Mar 1, 2018

విజయవాడను సుందర నగరంగా తీర్చిదిద్దండి


అధికారులకు సీఎస్ దినేష్ కుమార్ ఆదేశం

           సచివాలయం, మార్చి 1: విజయవాడకు అన్ని హంగులు సమకూర్చి సుందర నగరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ (వీఎంసీ) అభివృద్ధి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విజయవాడను కొంతకాలం రాజధాని నగరంగా భావించి మాస్టర్ ప్లాన్ రూపొందించుకొని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందన్నారు. దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించమని చెప్పారు. వచ్చే వర్షాకాలం నాటికి నగరంలో వరద నీరు నిలబడకుండా పారుదల అయ్యేవిధంగా కాలువలను ఆధునీకరించాలని ఆదేశించారు. మురుగు కాలువలు, రోడ్లు, ఫుట్ పాత్, త్రాగునీరు, చెత్త తరలింపు, సుందరీకరణ పనులను వేగవంతం చేయాలన్నారు. వచ్చే నెల సమీక్ష నాటికి అన్ని పనుల్లో ప్రగతి కనిపించాలని చెప్పారు.  ప్లాస్టిక్ వేస్టేజీని రీసైక్లింగ్, రీ ప్రాసెసింగ్ చేయించాలని సీఎస్ సూచించారు.
వరదనీటి పారుదల కాలువల అభివృద్ధి పనులు, జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రిన్యూవల్ మిషన్ (ఎఎన్ఎన్ యుఆర్ఎం), ప్రధాన మంత్రి ఆవాస్ యోజన- అందరికీ ఇళ్లు(పీఎంఏవై-హెచ్ ఎఫ్ ఏ) పథకాల కింద గృహ నిర్మాణాలు, అమృత ప్రాజెక్టు, డంప్ యార్డ్, ప్లాస్టిక్ వేస్టేజీ, మోట్రో పనుల గురించి అధికారులు వివరించారు.
నాలుగు జోన్లుగా విభజనకు ప్రతిపాదన
విజయవాడ నగరం సుందరీకరణలో భాగంగా పరిపాలనా సౌలభ్యం కోసం నాలుగు జోన్లుగా విభజించాలని విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ జె.నివాస్ ప్రతిపాదించారు. వీఎంసీ బడ్జెట్ ను కూడా వివరించారు. నగరం అభివృద్ధికి అదనపు నిధులు కావాలని కమిషనర్  కోరారు.  జోనల్ అధికారుల నియామకం, 51 గ్రామాలు వీఎంసీలో విలీనం, పుష్కరాల పనులు, మోడల్ మున్సిపాలిటీలు తదితర అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కె.కరికాల వలవన్, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...