Mar 16, 2018

అతిసార బాధితులకు ప్రభుత్వం అండ



మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే మోదుగుల

Ø రోగులకు కార్పోరేట్ ఆస్పత్రులలో కూడా చికిత్స
Ø ప్రతిరోజూ సీఎం సమీక్ష
Ø 8 మంది బాధ్యుల సస్పెన్షన్
Ø క్రిమినల్ కేసులకు చర్యలు
Ø మృతుల నిర్ధారణకు కమిటీ నియామకం
Ø మృతులకు చంద్రన్న బీమాతోపాటు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా
Ø పవన్ కు దీక్ష చేసే అవకాశం ఇవ్వం
Ø 48 గంటల్లో సమస్యల పరిష్కారం

           సచివాలయం, మార్చి 16: గుంటూరులోని అతిసార వ్యాధి బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు డాక్టర్ పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల రెడ్డి చెప్పారు. శాసనసభ ప్రాంగణలోని మీడియా పాయింట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం వారు మాట్లాడారు. గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం వద్ద ట్యాంకులో నిల్వ ఉన్న నీరు కలుషితం అవడం వల్ల ఆ ప్రాంతంలోని వారు అతిసార(డయేరియా) బారినపడ్డారని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ఇంటింటికి తిరిగి బాధితులను గుర్తించి ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆ ప్రాంతాల్లో పది మెడికల్ క్యాంపులు, పది అంబులెన్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం రోగులకు ప్రభుత్వ ఆస్పత్రితోపాటు కార్పోరేట్ ఆస్పత్రులలో కూడా చికిత్స చేయిస్తున్నామని, ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తున్నట్లు తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యుల సూచనల మేరకు కొంతమందిని కార్పోరేట్ ఆస్పత్రులలో చికిత్స చేయిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఇంకా ముగ్గురు కార్పోరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి  ఇప్పటి వరకు ప్రతి రోజు పరిస్థితిని సీఎం సమీక్షిస్తున్నట్లు చెప్పారు. నీరు కలుషితం అవడానికి  బాద్యులైన 8 మంది శానిటేషన్, ఇంజనీరింగ్ సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇంకా బాధ్యులు ఎవరైనా ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మొత్తం 130 మంది ఆసుపత్రిలో చేరారని, ఆ సంఖ్య ఈరోజుకు 82కు తగ్గినట్లు తెలిపారు.  మరణించిన వారు ఎంతమందో నిర్ణయించడానికి ఒక కమిటీ వేశామని, 8 మంది మరణించినట్లు ప్రస్తుతానికి ఆ కమిటీ నిర్ధారించిందని, ఆ కుటుంబాల వారికి చంద్రన్న బీమాతోపాటు రూ.5లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇచ్చినట్లు వివరించారు. తామే  మృతుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అంజేసినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా మరణించినట్లు ఆ కమిటి నిర్ధారిస్తే వారికి కూడా ఎక్స్ గ్రేషియా అందజేస్తామన్నారు.  తాము ఆస్పత్రికి వెళ్లి రోగులను రోగులను పరామర్శించామన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మునిసిపల్, ఇంజనీరింగ్, వైద్య ఆరోగ్య శాఖల సిబ్బంది రక్షిత మంచినీరు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అతిసారం వ్యాపించిన ప్రాంతాలకు 75 ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ట్యాంక్ లను సూపర్ క్యూరినేషన్ చేయించినట్లు తెలిపారు. రాత్రి 11.30 గంటల వరకు తాము ఆ ప్రాంతంలో ఇంటింటికి తిరిగి నీరు ఎలా వస్తుందో విచారించామని, మంచినీరు వస్తున్నట్లు వారు తెలిపారన్నారు. గుంటూరులో 40 ఏళ్ల క్రితం అమర్చిన మంచినీటి సరఫరా పైప్ లైన్లను మార్చడానికి గత ఫిబ్రవరి 20న టెండర్లు పిలిచినట్లు చెప్పారు.
            ఇటువంటి సంఘటన జరిగిన సందర్భంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలోపెట్టుకొని విలువైన సలహాలు, సూచనలు ఇవ్వడానికి బదులు దీనిని రాజాకీయం చేయడానికి కొందరు నాయకులు రావడం భావ్యంకాదన్నారు. సమస్య పరిష్కారానికి సద్విమర్శలు చేయాలన్నారు. రాళ్లువేయడం తగదన్నారు.  నిర్మాణాత్మక సలహాలు ఇవరిచ్చినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ విమర్శలను స్వాగతిస్తున్నామని, ఆయనకు దీక్షకు కూర్చునే అవకాశం ఇవ్వం అని, 48 గంటల లోపలే అన్ని అంశాలు పరిష్కరిస్తామని చెప్పారు. గుంటూరు ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దుతామని, ఇప్పటికే గుంటూరు అభివృద్ధికి రూ.2వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...