరుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఎంపీ సుజనా చౌదరి లేఖ రాశారు. ‘‘రాజధాని అని పేరు పెట్టినంత మాత్రాన అది రాజధాని అయిపోదు. అసెంబ్లీ, సచివాలయం, ఉద్యోగుల క్వార్టర్లు.. ఇవన్నీ ఉండాలి. అవన్నీ అమరావతిలో ఇప్పటికే ఉన్నాయి. అమరావతిలో ఉన్న భూముల్ని అభివృద్ధి చేసి పలు సంస్థలు, ప్రాజెక్టులకు కేటాయించడం ద్వారా ఆ పని సాకారమవుతుంది. ప్రధాని మోదీ నిర్దేశించిన 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీకి కూడా తోడ్పడుతుంది. అమరావతిలోని భూములను అభివృద్ధి చేస్తే... ఖర్చులు పోను, రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.1.13 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. ఒకవేళ అమరావతిని ఇక్కడి నుంచి తరలిస్తే రైతులకు, ఇతరులకు కలిపి సుమారు రూ.4 లక్షల కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉంటుంది’’
 కమిటీ చెప్పింది ఇదీ...
రాజధాని విషయంపై సిఫార్సులు చేసేందుకు ఒక సలహా కమిటీని జీవో 133 ద్వారా ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు... అంటే దక్షిణాన చివరిలో ఉన్న అనంతపురానికి, తూర్పున చివరిలో ఉన్న శ్రీకాకుళానికి అమరావతి సమదూరంలో ఉంటుందని ఆ కమిటీ చెప్పింది. ‘‘రాష్ట్రంలోని ప్రతి మూల నుంచీ రోడ్‌, రైలు అనుసంధానం ఉంది. గన్నవరం విమనాశ్రయం సమీపంలోనే ఉంది. పైగా అత్యంత కీలకమైన తాగునీరు అమరావతిలో 24 గంటలు, ఏడాది పొడవునా సరఫరా చేయగలం. ప్రసిద్ధ శాతవాహనుల రాజధానిగా వర్ధిల్లిన అమరావతికి చారత్రిక ప్రాధాన్యత కూడా ఉంది’’ అని సిఫార్సు చేసిందన్నారు. ఆ సిఫార్సుల ఆధారంగా నాటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ఆ నిర్ణయాన్ని తెలుగుదేశం, వైసీపీ, బీజేపీలు శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదించాయన్నారు. ఆ తర్వాత 29,754 మంది చిన్న, సన్నకారు రైతులు 33,771 ఎకరాలను భూ సమీకరణ కింద ఇచ్చారని,. దీనికి ప్రభుత్వ భూమి 19,876 ఎకరాలు కలిసిందని పేర్కొన్నారు.
 మొత్తం 53,647 ఎకరాలు సమకూరిందనీ, దీనిలో నవనగరాలు నిర్మించాలని ప్రభుత్వం మాస్లర్‌ ప్లాన్‌ రూపొందించిందనీ తెలిపారు. ఆ మాస్టర్‌ప్లాన్‌ను అన్ని పత్రికల్లోను ప్రచురించి, అభ్యంతరాలును ఆహ్వానించిందన్నారు. అనంతరం ప్రధాని మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారనీ, కేంద్రం రూ.1500 కోట్లు ఆర్థిక సాయం చేసిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి బాండ్ల రూపంలో రూ.2 వేల కోట్ల రుణాన్ని సేకరించిందన్నారు. చివరికి ప్రజలు రూ.42 కోట్లు విరాళాలు ఇచ్చారని తెలిపారు. ‘‘వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి రూ.52,537 కోట్ల ఖర్చుతో కూడిన 62 ప్రాజెక్టులు అమరావతిలో కొనసాగుతున్నాయి. మీరు ఆశ్చర్యకరంగా అన్నింటినీ ఆపేశారు. మీరు, మీ మంత్రులు మాట్లాడుతున్న దాన్నిబట్టి రాజధానిని మార్చాలని స్పష్టంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది’’ అని లేఖలో పేర్కొన్నారు.
 మారిస్తే భారమే...
‘‘రైతుల నుంచి సమీకరించిన 33,771 ఎకరాల్లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు 50 శాతం, రైతుల వాటా తీసేశాక 8442.75 ఎకరాలు మిగులుతుంది. ప్రస్తుత మార్కెట్‌ విలువ ఎకరా రూ.15 కోట్లు ఉంది. అంటే రూ.1,26,641 కోట్లు వస్తుంది. మరోవైపు ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు అవుతుందని ప్రభుత్వం చెప్తోంది. కానీ ఈ భూమిలో అత్యంత అధునాతనంగా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఎకరాకు రూ.40 లక్షల చొప్పున రూ.13,608 కోట్లు అవుతుంది. ఇవిపోను రూ.1,13,133 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వానికి చెందిన 19,876 ఎకరాలు మిగులుతుంది. వీటిని పలు సంస్థలు, దిగ్గజ పారిశ్రామిక సంస్థలకు ఇవ్వొచ్చు. ఈ వివరాలన్నీ చూస్తే ప్రభుత్వం వద్ద నిధులు లేక కాదు... మనసు లేక ఇక్కడినుంచి రాజధానిని తరలించాలని భావిస్తోందని అర్థమవుతోంది. ఇప్పటికే ఉన్న భవనాలకు తోడు మరో రూ.3 వేల కోట్లు ఖర్చుపెడితే మిగిలిన భవనాల పనులు పూర్తిచేయవచ్చు.
 ఈ తరుణంలో రాజధాని మార్పు సహేతుకం, న్యాయసమ్మతం అయినది కాదు. మరోవైపు రాజధానని తరలిస్తే సుమారు రూ.2 లక్షల కోట్లు రైతులకు నష్టపరిహారంగా చెల్లించాలి. ఇప్పుడు అక్కడ గజం రిజిస్ర్టేషన్‌ విలువ రూ.5 వేలు ఉంది. అంటే ఎకరాకు 4480 గజాలకు కలిపి రూ.2.24 కోట్లు. నూతన భూసేకరణ చట్టం ప్రకారం రెండున్నర రెట్లు... అంటే రూ.5.60 కోట్లు ఇవ్వాలి. 33,177 ఎకరాలకు కలిపి రూ.1,89,117 కోట్లు చెల్లించాలి. దీనికి 12 శాతం వడ్డీ కలిపితే రెండు లక్షల కోట్లు అవుతుంది. అదే సమయంలో ఇక్కడ భూములు, స్థలాలు కొనుగోలు చేసినవారికి పరిహారంగా మరో రూ.2 లక్షల కోట్లు చెల్లించాల్సి వస్తుంది’’ అని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...