Jan 13, 2020

జాతీయ మహిళా కమిషన్ బృందం పర్యటన


12-01-2020

v తుళ్లూరు, మందడం గ్రామాల్లో స్థానిక మహిళలు జనవరి 10వ తేదీ శుక్రవారం పాదయాత్రగా బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు బయల్దేరగా.. పోలీసులు అడ్డగించి లాఠీలతో కుళ్లబొడిచారు. ఈ సంఘటనపై ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ స్పందించకపోయినా.. జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ)  స్పందించి సుమోటోగా కేసు చేపట్టి ఓ బృందాన్ని ఇక్కడకు పంపింది. సీనియర్‌ కో-ఆర్డినేటర్‌ కాంచన్‌ కట్టర్‌, కౌన్సెలర్‌ ప్రవీణ్‌సింగ్‌ ఆదివారం ఉదయం గుంటూరుకు చేరుకుని అక్కడి ఆర్‌ అండ్‌ బీ అతిథిగృహంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం టీడీపీ నాయకులు, మహిళా పోలీసులు వేర్వేరుగా వారికి ఫిర్యాదులు చేశారు. అయితే జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులు తూతూమంత్రంగా తంతు నడిపించారు. రాజధాని గ్రామాలను సందర్శించనేలేదు. బాధిత మహిళల గోడు వినిపించుకోలేదు. తుళ్లూరులో 5 నిమిషాలకు మించి ఉండలేదు.   ఇలా వచ్చామా.. అలా వెళ్లిపోయారు.
v గుంటూరు నుంచి తుళ్లూరు 30 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. అయితే జిల్లా అధికారులు కమిషన్‌ సభ్యులను తాడికొండ, పెదపరిమి మార్గంలో కాకుండా చుట్టూ తిప్పి కరకట్ట మార్గంలో తుళ్లూరు తీసుకువెళ్లారు. బృందం అక్కడకు వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటిగంట దాటింది.  కారు  దిగడానికి ఇష్టపడని కట్టర్‌ ని గల్లా జయదేవ్‌, హైకోర్టు అడ్వొకేట్లు  పలుమార్లు విజ్ఞప్తి చేసి క్షతగాత్రుల వద్దకు తీసుకెళ్లారు. దొండపాడుకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి యశస్విని తనపై పోలీసులు ఎలా దాడి చేశారో తెలియజేసింది.  కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి తమ పెద్దవాళ్లు బయల్దేరితే పోలీసులు వాళ్లను వ్యాన్‌ ఎక్కించారని.. ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగినందుకు తన కాళ్లపై లాఠీలతో కొట్టారని విలపిస్తూ చెప్పింది.
v దొండపాడులో బాధితురాలు జి.లక్ష్మి: తమను ఇక్కడ బతకనివ్వడం లేదు. ఒక్కో మనిషికి 15 మంది పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. ఎక్కడపడితే అక్కడ కొట్టారు. మీ కులం ఏమిటని అడిగారు. ఉదయం 9.30కి అరెస్టు చేసి ఎక్కడెక్కడో తిప్పి రాత్రికి వదిలి పెట్టారు.
v గుంటూరు, విజయవాడ నుంచి వచ్చిన డాక్టర్లు: తమను శాంతియుతంగా ర్యాలీ చేయనివ్వడం లేదు. చేస్తే కొడతామని పోలీసులు బెదిరిస్తున్నారు. గృహనిర్బంధం చేస్తున్నారు.
v మిగతా బాధితుల గోడు వినకుండా.. ఒక్క మాటైనా మాట్లాడకుండా సభ్యులు వడివడిగా అక్కడి నుంచి నిష్క్రమించారు. మందడం వస్తారని ఆ గ్రామంలో వందల మంది మహిళలు ఎదురుచూశారు. కానీ సభ్యులు నేరుగా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు వెళ్లిపోయారు. 500 మంది బాధిత మహిళలు వచ్చి వారి గోడు వినిపించేందుకు ప్రయత్నించగా ఐదు నిమిషాలు కూడా కేటాయించలేదు. బాధితులు వినతిపత్రాలు, పోలీసుల దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను వారికి అందజేశారు.
v విజయవాడలో:  స్టేట్‌ గెస్ట్‌ హౌస్ కు మహిళా కమిషన్‌ సభ్యులు వస్తారని వందలాది మంది బాధిత మహిళలు వేచి ఉన్నారు. కానీ సభ్యులు నేరుగా విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు వెళ్లి సీపీ ద్వారకాతిరుమలరావుతో అరగంటకుపైగా చర్చించారు. బాధిత మహిళలు అక్కడకు వచ్చినా వారిని పట్టించుకోలేదు సీపీని కలిశాక సభ్యులు నేరుగా ఆయుష్‌ ఆస్పత్రికి వెళ్లి, అక్కడ చికిత్స పొందుతున్న బాధితురాలు శ్రీలక్ష్మిని కలిసి దాడి వివరాలు సేకరించారు. ఆస్పత్రి వద్దకూ వందల మంది బాధిత మహిళలు రాగా.. పోలీసులు పక్కకు లాగేశారు.
v   టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ : పోలీసుల దాడిపై మేం చెప్పిందంతా మహిళా కమిషన్ సభ్యులు నమోదు చేసుకున్నారు. మహిళలపై పోలీసుల దాడికి సంబంధించిన ఆధారాలన్నీ కమిషన్ కు ఇచ్చాం - మహిళా కమిషన్ సభ్యులు ఢిల్లీ వెళ్లాక పూర్తి నివేదిక రూపొందిస్తారు. కమిషన్ నివేదిక రైతులకు అనుకూలంగా ఉంటుందని అనుకుంటున్నా. రాజధాని గ్రామాల్లో సెక్షన్ 144, పోలీసు సెక్షన్ 30ని తొలగించాలి.  
v  టీడీపీ ఎంపీ కేశినేని నాని: మూడు వేల మంది మహిళలు పడ్డ ఇబ్బందులను జాతీయ మహిళా కమిషన్‌కు వివరించాం. 500 వీడియోలు, 1000 ఫొటోలను ఇచ్చాం.  మహిళలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. మహిళలని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చేశారు.
v   టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ: పోలీసులు అర్ధరాత్రి ఇంటి తలుపులు కొట్టి మహిళలను ఇబ్బంది పెడుతున్నారు - మహిళలపై దాడులు జరుగుతుంటే రాష్ట్ర మహిళ కమిషన్ స్పందించటం లేదు - జాతీయ మహిళ కమిషన్ వచ్చింది.. ఇప్పటికైనా మహిళలపై దాడులు ఆపాలి.
v   వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి:  జాతీయ మహిళా కమిషన్ సభ్యులకు వాస్తవాలను వివరించాం. టీడీపీ ఎంపీలు మహిళలను ప్రేరేపించి అబద్దాలను చెప్పిస్తున్నారు. మహిళలను పావుగా వాడుకొని రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు చూస్తున్నారు.  రాజధాని గ్రామాల అభివృద్ధికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకురావాలి.  
v   పోలీసు అధికారుల సంఘం, మహిళా పోలీసులు : జాతీయ మహిళా కమిషన్‌కు వినతి పత్రం ఇచ్చిన పోలీసు అధికారుల సంఘం సభ్యులు, మహిళా పోలీసులు. విజయవాడ ర్యాలీలో పాల్గొన్న మహిళలు తమని అసభ్యకరంగా తిట్టారని ఫిర్యాదు. గతంలో జరిగిన దాడులను ఇప్పుడు జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారు. సామాజిక మాద్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారు. 144 సెక్షన్‌, పోలీసు యాక్టు-30 అమల్లో ఉన్న నేపథ్యంలో మహిళలు భారీ ర్యాలీగా వస్తుండడంతో వారిని అడ్డుకున్నాం. విధినిర్వహణలో ఉన్న తమపై రాజధాని ప్రాంత మహిళలే దురుసుగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.  
v భారత మహిళా జాతీయ సమాఖ్య (ఎన్‌ఎఫ్‌డబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి అన్నెరాజా:  లాఠీ దెబ్బలకు గాయపడిని వారిని సక్రమంగా పరామర్శించలేదు. వారి ఆవేదన తెలుసుకోలేదు. కనీసం 20 మందితోనైనా మాట్లాడతారని భావించాను. అసలు గుంటూరు నుంచి నేరుగా కాకుండా 60 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వచ్చారు. రావడం లేటైతే అందరూ వెళ్లిపోతారని వారు భావించి ఉంటారు. మేం ఢిల్లీ వెళ్లిన వెంటనే మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖాశర్మను కలిసి ఫిర్యాదు చేస్తాం.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...