Mar 8, 2018

జగన్ వల్లే మా బంధం తెగింది



బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు
          సచివాలయం, మార్చి 8: వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, శాసనసభలో  ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన రెడ్డి  రోడ్డెక్కి  ప్రత్యేక హోదా అని తిరుగుతూ ఉండడమే టీడీపీ, బీజేపీ మైత్రీ బంధం తెగిపోయేలా చేసిందని బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు అన్నారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద గురువారం ఉదయం విలేకరులతో మాట్లాడారు. జగన్ వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. ఆయన స్థిరమైన వ్యక్తి కాదన్నారు. టీడీపీ మంత్రులు కేంద్రంలో రాజీనామా చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని, అదేవిధంగా తమ మంత్రులు కూడా రాజీనామా చేస్తారని చెప్పారు. ఎవరి రాజకీయ వ్వ్యూహాలు వారికుంటాయన్నారు. సీఎం మాటల ప్రకారం వారు ఎన్డీఏలో కొనసాగుతారని అర్ధమైందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామని చెప్పినట్లు తెలిపారు. 2014 తర్వాత  ఏ రాష్ట్రానికి హోదా ఇవ్వలేదని,  అందుకే దానికి సమానంగా ప్యాకేజీ ఇస్తామన్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రజల్లో సెంటిమెంట్ ఉందని, అలా అని ఓట్ల కోసం రాజకీయం చేయకూడదన్నారు. అయితే ఈ విషయంలో సీఎంని తప్పుపట్టడానికిలేదన్నారు.  ప్రజల సెంటిమెంట్ ని గౌరవిస్తూనే, రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.  శాసనసభ ప్రాంగణం సాక్షిగా ఏపీకి బీజేపీ న్యాయం చేస్తుందని చెప్పారు. విశాఖ రైల్వే జోన్ హామీ  బీజేపీ ఇచ్చిందని,  దానిని తామే తెస్తామన్నారు.
          రాష్ట్రానికి 24/7 విద్యుత్ సరఫరా చేసిన  ఘనత తమదేనని, ఆ విధంగా విభజన హామీల అంశంలో లేని ఎన్నో హామీలను నెరవేర్చినట్లు తెలిపారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో కేవలం మూడు రాష్ట్రాల్లోనే 24/7 విద్యుత్ సరఫరా జరుగుతోందని, వాటిలో ఏపీ ఉందని చెప్పారు. బీజేపీ ఏపీకి   ఏ విధంగా అన్యాయం చేసిందో చెప్పాలన్నారు. కేంద్ర నిధులు విషయానికి వస్తే ఏదైనా కార్పోరేషన్ ఏర్పాటుచేసి, దాని ద్వారా నిధులు తీసుకునే ఏర్పాటు చేయమని సూచించినట్లు చెప్పారు. గతంలో 32 శాతం వచ్చే నిధులు, ఇప్పుడు 42 శాతం వస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రం విడిపోవడమే అభివృద్ధికి కారణం
విడిపోవడం వల్లే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని విష్ణుకుమార్ రాజు అన్నారు. 13 జిల్లాల్లో ఎన్నో సౌకర్యాలు వచ్చాయని, మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు వచ్చాయని, అమరావతి అభివృద్ధి, విజయవాడ అభివృద్ధి ..ఇవన్నీ రాష్ట్రం విడిపోవడం వల్లే జరిగినట్లు వివరించారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.
*****

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...