Jan 14, 2020

రాజధానిని మార్చడమే లక్ష్యం



ముందు ముంపు ప్రాంతమన్నారు, ఒకే సామాజికవర్గమనీ ప్రచారం, రైతులపై ధనిక, పెయిడ్‌ ముద్ర
ఇన్‌సైడర్‌అంటూ మరో యాగీ, అన్ని వాదనలూ తేలిపోయినవే.

ముంపు ప్రాంతం : అమరావతి ముంపు ప్రాంతంలో ఉందనే వాదన తొలిసారి మంత్రులు తెరపైకి తెచ్చారు. మునుగుతుంది... మునుగుతుందిఅని పదేపదే చెప్పారు. ముంపు ప్రాంతంలో రాజధాని ఏంటని ప్రశ్నించారు.

కాదని చరిత్రే చెప్పింది : రాజధానికి ముంపు ప్రమాదం ఉందని గతంలోనే గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో కొందరు కేసులు కూడా వేశారు. కృష్ణా నది వరదను అధ్యయనం చేసి ఈ ట్రైబ్యునల్‌ తీర్పు ఇచ్చింది. చరిత్రలో కృష్ణా నదికి అతి పెద్ద వరదలు రెండుసార్లు వచ్చాయి. 1853లో, 2009లో! ఆ రెండుసార్లూ రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి ప్రాంతం ముంపునకు గురికాలేదు. 150 ఏళ్ల చరిత్ర చూసినా అమరావతి ముంపు ప్రాంతం కాదని స్వయంగా గ్రీన్‌ ట్రైబ్యునల్‌ తెలిపింది. ఇటీవల భారీ వరదల సమయంలోనూ అమరావతిలోకి చుక్కనీరు రాలేదు. కృష్ణా నది కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూడా వరద నీరు తాకలేదు. నిజానికి... మెరుపులా వచ్చి పోయే కొండవీటి వాగు వల్ల కొంతప్రాంతానికి ముంపు ప్రమాదం ఉందని, దీనిని నివారించేందుకు ఎత్తిపోతల పథకాన్ని కూడా నిర్మించారు. అంటే... అమరావతి ప్రాంతాన్ని గతంలో వరద ముంచెత్తలేదు. భవిష్యత్తులో ముంచెత్తే అవకాశమూ లేదు.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ : అమరావతిలో అక్రమాలు జరిగాయంటూ మంత్రులు ఆరోపించారు. వేల ఎకరాలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నారు. బాలకృష్ణ వియ్యంకుడికి వందల ఎకరాల భూములున్నాయని, బీజేపీ నేత సుజనా చౌదరికీ ఉన్నాయని, చంద్రబాబు హెరిటేజ్‌ కోసం భూములు కొన్నారని, ఏపీఎన్‌ఆర్‌టీ రవికుమార్‌ కొనుగోలు చేశారని, ఆయన లోకేశ్‌ బినామీ అని ఆరోపణలు చేశారు. అమరావతిలో అసైన్డ్‌ భూముల వ్యవహారంలోను పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని విమర్శించారు.

ఔట్‌ చేయలేకపోయారు: బాలకృష్ణ వియ్యకుండికి భూమి ఇచ్చింది కిరణ్‌ కుమార్‌ రెడ్డి సర్కారు. అది కూడా రాజధాని ప్రాంతానికి పదుల కిలోమీటర్ల దూరంలోని జగ్గయ్యపేటలో. ఈ స్థలం కేటాయింపు ధరను టీడీపీ సర్కారు పెంచింది. దీంతో అసలు తమకు ఆ స్థలమే వద్దని వారు చెప్పేశారు. ఇప్పటికీ ఆ స్థలం ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది. సుజనా చౌదరి స్వగ్రామంలో తనకు ఎప్పటి నుంచో భూములున్నాయని... రాజధాని వచ్చాక కొనుగోలు చేసిందేమీ లేదని చెప్పారు. వేమూరి రవికుమార్‌ 2005లో కొన్న భూములనూ ఇన్‌సైడర్‌లో కలిపేశారు. ఆ తర్వాత మళ్లీ రాజధాని ప్రకటన వచ్చాక.. మరికొంత భూమి కొన్నానని తెలిపారు. హెరిటేజ్‌ సంస్థ కూడా దీనిపై స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ ఆరోపణలను నిరూపించాలని పలువురు సవాల్‌ విసిరారు. పరువు నష్టం దావాలూ వేశారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌అంటూ మంత్రుల కమిటీ ఒక నివేదిక ఇచ్చింది.అందులో ఏముందో  ఎవరికీ తెలియదు.

సన్నకారు రైతులే 86 శాతం: రాజధానికి 29,881 మంది రైతులు, 34,322 ఎకరాలు ఇచ్చారు. వారిలో 20,490 మందికి ఎకరం కంటే తక్కువే ఉంది. ఇందులో పావు ఎకరం, అరెకరం ఉన్నవారూ ఉన్నారు. మరో 5,227 మందికి ఎకరం నుంచి రెండెకరాల మధ్యలో భూమి ఉంది. మొత్తంగా చూస్తే 86 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే. ఈ లెక్కలు ప్రభుత్వం వద్ద కూడా ఉన్నాయి.

రైతులంతా ధనికులు, పెయిడ్‌ ఆర్టిస్టులు : రైతుల చేతుల్లో ఐ-ఫోన్లు ఉన్నాయి. వారికి ఎకరాలకు ఎకరాలు భూములున్నాయి. వారంతా ధనవంతులు అంటూ... ఇతర ప్రాంతాలవారిలో రాజధాని రైతులపై కనీస సానుభూతి రాకుండా చూడాలని ప్రయత్నించారు. మరోవైపు... పెయిడ్‌ ఆర్టిస్టులన్న పదంపై రైతులు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆధార్‌ కార్డులు చూపిస్తూ... మేం పెయిడ్‌ ఆర్టిస్టులమాఅని ప్రశ్నిస్తున్నారు.

ఒకే సామాజిక వర్గం : ఒక సామాజిక వర్గానికి మేలు చేసేందుకే అమరావతిని రాజధానిగా నిర్ణయించారుఅని మంత్రులు పేర్కొన్నారు. కమ్మ సామాజిక వర్గం ఉన్నచోటే రాజధాని పెట్టారని ప్రచారం చేశారు.

ఎప్పటి నుంచో ఎస్సీ రిజర్వుడు:   రాజధాని గ్రామాలున్న తాడికొండ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు. అక్కడ జనాభాలో వారిదే అగ్రభాగం. రాజధానిలోని కొన్ని గ్రామాల్లో కాపు సామాజిక వర్గం వారు అత్యధికంగా ఉన్నారు. బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. లెక్కలు చూస్తే అందరికంటే తక్కువగా ఉన్నది కమ్మ సామాజికవర్గమే. ఇంకోవైపు రాజధాని ప్రాంతానికి ఆనుకుని ఉన్న మంగళగిరి నియోజకర్గంలోనూ బీసీలే అత్యధికం. తాడేపల్లిలో రెడ్డి సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉన్నారు. ఈ లెక్కలన్నీ బయటకు వచ్చాక ఒక సామాజిక వర్గం కోసమే అమరావతిఅనే వాదన పక్కకుపోయింది.

మిగిలిన ప్రాంతాల మాటేమిటి: మూడు ప్రాంతాల అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని, విజయవాడలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ చెప్పారు.

అభివృద్ది వికేంద్రీకరణే మార్గం: రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాల్సిందే. కానీ, జరగాల్సింది రాజధాని వికేంద్రీకరణ కాదు. అభివృద్ధి వికేంద్రీకరణ. కార్యాలయాలను అక్కడొకటి, ఇక్కడొకటి పెట్టడంవల్ల ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే వెళతారు. కొత్తగా ఎలాంటి ఉద్యోగాలూ రావు. ఉపాధి, ఉద్యోగాల సృష్టికి ప్రాజెక్టులు రావాలి. విశాఖపట్నంలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే అదానీ డేటా సెంటర్‌ ప్రాజెక్టు, లూలూ కన్వెన్షన్‌ హాల్‌, టవర్లు వస్తే... వేలకొద్దీ ఉద్యోగాలు వచ్చేవి. ఆ రెండూ మన రాష్ట్రానికి టాటా చెప్పేశాయి. అందరికీ అభివృద్ధి... అందరి కోసం అమరావతిఅనే నినాదమే విధానంగా అనేక ప్రణాళికలు రూపొందాయి. వాటిని యథాతథంగా అమలు చేస్తే చాలు!

లక్ష కోట్లు కావాలి:  అమరావతిని అభివృద్ధి చేయాలంటే లక్ష కోట్ల రూపాయలు కావాలి! అంత సొమ్ము ఎక్కడి నుంచి తీసుకొచ్చేది! మొత్తం డబ్బులు అమరావతిపైనే పెడితే ఎలా? అంటూ మరో వాదన తెచ్చారు.

పైసా లేకుండా నడపలేదా?:  వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతి నుంచే ఏడు నెలలుగా పాలన సాగిస్తున్నారు. ఒక్క పైసా ఖర్చు కాలేదే!. ఇక్కడ అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రాజ్‌భవన్‌, డీజీపీ కార్యాలయం అన్నీ ఉన్నాయి. ఉద్యోగులు, జడ్జిల క్వార్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాలు 50 నుంచి 70 శాతం పూర్తయ్యాయి. స్వల్ప సొమ్ముతో వీటిని పూరి చేయవచ్చు. అంతేకాదు.. గత రెండేళ్లలో అనేక నూతన భవనాలను నిర్మించారు. అమరావతిలో అన్ని అవసరాలకుపోను ప్రభుత్వానికి మిగిలిన ఏడువేల ఎకరాలను విక్రయిస్తే లక్ష కోట్లకుపైనే వస్తాయని... అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ప్రాజెక్టు అని చంద్రబాబు చెబుతున్నారు. ఇక్కడున్న భవనాలు, ఏర్పాట్లు, సాగుతున్న పాలన గురించి అందరికీ అర్థమయ్యాక... లక్ష కోట్లవాదనలోనూ పసలేదని తేలిపోయింది.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...