Mar 1, 2018

ఎయిమ్స్ పనుల వేగం పెంచండి



అన్ని విభాగాల అధికారులకు సీఎస్ దినేష్ కుమార్ ఆదేశాలు
            సచివాలయం, మార్చి1: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్(ఆలిండియా మెడికల్ సైన్సెస్) నిర్మాణానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని సంబంధిత విభాగాల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) దినేష్ కుమార్ ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ మొదటి అంతస్తులోని సీఎస్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం ఎయిమ్స్ కు సంబంధించిన పనులను సమీక్షించారు. అన్ని విభాగాల సమిష్టి కృషితో ఎయిమ్స్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సీఎస్ చెప్పారు. పనుల ప్రగతికి సంబంధించి ప్రతి అంశాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.   విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం ఆరు నెలలో పూర్తి చేయమని ఏపీ ట్రాన్స్ కో అధికారులను సీఎస్ ఆదేశించారు. ఎయిమ్స్ కు కేటాయించిన స్థలంలో ఉన్న భవనాలను ప్రస్తుతం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్డీఆర్ఎఫ్) వారు  ఉపయోగించుకుంటున్నారు. సాధ్యమైనంత త్వరగా వాటిని ఖాళీ చేయమని వారికి చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్ వారు ఖాళీ చేసిన వెంటనే ఆ భవనాలను కూల్చివేసి, నేలను చదును చేయించి వెంటనే పనులు చేపట్టేవిధంగా చర్యలు చేపట్టమని ఆదేశించారు.  భూముల కేటాయింపులకు సంబంధించిన లాంఛనాలన్నీ పూర్తి చేసి, ప్లాన్ కు కూడా వెంటనే అనుమతులు మంజూరు చేయమని  సీఆర్డీఏ
అధికారులకు చెప్పారు. ఆ భూమికి సంబంధించిన మ్యాప్ ని అధికారులు సీఎస్ కు చూపించి వివరించారు. ఎయిమ్స్ కు నీటి సరఫరా కోసం కూడా తగిన చర్యలు చేపట్టమన్నారు. అన్ని విభాగాల అధికారులను సంప్రదిస్తూ, సమన్వయపరుస్తూ చురుకుగా పనులు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ కు సూచించారు.
ఈ ఏడాది నుంచే ఎయిమ్స్ తరగతులు
ఎయిమ్స్ మొదటి దశలో అవుట్ పేషెంట్ విభాగం, గృహ నిర్మాణ పనులు చేపడతామని అధికారులు చెప్పారు. ఈ ఏడాది నుంచే ఎయిమ్స్ తరగతులను విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ప్రారంభిస్తామన్నారు. భవనాల నిర్మాణం పూర్తి అయ్యేవరకు అక్కడే తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. మొదట 50 మంది విద్యార్థులతో తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. పరిపాలనా విభాగంలోని సిబ్బందిని, అధ్యాపకులను త్వరలో నియమిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, సీఆర్డీఏ  కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ కె.కన్నబాబు, ఎయిమ్స్ సలహాదారు, స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ టీఎస్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment

అసామాన్యుల స్ఫూర్తి గాథలు

 రజా హుస్సేన్ పుస్తకంపై సమీక్ష  స్ఫూర్తి ప్రదాతలు అంటే ప్రపంచానికి అంతా తెలిసిన గొప్ప వ్యక్తులు అనుకోవద్దు. మనందరి జీవితాల్లో స్ఫూర్తినింపిన...