Jan 5, 2020

అమరావతి రైతులు కారుణ్య మరణానికి రాష్ట్రపతికి లేఖలు


31.12.2019 : రాష్ట్రపతి కోవింద్‌కు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వమని లేఖలు రాసిన రాజధాని రైతులు. రాజధానిలోని నవులూరుకు చెందిన ఆర్‌వీ శ్రీనివాసరావు అనే రైతు నేతృత్వంలో ఆ గ్రామంలోని రైతులు పెద్ద సంఖ్యలో ఈ మేరకు రాష్ట్రపతికి లేఖలు పోస్టు చేశారు. కారుణ్య మరణం కోసం కన్నీటి ధారల విన్నపం అంటూ తమ గోడు వెళ్లబోసుకొన్నారు.
‘‘మేము ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి భూములు ఇచ్చాం. సీఎం జగన్‌ తీసుకొన్న మూడు రాజధానుల నిర్ణయంతో మేమంతా ఉన్నపళంగా రోడ్డున పడ్డాం. రాష్ట్ర విభజనతో రాజధాని కూడా లేని ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని నిర్మాణం కోసం మేమంతా ముందుకొచ్చి 33 వేల ఎకరాల భూమిని నాటి తెలుగుదేశం ప్రభుత్వానికి అప్పగించాం. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 2014 సెప్టెంబరులో అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా అమరావతి నిర్మాణానికి మా పొలాలను ప్రభుత్వానికి ఆనందంగా ఇచ్చాం. 2019 ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్ష నేత జగన్‌ రాజధానికి భూములు ఇచ్చిన మమ్మల్ని అభినందించారు. అమరావతే రాజధాని అని మాటిచ్చారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. కేవలం వ్యక్తుల స్వలాభం కోసం ముఖ్యమంత్రి రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారు. రాజధానిని మార్చవద్దంటూ మా కుటుంబాలతో కలిసి 14 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా మమ్మల్ని పట్టించుకొన్న వారు లేరు. మాగోడు వినిపించుకొన్న వారు లేరు. పైగా అధికార పార్టీ నేతలు మా త్యాగాన్ని హేళన చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న శాసనసభాపతి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజధానిని శ్మశానం, ఎడారి అంటున్నారు. రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మాపై దాడులకు దిగుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అర్ధరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి మమ్మల్ని జైళ్లలో పెడుతున్నారు. హత్యాయత్నం అంటూ మాపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మా బతుకులు రోడ్డున పడ్డాయి. మా పిల్లల భవిష్యత్‌ ప్రశ్నార్థకమైంది. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టింది. ఒక మంచి కార్యం కోసం మేం చేసిన త్యాగాలకు దక్కిన ఫలితమిది! ఏపీ ప్రభుత్వం తీసుకొన్న అవివేక నిర్ణయంతో భవిష్యత్తులో ప్రభుత్వాలకు భూములు ఇచ్చేందుకు ఎవరైనా ముందుకొస్తారా? ఈ బతుకులు మాకొద్దు. మా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి’’ అని లేఖలో కోరారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...